తాడేపల్లిగూడెం రూరల్: వృద్ధురాలిపై బిర్యానీ పాత్రతో దాడి చేసి హత్యకు కారణమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఎస్. రవికుమార్ తెలిపారు. అప్పారావుపేట గ్రామానికి చెందిన ఆరుగొల్లు రుత్తమ్మ తన మనుమరాలి పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఈ నెల 12న మెట్ట ఉప్పరగూడెంలోని తన కుమార్తె పెదముత్తి అంబిక, అల్లుడు సురేష్ ఇంటికి వెళ్లింది. ఈ నెల 14న రాత్రి పెదముత్తి సురేష్.. రుత్తమ్మ పుట్టినరోజుకు బహుమతులు, నగదు తీసుకురాలేదనే నెపంతో ఆమెతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో బిర్యానీ తయారీ పాత్రతో ఆమె తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి సోదరి రాచర్ల శారమ్మ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


