ఉండి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమా చెల్లించి రైతులను ఆదుకుంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరాం ప్రశ్నించారు. మురసు తుపాను కారణంగా ముంపునకు గురైన వరి పొలాలను ఉండి మండలం యండగండిలో సీపీఎం బృందంతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ అర్నబ్, మురసు తుపానుల ధాటికి జిల్లా రైతాంగం పూర్తిగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతి రైతు, కౌలు రైతు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారని, అధిక దిగుబడులతో పంట చేతికొస్తుందని ఆశపడితే, తుపాను కారణంగా గింజ కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, గత 30 ఏళ్లుగా మురుగు కాలువలను ఆధునికరించలేదని, వెంటనే వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ పరిశీలనలో సీపీఎం నాయకులు ధనికొండ శ్రీనివాస్, కిలారి తవిటినాయుడు, పెళ్లూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


