● నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు
● ప్రకాశరావుపాలెంలో ఘటన
దేవరపల్లి: జామతోటలో కూలి పనికి వచ్చిన మహిళలు ఆటోలో తిరిగి వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం మండలం చింతాయగూడెం నుంచి పది మంది మహిళా కూలీలు ఆటోలో శనివారం ఉదయం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో జామతోటలో పనికి వచ్చారు. అనంతరం మధ్యాహ్నం స్వగ్రామానికి తిరిగి ఆటోలో వెళుతుండగా ప్రకాశరావుపాలెం ప్రధాన కూడలిలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఆ లారీ తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్‌కు పాత ఇనుము సామగ్రితో వెళుతోంది. లారీ ఢీకొన్న వెంటనే ఆటోలో మహిళలు ఒక్కసారిగా అరవడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఆటోను ఢీకొని ఆగకుండా వెళ్లిపోతున్న లారీని అడ్డుకుని, డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆకుల కొండమ్మ, వి.వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి, జి.వెంకటలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం 108లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


