● ప్రలోభాలు, బెదిరింపులకు లొంగని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
● మాజీ మంత్రి వనిత
ద్వారకాతిరుమల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం బలంగా నిలబడ్డారని మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత అన్నారు. మండలంలోని కప్పలకుంటలో వైఎస్సార్‌సీపీ నేత జంగా వెంకట కృష్ణారెడ్డి తోటలో శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులు, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, అభ్యర్థులు, నాయకుల పనితీరు, ఎన్నికల సరళిని విశ్లేషించారు.
ప్రలోభాలు.. ఆర్థిక బలంపై చర్చ
ఎన్నికల్లో అధికారం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి కూటమి నేతలు రాజకీయాలు చేశారని పలువురు నాయకులు అన్నారు. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేయడం, వివిధ రకాల ప్రలోభాలకు గురిచేయడం కూటమి అభ్యర్థుల విజయానికి కారణమయ్యాయని పేర్కొన్నారు. కూటమికి అధికార బలం అండగా ఉన్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధైర్యంగా పోరాడారని తెలిపారు.
ప్రజాభిమానం తగ్గలేదు
అనంతరం వనిత మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీపై ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని, మరింత పెరిగిందని చెప్పడానికి పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లే నిదర్శనమన్నారు. నగదు పంపిణీ చేయకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పోటీ చేసినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఓటమి పాలైన నాలుగు స్థానాల్లోనూ వంద లోపు ఓట్ల తేడాతోనే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయని పేర్కొన్నారు. ఇది పార్టీ అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న ఆదరణను తెలియజేస్తోందన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, వాటిని చూసి పార్టీ శ్రేణులు నిరుత్సాహపడకూడదని వనిత సూచించారు. అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడిన నాయకులు, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం సైనికుల్లా పనిచేసిన ప్రతి అభ్యర్థికి, నాయకుడికి, కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చే శారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నా యకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయా ల ని సూచించారు. పార్టీ మండల కన్వీనర్ ప్రతాప నేని వాసు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, మల్లెపూడి నాగమణి, బిరుదుగడ్డ చల్లారావు, యవసాని నాగిరెడ్డి, బాలం వెంకటేశ్వరరావు, కస్సే గంగరాజు, గోపా నాగేశ్వర రావు, గంటా విగ్నేశ్వరరావు, వసంతాటి శ్రీనివాస్, అ చ్యుత ఏసుబాబు, ఉక్కుర్తి వెంకట్రావు, పొంగులేటి రమేష్, ములకాల పెద్ద పానకాలు, ఎలమర్తి భాస్కరరావు, మానుకొండ కన్నయ్య పాల్గొన్నారు.


