సాక్షి భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు పట్టణాల్లో కలిపి మొదటిరోజు చైర్పర్సన్ పదవి కోసం రెండు, వార్డులకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్పర్సన్ కోసం పాలకొల్లులో మాత్రమే కాంగ్రెస్ నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి. వార్డులకు సంబంధించి అధికంగా తాడేపల్లిగూడెం నుంచి వార్డులకు 16 నామినేషన్లు దాఖలవ్వగా వీటిలో వైఎస్సార్సీపీ నుంచి 13, జనసేన నుంచి ముగ్గురు నామినేషన్లు వేశారు. తణుకులో వార్డులకు ఎనిమిది నామినేషన్లు రాగా వైఎస్సార్సీపీ నుంచి ఏడు, సీపీఎం ఒకటి పడ్డాయి. భీమవరంలో వచ్చిన ఏడునామినేషన్లలో స్వతంత్రులు నలుగురు, కాంగ్రెస్ ఒకటి, సీపీఎం ఒకటి ఉన్నాయి. వార్డుల్లో మొత్తం 31కి అధికంగా వైఎస్సార్సీపీ నుంచి 20, స్వతంత్రులుగా ఐదుగురు, జనసేన మూడు, సీపీఎం రెండు, కాంగ్రెస్ ఒకటి ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో జనసేన మినహా మిగిలిన ఎక్కడ కూడా కూటమి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు కాలేదు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 16వ తేదీ సప్తమి కలిసి రావడంతో ఆరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావచ్చని భావిస్తున్నారు.
మున్సిపాలిటీల్లో 443 పోలింగ్ కేంద్రాల్లో
నాలుగు మున్సిపాలిటీల్లో 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో 47 సమస్యాత్మక, 40 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అవాంఛననీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
కూటమిలో పంపకాలు
తీవ్ర తర్జనభర్జనల తర్వాత భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం మున్సిపాల్టీల్లో కూటమి వార్డుల పంపకాలు దాదాపు పూర్తి కాగా శనివారం నాటికి పాలకొల్లులో కొలిక్కిరాలేదని తెలుస్తోంది. భీమవరంలో మొత్తం 52 వార్డులకు టీడీపీ 24, జనసేన 23, బీజేపీ ఐదు వార్డుల్లో పోటీచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. తాడేపల్లిగూడెంలో 48 వార్డులకు టీడీపీ 22, జనసేన 22, బీజేపీ నాలుగు, తణుకులో మొత్తం 44 వార్డులకు టీడీపీ 29, జనసేన 12, బీజేపీ మూడు వార్డుల్లో పోటీచేయనున్నట్టు సమాచారం. కాగా పాలకొల్లులో వార్డుల విషయమై ఇంకా మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.
భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో నామినేషన్ల స్వీకరణ


