జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): రెండు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో ఒకే వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ జంగారెడ్డిగూడెం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ. అన్నామణి శుక్రవారం తీర్పు వెలువరించారు. జక్కుల రమేష్ అనే వ్యక్తికి ఈ రెండు కేసుల్లో మూడేసి నెలల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే బాధితులకు మొత్తం రూ.12.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 2019లో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద బెజవాడ కేశవులు దాఖలు చేసిన కేసులో నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానాతో పాటు కేశవులుకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. అదేవిధంగా 2019లోనే డాక్టర్ కోట సుబ్బారావు దాఖలు చేసిన మరో చెక్ బౌన్స్ కేసులోనూ రమేష్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించి, సుబ్బారావుకు రూ.7.50 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారుల తరఫున సీనియర్ న్యాయవాదులు బుడిగిన నాగేంద్ర కుమార్, కామన సత్యం వాదనలు వినిపించారు.
చింతలపూడి: మండలంలోని ఫాతిమాపురంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని వేలాంగణి మాత స్వరూపం వద్ద ఉన్న కానుకల పెట్టె తాళాలను గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధాలతో పగలగొట్టి, భక్తులు సమర్పించిన నగదును అపహరించారు. ఉదయం ప్రార్థనల నిమిత్తం వచ్చిన గ్రామస్తులు పగిలి ఉన్న పెట్టెను గమనించి నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచి, నిందితులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 107 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏలూరులోని పత్తేబాద ఆర్నా ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ రీజనల్ హెడ్ నాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. బ్యాంకు సాధించిన విజయాలు, ఖాతాదారులకు అందిస్తున్న మెరుగైన సేవలు, వివిధ సంక్షేమ పథకాల గురించి రీజనల్ హెడ్ వివరించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో కార్పొరేట్ శాలరీ, యూనియన్ వెహికల్ అగైనెస్ట్ ఎఫ్‌డీ, డిజిటల్ లాకర్, తత్కాల్ ఎన్‌పీఎస్, ఎం–పాస్‌బుక్, డిజిటల్ సాల్వెన్సీ సర్టిఫికెట్ తదితర 10 నూతన బ్యాంకింగ్ ఉత్పత్తులను ఆవిష్కరించారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో రీజనల్ అస్యూరెన్స్ హెడ్ డి. సత్యనారాయణ రెడ్డి, బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.


