అభివృద్ధి చేయాలి
సంతానం కలుగుతుందని నమ్మకం
● కార్తీక మాసంలో భక్తుల రాక
● ప్రాణాచారం ఇక్కడ ప్రత్యేకం
● ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న గుహలు
కామవరపుకోట: మండలంలోని గుంటుపల్లి పంచాయతీ పరిధి జీలకర్రగూడెంలో ఉన్న బౌద్ధారామాలు(గుంటుపల్లి గుహలు) కార్తీక శోభను సంతరించుకున్నాయి. ప్రాచీన చరిత్రకు, బౌద్ధ సంస్కృతికి నిలయంగా ఉన్న గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం భక్తులు, పర్యాటకులతో సందడిగా మారుతోంది. చారిత్రక బౌద్ధ స్థూపాలు, గుహలు, పురాతన నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ చారిత్రక ప్రదేశం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రశాంతతను అందిస్తోంది. ఈ బౌద్ధారామాల వద్ద ఉన్న భారీ లింగాకారాన్ని ధర్మ లింగేశ్వరస్వామిగా కొలుస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యులు బౌద్ధారామంలోని ప్రధానస్తూప చైతన్యాన్ని ధర్మలింగేశ్వర స్వామిగా రూపాంతరం చేసి, పూజలు చేశారని బౌద్ధులు చెబుతుంటారు.
కార్తీక మాసంలో గట్టు తీర్థం
ఏటా కార్తీకమాసంలో ఇక్కడ గట్టు తీర్థం (తిరునాళ్లు) నిర్వహిస్తారు. ఈ నెలలో మూడో సోమవారం భక్తులు భారీగా తరలివస్తారు. ఆ సమయంలో మహిళలు ధర్మ లింగేశ్వర స్వామికి ప్రాణాచారం పడితే సంతానం కలుగుతుందని నమ్మకం. సంతానం లేని మహిళలు తల స్నానం చేసి పండ్లు, పూలు చేతితో పట్టుకుని ధర్మలింగేశ్వరస్వామి ఎదుట ప్రాణాచారం పడతారు. ఇలా ప్రాణాచారం పట్టిన వారికి స్వామివారు కలలో ప్రత్యక్షమై పండ్లు అందజేస్తే మగ బిడ్డ, పూలు అందజేస్తే ఆడపిల్ల పుడుతుందని విశ్వాసం. తిరునాళ్ల సందర్భంగా మండలంలో మూడో సోమ వారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తారు. ఇతంటి ప్రాధాన్యమున్న ప్రాంతంలో సరైన వసతులు లేకపోవడంతో యాత్రికులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. నిధులు కేటాయించి ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా అభివృద్ది పరచాలని పలువురు కోరుతున్నారు.
చారిత్రక ఆనవాళ్లు గల ఈ ప్రాంతానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కా ర్తీక మాసంలో భక్తులు, విద్యార్థులతో కిటకిటలాడుతుంది. అయితే ఇక్కడ సరైన మౌలిక వసతులు లేవు. పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి.
– అల్లూరి పెద్దిరాజు,
ఎంపీటీసీ సభ్యుడు, జీలకర్రగూడెం
ధర్మలింగేశ్వరస్వామి ఆలయం ఎదుట ప్రాణాచారం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. సంతానం లేని మహిళలు ఇక్కడ ప్రాణాచారం పడితే పిల్లలు పుడతారనేది నమ్మకం. ఇలా ఈ ప్రాంతంలో చాలా మందికి సంతానం కలిగిందనేది వాస్తవం. కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా వస్తారు.
– చామర్తి లింగమాచారి,
స్థానికుడు, గుంటుపల్లి


