జిల్లా ఎస్పీ శివకిషోర్
ఏలూరు టౌన్: నేటి ఆధునిక యుగంలో నేరగాళ్లు చట్టానికి దొరకకుండా నేరాలకు పాల్పడుతున్నారనీ.. నేర పరిశోధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. నేరగాళ్ల భరతం పట్టాలని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ చెప్పారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఆధారాల సేకరణపై క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బందికి ఆయన స్వయంగా శిక్షణ ఇచ్చారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్‌డివిజన్ల పోలీస్ అధికారులు, సిబ్బందికి నేరస్థల పరిశీలన, ఆధారాల సేకరణపై ప్రత్యకంగా తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర స్థలానికి చేరుకున్న వెంటనే పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు చెదిరిపోకుండా అప్రమత్తం కావాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, అనుమానస్పద మరణాలు వంటి కేసుల్లో వేలిముద్రలు, రక్తపుమరకలు, పాదముద్రలు, మారణాయుధాలు, ఆయుధాలు, శాసీ్త్రయంగా సేకరించాలని సూచించారు. ఆధారాల సేకరణలో మొబైల్ ఫోరెన్సిక్ పరికరాల పనితీరు కీలకంగా మారుతుందని ఎస్పీ అన్నారు. నేర స్థలంలో దొరికిన ఆధారం కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళుతుందనీ, ఆధారాల సేకరణలో పోలీస్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మొబైల్ ఫోరెన్సిక్ పరికరాల పనితీరును ప్రయోగాత్మకంగా సిబ్బందికి వివరించారు. జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలవరం డీఎస్పీ యు.రవిచంద్ర, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, క్లూస్‌టీమ్ ఎస్‌ఐ షేక్ మహబూబ్ షరీఫ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


