ఉత్సాహంగా హాకీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా హాకీ పోటీలు

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

ఉత్సాహంగా హాకీ పోటీలు డీఆర్‌యూసీసీ సభ్యుడిగా వనమా బాలల రక్షణపై అవగాహన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు

తణుకు అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో 38వ అంతర్‌ జిల్లాల రోలర్‌, ఇన్‌లైన్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ పోటీలు స్థానిక మాంటిస్సోరీ పాఠశాల క్రీడా ప్రాంగణంలో బుధవారం ఉత్సాహంగా కొనసాగాయి. అసోసియేషన్‌ సెక్రటరీ థామస్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారు. వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. టైనీటాట్స్‌, కేడెట్‌, సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో బాలురు, బాలికలు హోరాహోరీగా తలపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‌ అనపర్తి ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.జ్ఞానమంజరి, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బి.నాగేంద్ర ఫణి సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం : విజయవాడ డివిజనల్‌ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ (డీఆర్‌యూసీసీ) సభ్యుడిగా పట్టణానికి చెందిన వనమా దుర్గాప్రసాద్‌ (శ్రీకాంత్‌) నియమితులయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికుల కోసం అనేక సదుపాయాలను అందుబాటులోకి తెస్తోందని పేర్కొన్నారు. తనను డీఆర్‌యూసీసీ సభ్యుడిగా నియమించినందుకు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌, ఇతర రైల్వే ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌) : సమాజంలో బాలలకు సురక్షితమైన భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా పోక్సో చట్టం, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, భద్రత, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. శ్రీలక్ష్మి అవగాహన కల్పించారు. బుధవారం వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్‌ పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈనెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు బాలల భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమాజం బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని, బాల్య వివాహాలు జరిపితే చట్టరీత్యా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్‌ న్యాయవాది పీవీఎన్‌ మునేశ్వర రావు, సామాజిక కార్యకర్త వై.యామిని లలితా శ్రీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.

భీమడోలు : పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు భీమడోలు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. భీమడోలు ఎస్సై ఎస్‌కే మదీనా బాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీ దీపావళి రోజున ఎంఎంపురంలో కండవల్లి సెలంరాజా మంచినీరు తెచ్చుకునేందుకు బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా మరో వ్యక్తి రాంగ్‌ రూట్‌లో అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సెలంరాజాను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన మెడికో లీగల్‌ కేస్‌ (ఎంఎల్‌సీ) సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బైక్‌లు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

కొయ్యలగూడెం: ముందు వెళ్తున్న బైక్‌ను వెనక నుంచి మరో బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం బయ్యనగూడెం సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై వి. చంద్రశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యన్నగూడెం వెలగల దిబ్బ ప్రాంతానికి చెందిన టెక్కం భాస్కర్‌ (55) తన కుమార్తెను హైస్కూల్లో దించి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. బైక్‌ కుడివైపునకు మలుపు తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి బైక్‌ మీద జంగారెడ్డిగూడెం వైపు వెళుతున్న వ్యక్తి నిర్లక్ష్యంగా, అతివేగంతో వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో భాస్కర్‌ తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భాస్కర్‌ భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement