ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లలో స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● కై కలూరు గ్రామ నివాసి మండే దేవమణి తమ భూముల విషయంలో కుటుంబ తగాదాలు ఉన్నాయని, రీ సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కోరారు.
● జంగారెడ్డిగూడేనికి చెందిన కలపాల కృష్ణమూర్తి తనకు 1.75 సెంట్లు భూమి ఉందని, ఆక్రమణలకు గురైందని పైగా దౌర్జన్యం చేస్తున్నారని, విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు.
● చింతలపూడి మండలం యడవల్లికి చెందిన షేక్ మీరాభి కట్నం కోసం భర్త, అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
● పోలవరం మండలం జగన్నాథపేటకి చెందిన ఎస్‌కే సైదాని డ్వాక్రా సంఘం ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో జమ చేసినా, ఓ సభ్యురాలు సొమ్ములు కట్టకపోవడంతో రుణాలు మంజూరు ఆగిందని పరిష్కారం చూపాలని అభ్యర్థించారు.
● జీలుగుమిల్లి మండలం దర్భగూడెం నివాసి సూరరెడ్డి శిలపరెడ్డి తన మొత్తం భూమిని మరలా సర్వేచేసి హద్దులు నిర్ణయించాలని కోరారు.


