ఏలూరు(టూటౌన్): గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భూరికార్డుల నిర్వహణ, పాస్‌బుక్ ల పంపిణీ, రెవెన్యూ వ్యవహారాల్లో సమన్వయం, వరదలు, తుపానుల వంటి విపత్తుల సమయంలో సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కోరింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద వీఆర్‌ఏలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వీఆర్‌ఏల కీలక పాత్ర పోషిస్తున్నా తమకు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు రూ.10,500 వేతనం మాత్రమే అందుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు, కుటుంబ నిర్వహణ, పిల్లల విద్య, వైద్య, రవాణా ఖర్చులతో ఈ మొత్తం సరిపోవడం లేదని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నా పే స్కేల్ అమలు కాకపోవడం, పదోన్నతి అవకాశాలు లేకపోవడం వల్ల వీఆర్‌ఏలు నిరుత్సాహానికి గురవుతున్నారన్నారు.


