కుక్కునూరు: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని వాగులో పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం మణుగూరు ప్రాంతానికి చెందిన వనమాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తమ పెద్ద కుమార్తె వివాహాన్ని జరిపించారు. వివాహ వేడుక అనంతరం సోమవారం తెల్లవారుజామున కారులో మణుగూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. కుక్కునూరు మండలంలోని లంకాలపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టు వద్దకు చేరుకునే సమయానికి డ్రైవింగ్ చేస్తున్న వెంకటేశ్వర్లుకు నిద్రమత్తు రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి కారుతో వేగంగా కల్వర్టును ఢీకొట్టాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు భార్య వనమాల లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందింది. రెండో కుమార్తె వనమాల దేవి (14) చేతులకు స్వల్ప గాయాలు కాగా, కారులో ఉన్న బత్తుల రాము తలకు స్వల్ప గాయమైంది. వెంకటేశ్వర్లుతోపాటు మరో వ్యక్తి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఎస్సై పి.రాజారెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పెళ్లి సందడి ముగించుకుని కుటుంబంతో కలిసి ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి గాయాలతో బయటపడగా, తల్లి ప్రాణాలు కోల్పోవడం బంధువులను, స్థానికులను కలచివేసింది. ప్రమాదంపై కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద కుమార్తె వివాహం
వేడుక అనంతరం మణుగూరు తిరుగుప్రయాణం
కుక్కునూరు మండలం లంకాలపల్లి సమీపంలో కల్వర్టును ఢీకొన్న కారు
మహిళ దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు


