బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనులు ఒకరు. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్పపువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల నిమిత్తం మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ, ప్రకృతిమాత ఒడిలోనే జీవిస్తున్నారు.
ప్రకృతే దైవం : ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, గిరిజనుల్లోని కోయ తెగవారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది.
జగన్ పాలనలో సంక్షేమానికి పెద్దపేట : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69,814.72 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందజేశారు. ‘రైతు భరోసా’ పథకం ద్వారా రైతులకు ప్రతిఏటా రూ.15,000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొండపైన ఉన్నవారికి కూడా పింఛన్లు ఇంటికే అందేలా చేశారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా సుమారు రూ.50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల ప్రజలకు డోలి కష్టాలు తప్పించేందుకు బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
గిరిజనులకు పునరావృతమవుతున్న కష్టాలు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైన కొన్ని సంక్షేమ పథకాల అమలులో మార్పులు చోటుచేసుకున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీసీఎం వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేవారు. ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోవడంతో గిరిజనులు మళ్లీ వాగులు దాటుతూ, తలపై బియ్యం మూటలు పెట్టుకుని మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కోడికూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి సైతం పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు అందడానికి వారం రోజులకు పైగా సమయం పడుతోందని గిరిజనులు వాపోతున్నారు. అదేవిధంగా వైద్యసేవల పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ౄ
పోడు వ్యవసాయం ఇలా..
సంప్రదాయ డోలు వాయిద్యాల నృత్యం చేస్తున్న గిరిజనులు
వన దేవతకు పూజలు చేస్తున్న గిరిజనులు
జొన్న పంటను రోకలితో దంచుతూ..
జగన్ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్ద పీట
మారుమూల గ్రామాల్లో సైతం విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
కూటమి ప్రభుత్వంలో గిరిపుత్రులకు కష్టాలు పునరావుృతం
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


