మళ్లీ.. పులి | - | Sakshi
Sakshi News home page

మళ్లీ.. పులి

Jul 31 2026 1:09 AM | Updated on Jul 31 2026 1:09 AM

అధికారులకు సవాల్‌

గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గడచిన ఎనిమిది నెలలుగా ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పులి, తరచూ పశువులపై దాడి చేస్తూ హతమారుస్తోంది. ఈ పరిణామం అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

బుట్టాయగూడెం: తెలంగాణలోని కావిడిగుండ్లలో గత డిసెంబర్‌లో పశువులపై దాడి చేసిన పెద్దపులి, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో ప్రవేశించింది. పలు గ్రామాల్లో తిరుగుతూ పశువులను హతమార్చిన అనంతరం పోలవరం మండలంలోకి అడుగుపెట్టింది. పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి, కూర్మాపురం వద్ద అటవీశాఖ ప్రత్యేక బృందాలకు చిక్కింది. శ్రీశైలం, బెంగళూరు, విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందాలు పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి సురక్షితంగా విశాఖపట్నం జూ పార్కుకు తరలించారు. అయితే పులి మనుగడను దృష్టిలో ఉంచు కుని, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అటవీశాఖ అధికారులు దానిని మళ్లీ జూ నుంచి తీసుకొచ్చి, రేడియో కాలర్‌ అమర్చి పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. దీంతో పులి సంచారం మళ్లీ మొదలైంది. పోలవరం ప్రాంతంలోని దేవీపట్నం, పరిసర సరిహద్దు గ్రామాల్లో తిరిగిన పులి, అక్కడి నుంచి మళ్లీ పోలవరం మండలం మీదుగా బుట్టాయగూడెం చేరి, ఆపై తెలంగాణ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో పులి ఇక రాదని అందరూ భావించారు. కానీ, కొద్ది రోజులకు మళ్లీ పోలవరం, ఏలూరు జిల్లాల్లో దాని కదలికలను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని కంచర్లగూడెం, నందిగూడెం ప్రాంతాలతో పాటు కొయ్యలగూడెం మండలంలోని మంగపతీదేవిపేటలో పశువులపై దాడి చేసిన ఈ పులి, ప్రస్తుతం బుట్టాయగూడెం మండలం మొద్దప్పగూడెంలోని ఒక జామాయిల్‌ తోటలో మకాం వేసింది.

150కి పైగా పశువులపై దాడి

గడచిన ఎనిమిది నెలల్లో ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి సుమారు 150కి పైగా పశువులను హత మార్చినట్లు సమాచారం. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టినప్పటికీ, అది తిరిగి గ్రామాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తుండటంతో అటవీశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. పులిని బంధించేందుకు అధికారులు ఎన్ని వ్యూహాలు పన్నుతున్నప్పటికీ, అది చాకచక్యంగా తప్పించుకు తిరుగుతోంది. దీనితో స్థానికులు ఈ పులికి సరదాగా ‘చాణక్య పులి’ అంటూ సైటెర్లు వేస్తున్నారు.

ప్రజల్లో తీవ్ర ఆందోళన

ఎనిమిది నెలలుగా గోదావరి జిల్లాల ప్రజలు, రైతులు పులి బెడదతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక మంది రైతులు పశువులను కోల్పోయి జీవనోపాధి కరువై నిరాశకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే పులిని సజీవంగా పట్టుకుని దట్టమైన అడవిలోకి తరలించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో తోటలకు వెళ్లేందుకు కూలీలు, రైతులు భయపడుతున్నారు. సాయంత్రం ఐదు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. పిల్లలను ఒంటరిగా స్కూళ్లకు పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాలు గత ఎనిమిది నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులికి అమర్చిన రేడియో కాలర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఎప్పటికప్పుడు దాని కదలికలను పర్యవేక్షిస్తూ, అనువైన ప్రదేశంలో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఆ పులి అధికారులకు చిక్కకుండా మూడు జిల్లాల పరిధిలో ముప్పుతిప్పలు పెడుతోంది. అటవీశాఖ అధికారులు డ్రోన్లతోనూ నిఘా పెట్టి పులి జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే పులిని బంధిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. అడవిని వీడి జనావాసాల వైపు వచ్చిన ఈ పెద్దపులి ఎప్పుడు చిక్కుతుందోనని, ఈ భయాందోళనల నుంచి తమకు ఎప్పుడు విముక్తి కలుగుతుందోనని గోదావరి జిల్లాల ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

గోదావరి జిల్లాలను వణికిస్తున్న పెద్దపులి

ఎనిమిది నెలలుగా అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపిస్తున్న వైనం

పులి దెబ్బకు 150కు పైగా పశువుల బలి

అధికారులకు సవాల్‌గా మారిన పెద్దపులి సంచారం

ప్రజల్లో, పశురైతుల్లో తీవ్ర ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement