పెరుగుతున్న గోదావరి వరద | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి వరద

Jul 31 2026 1:09 AM | Updated on Jul 31 2026 1:09 AM

పెరుగుతున్న గోదావరి వరద

పోలవరం ప్రాజెక్టు దిగువన ప్రవహిస్తున్న వరద

కుక్కునూరు వద్ద నిండుకుండను తలపిస్తూ..

కుక్కునూరు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి నదికి క్రమంగా నీటి ప్రవాహం పెరిగి కుక్కునూరు మండల పరిధిలో నిండుకుండలా కనిపిస్తూ పరవళ్లు తొక్కుతోంది. గురువారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతున్న గోదావరి సాయంత్రం 6 గంటల సమయంలో భద్రాచలం వద్ద 26 అడుగులకు చేరింది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక ప్రజలు నదిలో చేపలు పట్టడం, స్నానాలు చేయడం వంటి పనులు చేయరాదాని హెచ్చరించారు.

పట్టిసీమ వద్ద ఉధృతంగా వరద

పోలవరం రూరల్‌: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప నదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమీట్టం 29 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 2.14 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాచలంలో 28.70 అడుగులకు నీటిమట్టం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 28.70 అడుగులకు చేరుకుందని, 3,97,281 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంటే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని, 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారని తెలిపారు.

వరద పరిస్థితులపై అప్రమత్తం

జిల్లాలో గోదావరి వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎంజే అభిషేక్‌ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరద ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వరద పరిస్థితులపై ప్రత్యేక అధికారులను నియమిస్తూ, కంట్రోల్‌ రూమ్‌లు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సహాయక చర్యలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement