ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పరిశ్రమల కార్మికులు, మున్సిపల్, పంచాయితీ కార్మికులు, వైద్య ఆరోగ్యశాఖ, ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్టు ఉద్యోగులు, 102, సమగ్ర శిక్ష అభియాన్, ఐటీడీఏ, వెటర్నరీ సహా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు అధ్యక్షత వహించగా.. జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ ముఖ్య అతిగా మాట్లాడారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం కనీస వేతనాలు సవరించలేదని, కార్పొరేట్లకు వందలాది ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాలు కార్మికుల వేతనాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా కన్వీనర్ ఎం.నాగమణి, కే. శ్రీనివాస్, ఇతర సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులు కలెక్టరేట్‌లో వినతి పత్రం సమర్పించారు.


