బుట్టాయగూడెం: మలేరియా జ్వరంతో పులిరామన్నగూడెంకు చెందిన గిరిజన విద్యార్థిని మడకం నందిత (12) మృతి చెందిన ఘటనపై గురువారం వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఎస్‌పీఎమ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్మయి, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ శోభ బృందంగా ఏర్పడి బాలిక మృతికి సంబంధించిన కారణాలను సేకరించారు. అనంతరం నందిత చదువుతున్న కామయ్యకుంట పాఠశాలను సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ విచారణలో డాక్టర్ అకీబ్, జిల్లా మలేరియా అధికారి ఎన్‌ఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, రిజెక్టెడ్ జాబితాలను ఏలూరు జిల్లా వెబ్‌సైట్, ఏలూరులోని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచినట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వచ్చే నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ఆధారాలతో తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: వివాదాలకు పర్యాయపదంగా పేరుగడించిన కై కలూరు జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్యవర ప్రసాద్ (బాబీ)పై ఆయన భార్య దుర్గాదేవీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంనకు చెందిన దుర్గాదేవీని 15 ఏళ్ల క్రితం బాబీ వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో రూ.15 లక్షలు నగదు, 10 సవర్ల బంగారం, వస్తువుల కోసం మరో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వీరికి ఇరువురు సంతానం. కై కలూరు మండలం కొల్లేటికోటలో కాపురం తర్వాత 2020లో ఆటపాకలో అపార్ట్‌మెంటుకు మారారు. అనంతరం ఇదే మండలం నత్తగుళ్ళపాడుకు చెందిన ఓ వివాహితతో బాబీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య దుర్గాదేవీ నిలదీసింది. దీంతో బాబీ, అక్రమ సంబంధం కలిగిన మహిళ తనను చిత్రహింసలకు గురిచేసి అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని, తన పిల్లలను సైతం చూడనివ్వడం లేదని, తన భర్తతో తనకు ప్రాణహాని ఉందని ఈ నెల 5న కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం పెద్దల ముందు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో తిరిగి ఆమె పోలీసులను ఆశ్రయించడంతో టౌన్ పోలీసులు సెక్షన్లు 85, 351(2), 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ 4 డీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అధికారులు కలిసికట్టుగా పనిచేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, 22 (ఏ) కేసులు, వరద, విపత్తు నిర్వహణ తదితర 14 అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌరసేవలు అందించడంలో మనస్సుపెట్టి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులకు చర్యలు తప్పవని హెచ్చరించారు.
జేఎన్‌టీయూకే పాలకమండలి రద్దు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాలపరిమితి నెల రోజులు ఉండగానే జేఎన్‌టీయూ కాకినాడ యూనివర్సిటీ పాలక మండలిని రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్త పాలక మండలి సభ్యులను నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పాలకమండలి సభ్యులను నిర్వీర్యం చేసి వారితో ఏవిధమైన సమావేశాలూ నిర్వహించలేదు.


