మాల్స్, ఆన్‌లైన్ వ్యాపారాల ప్రభావం
బంగారం ధరల హెచ్చుతగ్గులతో..
మూడేళ్ల క్రితం మంచి టర్నోవర్
సాక్షి ప్రతినిధి,ఏలూరు: స్థానిక వ్యాపారం దెబ్బతింది. కోట్ల రూపాయలు టర్నోవర్ స్థాయి నుంచి రూ.లక్షలకు దిగజారింది. కిరాణా కొట్టు నుంచి బంగారు షాపు వరకు అన్నింటికీ ఆన్‌లైన్ సెగ భారీగా తగలడంతో ఏళ్ల తరబడిగా మందకొడిగా సాగుతున్న వ్యాపారం ఆరు నెలల నుంచి పూర్తిగా పడకేసింది. మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ తగ్గడంతో ట్రేడ్ టర్నోవర్ లేక చిన్నషాపు నుంచి మాల్స్ వరకు అందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. రెండు, మూడేళ్ల క్రితం వరకు ఒక్క ఏలూరు నగరంలో రోజుకు సగటున అన్ని వ్యాపారాలు కలుపుకుని రూ.70 కోట్లపైనే టర్నోవర్ జరగ్గా నేడు సగానికి పడిపోయి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
బేరాలు లేవు.. బోణీలు కావు..
నిత్యం ట్రేడ్ బిజీతో ఉండే ఏలూరు మెయిన్ బజార్, ఆర్‌ఆర్‌పేట రోడ్డు, ఫైర్‌స్టేషన్ ఇక జిల్లాలోని కై కలూరు, నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలోని ప్రధాన మార్కెట్‌లు పూర్తిగా కొనుగోళ్లు తగ్గిపోయాయి. ఒకవైపు నిత్యావసరాలు మొదలు గ్యాస్ వరకు ధరలు భగ్గుమండటంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలు మినహా ఆర్భాటలకు పోలేని పరిస్ధితి. వాస్తవానికి జనవరి నుంచి ప్రతి నెలా స్థానిక మార్కెట్‌కు ఏదోక సీజన్ పేరుతో ఒక మోస్తరుగా వ్యాపారాలు జరిగి టర్నోవర్ కాస్త ఆశాజనకంగా ఉండటంతో జీఎస్‌టీ వసూళ్లు కూడా బాగానే ఉండేవి. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ పూర్తిగా అట్టర్‌ఫ్లాప్ కావడం.. రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల జరిగే సంక్రాంతి వ్యాపారాలు 60 శాతానికే పరిమితం కావడం, ఆ తరువాత రకరకాల పండగలు, ఇతర సీజన్లు, పంట డబ్బులు చేతికి అందే సమయం ఇలా ప్రతి నెలా కొంత మేరకు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. అలాగే మే, జూన్ నెలల్లో స్కూల్స్ సీజన్ కావడంతో బుక్స్‌షాపుల నుంచి వస్త్రదుకాణాల వరకు కొంత మేరకు వ్యాపారం ఉండేది. కాని ఈఏడాది అన్ని వ్యాపా రాలూ తగ్గిపోయాయి.
ఆన్‌లైన్‌తో అధిక నష్టం
ఆన్‌లైన్ వ్యాపారాలతో స్థానిక వ్యాపారాలు 30 శాతానికిపైగా నష్టం వాటిల్లుతుంది. చిన్నపాటి నిత్యావసరం మొదలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు అన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లు అధికంగా జరుగుతున్నాయి. ఇక హోటల్ రంగంలో కూడా వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరగడంతో హోటల్స్ వ్యాపారాలకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. ప్రధానంగా ఆన్‌లైన్‌లో వస్త్రాలు, ఎలక్ట్రా నిక్స్ అధికంగా జరుగుతున్నాయి. కరోనా స మయం నుంచి జిల్లాలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కే అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
చలా‘మనీ’ లేక..
మార్కెట్లు ఢీలా
భారీగా తగ్గిన టర్నోవర్
కిరాణా మొదలు బంగారం వరకూ అందరు వ్యాపారులదీ అదే పరిస్థితి
ఆన్‌లైన్ మార్కెట్‌తోనూ అవరోధాలు
పూర్తిగా పడకేసిన రియల్ ఎస్టేట్
ఆరు నెలలుగా జిల్లాలో ఇదే పరిస్థితి
ఇటీవల వెల్లువెత్తుతున్న జాతీయస్థాయి మాల్స్, ఆన్‌లైన్ వ్యాపారాలు కారణంగా చిన్నచిన్న వ్యాపారాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆన్‌లైన్ వ్యాపారాలకు సంబంధించి డెలివరీలు అందుతుండటంతో వినియోగదారులు వాటి దారానే తమకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో జరుగుతున్న వ్యాపారాల్లో వారి వాటా బాగా పెరిగి స్థానిక చిరు వ్యాపారుల వాటా కనిష్ట స్థాయికి పతనమైపోయింది.
–నేరెళ్ల రాజేంద్ర, మర్చంట్స్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు
బంగారం, వెండి ధరలు అసాధారణ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండడంతో బంగారం వ్యాపారం సవాలుగా పరిణమించింది. ఒకేసారి రూ.వేలల్లో ధరలు పెరగడం లేదా తగ్గుతూ ఉండటంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఆభరణాల జోలికి రావడం లేదు. గతంలో భవిష్యత్ లాభాల కోసం పెట్టుబడిగా కూడా బంగారం కొనుగోలు చేశారు. కానీ ఈ హెచ్చుతగ్గుల కారణంగా ధర తగ్గితే విపరీతమైన నష్టం చవిచూడాల్సి వస్తుందనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని షాపుల్లో బంగారం వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతోంది.
– పచ్చిపులుసు సుజన్, బంగారు వ్యాపారి
2019–2024 కాలంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా ఏదో ప్రభుత్వ పథకం డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమయ్యేది. తద్వారా మార్కెట్‌లో అవసరాలతో పాటు కొంతమేరకు కొనుగోళేఉ్ల అధికంగా జరిగి జీఎస్‌టీ ఆదాయం పెరగడంతో పాటు మనీ సర్క్యులేషన్ బాగుండేది. దీంతో పాటు పల్లెల్లో మైక్రో ఫైనాన్స్‌ల పేరు లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, కాపునేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా ప్రభుత్వ పధకాల ద్వారా ప్రతి నెల లబ్ధిదారులకు నగదు జమయ్యేది. ఒక్క ఏలూరు జిల్లాలో అమ్మఒడి పథకం ద్వారా రూ.1,069.30 కోట్లు, గోరుముద్ద ద్వారా రూ.203 కోట్లు, విద్యాదీవెన ద్వారా రూ.383.40 కోట్లు, రైతు భరోసా ద్వారా రూ.1.830.24 కోట్లు ఇలా ప్రత్యక్ష లబ్ధి జరగడంతో మార్కెట్‌లో టర్నోవర్ ఉండటం అన్ని రకాల వ్యాపారాలు ఆశాజనకంగా సాగిన పరిస్ధితి.


