ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో దశాబ్ధాల చరిత్ర గల ఆళ్వార్ సదనం కొత్తరూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతుండగా, భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు భక్తులకు వసతి కల్పించడంతో పాటు పెళ్లిళ్లకు వేదికై న ఆళ్వార్ సదనం శిథిలావస్థకు చేరడంతో కొంతకాలంగా వినియోగానికి దూరమైంది. దీంతో భవనం పూర్తిగా దెబ్బతినకుండా పరిరక్షించేందుకు మరమ్మతులు చేపట్టారు. పాత నిర్మాణం ప్రత్యేకతను కాపాడుతూ అవసరమైన చోట్ల ఆధునిక హంగులను జోడిస్తున్నారు. పైకప్పు, గోడలు, ఫ్లోరింగ్, విద్యుత్ వ్యవస్థ తదితర అంశాలను పునరుద్ధరిస్తూ భవనానికి కొత్త మెరుగులు దిద్దుతున్నారు.
ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా..
ఆళ్వార్ సదనం పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా గార్డెన్లు ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి. పచ్చదనంతో నిండిన వాతావరణాన్ని కల్పించేలా వివిధ రకాల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


