ఎన్నడూ లేనివిధంగా సాగునీటి ఎద్దడి | - | Sakshi
Sakshi News home page

ఎన్నడూ లేనివిధంగా సాగునీటి ఎద్దడి

Jul 21 2026 12:59 AM | Updated on Jul 21 2026 12:59 AM

నీరందించాలని కొఠారు వినతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : దెందులూరు నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న సాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సోమవారం ఏలూరు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదపాడు, ఏలూరు రూరల్‌ మండలాల పరిధిలోని కృష్ణా ఈస్ట్‌ కాలువ ఆయకట్టు కింద ఉన్న సుమారు 58 వేల ఎకరాల వరి, ఆక్వా సాగు పూర్తిగా నీటిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రస్తుతం సాగునీరు అందక, చరిత్రలో తొలిసారిగా రైతులు సాగు ప్రారంభించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు.. ప్రభుత్వం నుంచి నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు.

నీరివ్వలేకపోతే పరిహారం చెల్లించాలి

ప్రభుత్వం వెంటనే సాగునీటిపై ప్రకటన చేయాలని, నీరివ్వలేని పక్షంలో రైతులకు పెట్టుబడి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని, పోలవరం కాలువ నీటిని గుండేరువాగు, సీతంపేట కాలువ ద్వారా మళ్లించి 13,800 ఎకరాలకు సాగునీరు అందించిన విషయాన్ని గుర్తుచేశారు.

పంపింగ్‌ సరిపోవడం లేదు

ప్రస్తుతం గోదావరి కాలువ ద్వారా జరుగుతున్న నీటి పంపింగ్‌ సరిపోవడం లేదని, అదనంగా మరో రెండు మోటార్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే కృష్ణా ఈస్ట్‌, పోలవరం కాలువల ద్వారా గ్రామ చెరువులను నింపి తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని అబ్బయ్యచౌదరి స్పష్టం చేశారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, నాయకులు ముంగర సంజీవ్‌కుమార్‌, పల్లెం ప్రసాద్‌, తేరా ఆనంద్‌, మోరు రామరాజు,మండల కొండలరావు, నిట్టాగంగరాజు, కట్టా ఏసుబాబు, కొలుసు గణపతిరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement