ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన రేషనలైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయనతో పాటు ఆదివాపసీ ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ సరియం రామ్మోహన్, నాయకులు టి.బాబురావు మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని లంకపాకల, పులిరామన్నగూడెం, రెడ్డికొప్పల్లి, ఇటికలకోట పాఠశాలల్లో 8, 9, 10 తరగతులను ఎత్తివేసి.. కేవలం 3 నుంచి 7 తరగతుల వరకే పరిమితం చేశారన్నారు. మిగిలిన 21 పాఠశాలల్లో 3, 4 తరగతులను తొలగించారని మండిపడ్డారు. దీనివల్ల మారుమూల అటవీ గ్రామాల పిల్లలు 2 నుంచి 6 కిలోమీటర్లు అడవి మార్గంలో నడవాల్సి వస్తోందన్నారు. కొండారెడ్డి గిరిజన విద్యార్థులు 60 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువు మధ్యలోనే మానేసే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఈ రేషనలైజేషన్‌ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే 3 నుంచి 10వ తరగతి వరకు తరగతులను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కన్వీనర్ తగరం బాబురావు, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కారం అరుణ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ.భూషణం తదితరులు పాల్గొన్నారు.


