దేవుడి భూమికి ‘కాలనీ’ ముద్ర! | - | Sakshi
Sakshi News home page

దేవుడి భూమికి ‘కాలనీ’ ముద్ర!

Jul 15 2026 12:58 AM | Updated on Jul 15 2026 12:58 AM

ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి భూమి ఆన్‌లైన్‌ రికార్డులు మారినా.. అందులో దేవుడి పేరు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమ్మ సేవ సంఘం పేరును తొలగించి ‘కాలనీ’గా నమోదు చేయడంపై భక్తులు, స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. పూరీ మఠాధిపతి మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) లక్ష్మీపురంలో నిర్మించిన ఆలయాన్ని 1992లో ఆమె కుటుంబ సభ్యులు ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి దత్తత ఇచ్చారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న సర్వే నంబర్‌ 38/1 లోని 1.73 ఎకరాల భూమి అప్పటి నుంచి దేవస్థానం ఆధీనంలో ఉంది. ఈ భూమిలో స్వామివారి సేవలకు అవసరమైన తులసీ వనాన్ని పెంచేవారు.

దుమారం రేపిన కబ్జా వ్యవహారం

కొందరు టీడీపీ నాయకులు చెల్లుబాటు కాని అన్‌రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ఆధారంగా భూ రికార్డులను ఇటీవల కమ్మ సేవ సంఘం ద్వారకాతిరుమల మండలం పేరున మార్పించారు. అనంతరం భూమిలోని చెట్లు, తులసి మొక్కలు, ఫెన్సింగ్‌ను తొలగించి కబ్జా చేశారు. ఈ వ్యవహారాన్ని సాక్షి వెలుగులోకి తేవడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలోనే మాజీ హోం మంత్రి, వైఎస్సార్‌సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌న్‌చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దేవుడి భూమి దేవుడికే చెందాలంటూ ఆందోళనలు చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు మ్యూటేషన్‌ ప్రక్రియ చేపట్టి ఆన్‌లైన్‌ రికార్డులను మారుస్తామని తెలిపారు. ఈనెల 12 నాటికి ఆన్‌లైన్‌ రికార్డులు పాత స్థితికి వస్తాయని తహసీల్దార్‌ జేవీ సుబ్బారావు అప్పట్లో వెల్లడించారు.

దేవుడి పేరు ఏదీ

తహసీల్దార్‌ చెప్పినట్టుగా ఆన్‌లైన్‌ రికార్డుల్లో మార్పులు జరిగాయి. అయితే కమ్మ సేవ సంఘం పేరు తొలగించి దాని స్థానంలో ‘కాలనీ’ అని నమోదు చేయడం కొత్త వివాదానికి కారణమవుతోంది. దేవుడి భూమికి బదులు కాలనీ అని చూపడంపై భక్తులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

జిరాయితీ భూమి కాలనీ ఎలా అవుతుంది..?

ఫెయిర్‌ ల్యాండ్‌ రిజిస్టర్‌ (ఎఫ్‌ఎల్‌ఆర్‌)లో అమ్మాజీ కుటుంబ సభ్యుడు మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్‌కుమారాచార్యుల పేరు ఉంది. తాజాగా ఈనెల 12న మారిన అడంగల్‌లో భూమి స్వభావం ‘జిరాయితీ’గా ఉండగా, అనుభవదారుని పేరు ‘కాలనీ’గా చూపడం చర్చనీయాంశమైంది. దేవుడికి ఇచ్చిన భూమి, అందులోనూ జిరాయితీ భూమి అసలు కాలనీగా ఎలా మారుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దాత ఏమైనా భూమిని ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చారా.. అని పలువు ప్రశ్నిస్తున్నారు. గతంలో అడంగల్‌లో దొర్లిన తప్పుల కారణంగానే ఆన్‌లైన్‌లో కాలనీ అని నమోదు అయ్యిందా.. లేక అధికార పార్టీ నేతలే పథకం ప్రకారం దీన్ని కాలనీగా నమోదు చేయించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూవివాదం జరుగుతున్న సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని చెప్పడమే ఈ అనుమానాలకు తావిస్తోంది.

దేవస్థానం అడుగు ముందుకేస్తుందా..

అధికార పార్టీ నేతలకు భయపడో.. లేక ఎఫ్‌ఎల్‌ఆర్‌లో, అడంగల్‌లో తమ పేరు లేదనో తెలియదు గానీ మొదటి నుంచి దేవస్థానం అధికారులు ఈ భూమి తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. రహదారి పక్కనున్న భూమిలో చెట్లు, తులసి మొక్కలు, ఫెన్సింగ్‌ తొలగించినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు కనీసం క్రిమినల్‌ కేసు పెట్టక పోగా, మళ్లీ సాగు చేసేందుకు ఆ భూమిలో కనీసం అడుగు కూడా పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న దాత కుటుంబీకులు సదరు భూమి దేవుడికి చెందాలని జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర అధికారులకు లేఖలు పంపారు. అయినా అధికారులు ముందుకు అడుగు వేయడం లేదు. ఇప్పటికై నా అధికారులు చొరవచూపి దాత కుటుంబీకుల ద్వారా మ్యూటేషన్‌ చేయించి, దేవుడి పేరును రికార్డుల్లోకి చేర్పించాలని భక్తులు కోరుతున్నారు. అలాగే మళ్లీ వివాదాస్పద భూమిలో తులసీ వనాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.

రికార్డులు మారినా.. స్వామివారి పేరు లేదు

క్షేత్రంలో దేవుడి భూమిపై కొనసాగుతున్న అయోమయం

అధికార పార్టీ నేతలపైనే అందరికీ అనుమానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement