గోదావరి నదిపై అక్రమ రవాణా
కుక్కునూరు: గోదావరి నది స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. మండలంలోని వింజరం రేవు నుంచి తరలించిన 120 కేజీల గంజాయి బూర్గంపాడు వద్ద పట్టుబడడం, వందకు పైగా మూగజీవాలను వింజరం రేవు నుంచి తరలిస్తుంటే స్థానికులు పట్టుకోవడం వంటివి సంచలనం రేపాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రవహిస్తున్న గోదావరి నదికి అవతల పక్కన భద్రాచలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, వాటికి సమీపంలో ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. దీంతో గంజాయి, పశువులను ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు వాటిని గుట్టుచప్పుడు కాకుండా గోదావరి దాటించి మండలం మీదుగా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు.
అనుమతించిన రేవుల్లోనే ప్రయాణించాలి
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రజలు పలు పనుల నిమిత్తం గోదావరి మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గోదావరి దాటాలంటే ప్రభుత్వం అనుమతించిన రేవుల గుండా వెళ్లాలి. పడవల మీదుగా గోదావరి దాటించేందుకు అధికారికంగా వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట రేవుకు మాత్రమే అధికారులు వేలంపాట నిర్వహించి అనమతులు జారీచేశారు. కొంతమంది చేపలు పట్టేవారు ఆ సాకుతో పడవలలో ప్రజలను నిబంధనలకు విరుద్ధంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అనమతులు లేకుండా ప్రజల తరలింపును అధికారులు పట్టించుకోకపోవడంతో పనిలో పనిగా కొంతమంది అక్రమ మార్గంలో ఆదాయం కోసం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల బూర్గంపాడు గంజాయి కేసులో మండలంలోని వింజరం రేవులో చేపలు పట్టే వ్యక్తిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి గంజాయి స్మగ్లింగ్ ముఠాతో చేతులు కలిపి గంజాయిని పడవలపై తరలించినట్టు తెలుస్తుంది.
పడవలను అడ్డుకుంటాం
వింజరం రేవులో అక్రమంగా ప్రజలను పడవల్లో తరలించే విషయం నా దృష్టికి వచ్చింది. అలా దాటించే పడవలను సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం.
కె తాతారావు, సెక్రటరీ, వింజరం పంచాయతీ
చేపలు పట్టేందుకు అనుమతి అవసరం
గోదావరి నదిలో చేపలు పట్టే వారికి మత్స్యశాఖ నుంచి అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా నదిలో చేపలు పట్టడం చట్టవిరుద్ధం. అనుమతులు ఉన్న వారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టు తెలిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తాం.
కె మంగారావు, ఎఫ్‌డీఓ, ఐటీడీఏ కేఆర్ పురం
వింజరం రేవు నుంచి గంజాయి తరలింపు
ఇటీవల కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
గోదావరి నదిపై అక్రమ రవాణా
గోదావరి నదిపై అక్రమ రవాణా


