గిరిజనులతో చెలగాటం
ధ్వంసమైన పంటల పరిశీలన
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ ఏజెన్సీలో గిరిజనులతో రెవెన్యూ అధికారులు చెలాగాటమాడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం సద్దుమణిగిన భూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజన భూములపై గిరిజనేతరులకు హక్కులున్నాయంటూ అధికారులు ఏకపక్షంగా వ్యవహారించడం ఘర్షణలకు దారితీస్తు్నాయి.. 1994 తర్వాత ఈ ప్రాంతంలో సద్దుమణిగిన భూవివాదాలు వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో ఎక్కడా కనిపించలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం నిర్వాసితుల భూసేకరణ భూవివాదాలు రగులుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎల్‌టీఆర్ 1/70 పరిధిలో ఉన్న గిరిజనులు సాగుచేసుకుంటున్న, కోర్డు పెండింగ్‌లో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఏళ్ల తరబడి గిరిజన ప్రాంతంలో 1/70, ఎల్‌టీఆర్‌లో నమోదైన భూములు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి కనీసం రెవెన్యూ అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లే భూవివాదాలు తలెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఇనుమూరు భూ వివాదానికి సంబంధించి సుమారు 42 ఎకరాల భూమిని 57 కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్నా వాటికి పట్టాలు మంజూరు చేయడంలో అటు అధికారులు, ఇటు పాలకులు శ్రద్ధ చూపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూముల్లో కోర్టు వివాదాలు, 1/70, ఎల్‌టీఆర్ భూములు సేకరిస్తున్నట్లు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 186/2ఏ, సర్వే నెంబర్ 153, 154, 155 భూములు సుమారు 20 కుటుంబాలు ఎంతోకాలంగా సాగు చేసుకుంటుండగా ఆ భూములను అధికారులు అక్రమంగా ఆర్ అండ్ ఆర్‌లో దళారుల ప్రమేయంతో కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరంలో 493 ఎకరాలు, దొరమామిడిలో 97 ఎకరాలు, కేఆర్‌పురంలో 25 ఎకరాలు, కె.కన్నప్పగూడెంలో 14 ఎకరాల చొప్పున ఎల్‌టీఆర్ భూములు ఉన్నాయని ఈ భూములన్నింటిని కూడా గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటుంటే ఆ భూములను రెవెన్యూ అధికారులు అక్రమంగా రికార్డులు తారుమారు చేస్తూ ఆర్ అండ్ ఆర్‌లో కొనుగోలు చేస్తున్నారని సీపీఎం గిరిజన సంఘ నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు తెలిపారు. వివాదాస్పద భూముల పరిష్కారానికి అధికారులు కృషి చేయకపోతే గిరిజన ప్రాంతంలో భూపోరాటాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుట్టాయగూడెం: ఇనుమూరులో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి అడ్డొచ్చిన గిరిజన మహిళలపై దాడి చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం ఇనుమూరులో పర్యటించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న పంటను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు చట్టానికి మించి భూమి ఎలా వస్తుందని ప్రశ్నించారు. గిరిజనులకు చట్టాలు, హక్కులు ఉన్నా వాటిని అమలు చెయ్యవలసిన అధికారుల నిర్లక్ష్యం వల్లే భూ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. పంటను ధ్వంసం అడ్డుకున్న గిరిజనులను కొట్టడం, విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని అన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తామా ముత్యాలమ్మ, పిల్లి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో ఏళ్ల తరబడి భూవివాదాలు
గిరిజనుల ఫిర్యాదులు పట్టించుకోని అధికార యంత్రాంగం
30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి స్వాధీనానికి యత్నం


