ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?
● టీడీపీ నేత ఆగడాలపై అదే పార్టీకి చెందిన మరో నేత ఫిర్యాదు
● నిమ్మకు నీరెత్తినట్టుగా రెవెన్యూ యంత్రాంగం
ద్వారకాతిరుమల: ఓ టీడీపీ నేత దౌర్జన్యాన్ని అదే పార్టీకి చెందిన మరో నాయకుడు ఎండగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ నేత ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా, చేపల చెరువు తవ్వుతూ, పరిసర ప్రాంత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇప్పటికే పలుమార్లు అధికారులకు సదరు నాయకుడు ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆ నాయకుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాడు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఓ టీడీపీ నాయకుడు గత ఐదు రోజులుగా ఆర్‌ఎస్ నెంబర్ 220లో పొక్లెయిన్ సహాయంతో మట్టి తవ్వకాలు జరుపుతున్నాడు. ఆ నాయకుడు 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని కబ్జా చేసి, అందులో చేపల చెరువును తవ్వుతున్నాడని అదే పార్టీకి చెందిన ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. తవ్విన మట్టిని గట్టులా వేస్తుండటంతో చుట్టుపక్కల పొలాలకు వెళ్లే దారులు మూసుకు పోతున్నాయని, దీని కారణంగా రైతులతో పాటు, బయటకు వెళ్లే మార్గం లేక పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. అంతా తనదే అన్నట్టు రైతులు వెళ్లే దారిలో ముళ్లకంచెలు అడ్డంపెట్టి, రాకపోకలు బంధించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే 100, 112 నెంబర్లకు ఫిర్యాదు చేసినట్టు సదరు నాయకుడు, బాధిత రైతులు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకోకుండా, కేసు పెట్టండని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానిక రైతులు మండిపడుతున్నారు.
కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు
మండల కేంద్రానికి సమీప గ్రామమైన తిమ్మాపురంలో ఇంత తతంగం జరుగుతుంటే.. కనీసం రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై బాధిత రైతులు, ఫిర్యాదుదారు మండిపడుతున్నారు. పార్టీ అండ, అధికర బలంతో ఏకంగా 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జాకు గురైనా.. రెవెన్యూ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన నిరుపేదలకు సెంటు భూమి ఇచ్చేందుకు సవాలక్ష ఆంక్షలు పెట్టే అధికారులు, ఎంతో విలువైన భూమి ఇలా కబ్జాకు గురైనా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్న కబ్జా నాయకుడి తీరును చూస్తే అసలు ప్రభుత్వం ఉందా.. లేదా? అనే సందేహం కలుగుతోందని పలువురు రైతులు అంటున్నారు. అతడి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పవని ఫిర్యాది నాయకుడి వర్గం అంటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా నాయకుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?


