పండుగ రోజుల్లోనూ పస్తులే?
న్యూస్‌రీల్
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
బకాయిలు తక్షణం చెల్లించాలి
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఏలూరు (టూటౌన్): కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తమకు ఇప్పటికీ వేతనాలు చెల్లించరా అని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు గత మూడు నుంచి ఏడు నెలల వేతన బకాయిలు పేరుకుపోయాయి. తమకిచ్చే కొద్ది పాటి వేతనాలను సైతం చెల్లించకపోవడం పట్ల ఉద్యోగ, కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ సర్పంచ్‌ల ద్వారా తమ బకాయి వేతనాలు చెల్లించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 517 గ్రామ సచివాలయాల పరిధిలో మొత్తం 547 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2 వేల మంది వరకు వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 380 సచివాలయాల పరిధిలో 409 గ్రామ పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో దాదాపు 1,400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో బిల్లు కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, టెండర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోగా, కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. మైనర్ పంచాయతీల్లో రూ.5 నుంచి రూ.7 వేలు, మేజర్ పంచాయతీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల జీతాలు ఇస్తున్నారు. జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.26 వేల నెలవారీ జీతం ఇవ్వాలని నిర్ణయం ఉంది.
గ్లౌజులు, యూనిఫాంలకూ కొరతే..
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు కనీసం రక్షణకు చేతి గ్లౌజులు, చెప్పులు, కొబ్బరి నూనె వంటివి ఇవ్వడం లేదు. పంచాయతీ కార్మికులందరికీ ప్రతి సంవత్సరం యూనిఫాం అందించాలి. అది కూడా ఎక్కడా అమలు కావడం లేదు. వారికి ఇస్తున్న కొద్దిపాటి వేతనాలు రెగ్యులర్‌గా ఇవ్వడం లేదు. జిల్లాలో మూడు నెలల నుంచి ఏడు నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల కై కలూరు పంచాయతీలో ఏడు నెలల జీతాల బకాయిలు చెల్లించాలని కార్మికులంతా పనిని ఆపి రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. పంచాయతీ కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు.
ప్రస్తుతం క్రిస్మస్, సంక్రాంతి పండుగలు దగ్గర పడ్డాయి. జీతాలు రాకపోవడంతో పండగ పూట కూడా పస్తులు ఉండాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం నుంచి మొదట పంచాయతీ సిబ్బంది జీతాలు చెల్లించాలనే నిబంధనను అమలు చేయాలని కోరుతున్నారు. పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు రావడం లేదు. జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్న పెదపాడు పంచాయతీలో బకాయిలు ఇప్పటికీ రాని పరిస్థితి. ఏలూరు రూరల్ మండలం జాలిపూడి పంచాయతీలో నాలుగు నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయి. అత్యధిక పంచాయతీల్లో ఇదేవిధంగా నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోయాయి.
కార్మికులకు జాతీయ లేబర్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు మరీ తక్కువగా రూ.10 వేల లోపు జీతాలు ఇస్తున్నారు. పంచాయతీల ఆదాయంలో కార్మికుల జీతాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి. పండుగ రోజుల్లో కూడా పస్తులతో కార్మికులు పనిచేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృషి సారించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
– రెడ్డి శ్రీనివాస డాంగే, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా
జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికులకు బకాయిలు ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన చెప్పులు, కొబ్బరినూనె, సేఫ్టీ పరికరాలు, కార్మికులందరికీ యూనిఫాం వంటివి అందజేయాలి. చాలా పంచాయతీల్లో కార్మికులకు ఎరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని జీతాలతో పాటు చెల్లించాలి. పండుగ వేళల్లో చిరు ఉద్యోగులను ఉసూరు మన్పించడం పాలకులకు తగదు.
– పి.కిషోర్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ఎదురుచూపులు
జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన 3 నుంచి 7 నెలల బకాయిలు
తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్
పండుగ రోజుల్లోనూ పస్తులే?
పండుగ రోజుల్లోనూ పస్తులే?
పండుగ రోజుల్లోనూ పస్తులే?


