వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్యసేవలు అందించటంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని.. విధుల్లో అలసత్వం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ హెచ్చరించారు. కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జీజీహెచ్‌ను మంగళవారం రాత్రి ఆయన తనికీ చేశారు. హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు, వార్డుల్లో రోగులకు ఏ విధమైన వైద్యసేవలు అందుతున్నాయో ఆరా తీశారు. రోగులను ఆయనే స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్‌లోని ప్రతి విభాగంలోనూ వైద్య చికిత్సలు, సౌకర్యాలు, సిబ్బంది సేవలపై వైద్య అధికారులను ఆరా తీశారు. ప్రసూతి, చిన్నపిల్లల వార్డులు, క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి సేవలపై రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోందని, దానికి అనుగుణంగా వైద్య సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులు సంతృప్తిగా ఇంటికి వెళ్ళే పరిస్థితి రావాలని, వైద్యులు, సిబ్బంది దానికి తగినట్లు సేవలు అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై రోగులు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేసి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. హాస్పిటల్ పరిసరాలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం, హాస్పిటల్స్ సేవల సమన్వయాధికారి డాక్టర్ పాల్‌సతీష్, జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


