అభివృద్ధి – దుర్బుద్ధి!

Vardhelli Murali Article On Chandrababu Naidu And Yellow Media Stands On Andhra pradesh - Sakshi

జనతంత్రం

ఆ రెండు పత్రికలూ, ఇంకో రెండు మూడు న్యూస్‌ చానళ్లకూ కలిపి ఎల్లో మీడియా అని పేరు. మొదట్లో కాంగ్రెస్‌వాళ్లూ, ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వాళ్లు మాత్రమే ఆవిధంగా పిలిచే వాళ్లు. ఇప్పుడు తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీలన్నీ అదే మాటను వాడేస్తున్నాయి. తటస్థ వ్యాఖ్యాతలు, విశ్లేషకులూ కూడా మీడియా చర్చల్లో, వ్యాసాల్లో నిస్సంకోచంగా ఆ మాటను ఉపయోగిస్తున్నారు. పదిమంది కూడిన చోట మీడియా ప్రసక్తి వస్తే ఎల్లో మీడియా అనే మాట దొర్లకుండా ఉండటం లేదు.ఆ మీడియా దొర్లాడే బురద గురించీ, ఆ బురద కలిగించే దురద గురించీ సాధారణ ప్రజల్లో అవగాహన పెరిగింది. అటువంటి చైతన్యశీలమైన అవగాహన కలిగించినందుకు సదరు మీడియాకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేము.

ఎన్టీ రామారావు ప్రచ్ఛన్న హత్య, అందుకోసం జరిగిన కుట్ర కాలం నుంచే చంద్రబాబు–ఎల్లో మీడియా అవిభాజ్య కవలలుగా పరివర్తన చెందారు. అభివృద్ధి అనేది ఎక్కడో వేరుగా ఉండదనీ ఆ మాటకు అర్థం తన కవల సోదరుడు చంద్రబాబే నని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. కావచ్చునేమోనని కొందరు భావించారు. కాలం ప్రవహిస్తూ జనం చేతికి ఇంటర్నెట్‌ను అందజేసింది. ఔత్సాహికులు కొందరు అభివృద్ధి అనే మాటల్ని టైప్‌చేసి గూగుల్‌లో చంద్రబాబు కోసం వెతికారు. కనబడలేదు. అన్వేషణ ఒక్క మాట దగ్గరే ఆగదు కదా. ఇంకేదో టైప్‌ చేశారు. చంద్రబాబు వారసుడు కనిపించాడు. మిగిలిన కథ వెండితెరపై చూడనవసరం లేకుండా అర్థమైపోయింది. అయినా ఎల్లో మీడియా ధోరణిలో మార్పు రాలేదు. తన కంఠంలో ఊపిరి పోయేలోగా కవల సోదరునికి మరొక్కమారు అధికారం కట్టబెట్టాలని తాయెత్తు కట్టుకున్నది.

ఇప్పుడు ఎల్లో మీడియా అరివీర భయంకరమైన దీక్షలో ఉన్నది. రోజుకొక కట్టుకథను వెదజల్లుతున్నది. వారానికి ఒక కుట్రను ప్రయోగిస్తున్నది. తన కవల సోదరుడు ఉరఫ్‌ అభి వృద్ధిబాబు పరిపాలించిన ‘స్వర్ణయుగాన్ని’ గుర్తుకు తెస్తున్నది. చంద్రబాబు మూడువేల కోట్లు గుమ్మరించి గ్రామాలకు తళతళ మెరిసే రోడ్లు వేయించారట. ఆయన అధికారాన్ని కోల్పోయిన వార్త తెలిసిన వెంటనే ఆ రోడ్లను కాకులు ఎత్తుకుని పోయా యట. ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగాలేదట. ఇప్పుడు బాగా లేకపోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని ఎల్లో మీడియా వాదిస్తున్నది. నిజానికి బాధ్యత వహించవలసింది ఎవరు? కాంట్రాక్టులు తీసుకుని నాసిరకం పనులు చేసిన టీడీపీ కార్యకర్తలా? కార్యకర్తల పనుల్లో కూడా కమీషన్లకు కక్కుర్తిపడిన అధినాయకత్వమా?... రెండేళ్లకో మారు చెత్తరోడ్లను వేసి కాంట్రాక్టుల పేరుతో కాకుల్ని, గద్దల్ని మేపడాన్ని అభివృద్ధి అంటారా?

కారణాలు ఏమైనా సరే, గ్రామీణ రోడ్లు చాలాచోట్ల దెబ్బ తిన్నమాట వాస్తవం. రోడ్ల పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి వర్షాలు ముగిసిన వెంటనే పెద్దఎత్తున వాటి మరమ్మతు కార్య క్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా ఇక్కడే ఇంకో పిట్టకథ పురుడుపోసుకున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలి చ్చిన వారంరోజుల తర్వాత జనసేన నేత పవన్‌కల్యాణ్‌ స్పందిం చారు. రోడ్ల దుస్థితిపై అక్టోబర్‌ నుంచి తాను ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. చాలాకాలంగా ఆయన సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. తాజా చిత్రం భీమ్లా నాయక్‌ దీపావళికో సంక్రాంతికో రిలీజ్‌ కావలసి ఉన్నది. ఉద్యమం చేస్తే ఉభయతారకంగా ఉంటుంది. గుంతలు పడిన ఒక రోడ్డు మీద మైలుదూరం యాత్ర చేస్తే మీడియా మైలేజీ దొరుకుతుంది. అటు సినిమా ప్రమోషన్‌ కార్యం నెరవేరుతుంది. ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది కనుక రోడ్ల మరమ్మతులు చేస్తారు. ఫలితంగా ఇటు పొలిటికల్‌ ప్రమోషన్‌ కూడా చేసు కోవచ్చు. చంద్రబాబు సలహాల మేరకే జనసేనాపతి రాజకీయ కార్యక్రమాలుంటాయని జనంలో ఒక అభిప్రాయం ఉన్నది. రోడ్ల దుస్థితిపై తన ప్రధాన దాడిని చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్కుపెట్టకపోయినట్లయితే ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది.

అనేక జీవన రంగాలకు సంబంధించి ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై వేలెత్తి చూపే అవకాశమే లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, సామాజిక పెన్షన్లు... ఇలా ఏ ఒక్క రంగంపైనైనా సరే నిష్పాక్షిక పరిశీలకులు అధ్య యనం చేయవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన దగ్గర నుంచి వరుసగా ఏ అయిదేళ్ల కాలంలోనూ సాధించనంత ప్రగతి ఈ రెండున్నరేళ్లలోనే సాధ్యమైంది. అదీ ఆర్థిక మందగమనం, కోవిడ్‌ మహమ్మారి కమ్ముకున్న కాలంలో. అననుకూల పరి స్థితుల నడుమ సాధించిన అద్భుతమైన ఫీట్‌. శాంతిభద్రతలు, పోలీసింగ్‌ విషయంలో పలు కేంద్రస్థాయి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్‌ గెలుచుకున్నది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్ర స్థానాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో పలు రంగాలపై కువిమ ర్శలు చేయడానికి ప్రయత్నించి ఎల్లో మీడియా అభాసు పాలైంది.

ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వంపై దాడికి రెండంశాలను ఎల్లో మీడియా ఎంపిక చేసుకున్నది. వాటిలో ఒకటి అభివృద్ధి. రెండోది అప్పులు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొ క్కండై కనిపిస్తాడన్నట్టుగా అభివృద్ధి మీద చాలారకాల అభిప్రా యాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కట్టి, రింగ్‌ రోడ్లు వేయడమే అభివృద్ధిగా ప్రచారం చేసేవాళ్లు, నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు. కనుక ఈ అంశంపై తమకు తోచినట్టు రాసు కోవచ్చునని ఎల్లోమీడియా భావించింది. ఇక రాష్ట్రం అప్పులు చేసిన మాట నిజం. చేస్తున్న మాట నిజం. అసలు ఎందుకు చేయవలసి వస్తున్నది? కేంద్రం చేయడం లేదా? ఇతర రాష్ట్రాలు చేయడం లేదా? మొదలైన ప్రశ్నలతో వారికి సంబంధం లేదు. రాష్ట్రం అప్పులపాలైందని గగ్గోలుపెట్టడమే ఎల్లో మీడియా తక్షణ ఎజెండా.

అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, అప్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచేస్తున్నదని రోజువారీ గగ్గోలు కార్యక్రమాన్ని ఎల్లోమీడియా చేపట్టింది. అసలు అభివృద్ధి అంటే ఏమిటని ఒకసారి ప్రశ్నించుకోవలసిన సందర్భం ఇది. ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారతీ యులే ఎక్కువమంది ఉన్నారు. అంబానీగారి ఆస్తులు రూ. ఆరు లక్షల కోట్లను దాటేశాయి. అదానీ గారు మూడున్నర లక్షల కోట్లను అధిగమించారు. శివదాస్‌ నాడార్‌ గారు రెండున్నర లక్షల కోట్లకు చేరువయ్యారు. స్టాక్‌మార్కెట్‌ రోజూ కొత్త శిఖరా లను అధిరోహిస్తున్నది. ఇప్పుడు ఇండియా అభివృద్ధి చెంది నట్టేనా? అమెరికా, చైనాల తర్వాత మనదే ధనిక దేశమని అంగీకరిద్దామా?

పెట్టుబడిదారీ వ్యవస్థలకు బాసటగా నిలబడే ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పుడు ఈ అసమతుల్య అభివృద్ధిని అభి వృద్ధిగా పరిగణించడం లేదు. ’’Beyond economic growth’’ అనే పుస్తకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రచురించింది. అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధి అనేది ఒక భాగం మాత్రమే. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అనే మూడు అంశాల సమతుల్యతతో కూడిన అభి వృద్ధే నిజమైన అభివృద్ధిగా ఈ పుస్తకంలో స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా సమాజంలోని అన్నివర్గాల ప్రజలకూ సమాన అవకాశాలు లభించాలి. అందరూ సమానస్థాయిలో పోటీపడగలగాలి. ప్రజలందరి సామాజిక–ఆర్థికాభివృద్ధికోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను నేర్పుగా, ఆ ప్రకృతిని విధ్వంసం చేయకుండా వాడుకోవాలి. కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేసిన చర్యల దుష్ఫలితాన్ని ఇప్పుడు మనం వాతావరణ మార్పు (climate change)లో చూడగలుగుతున్నాము. భారతదేశం సాధించిన ఆర్థిక వృద్ధి మీద తాము రాసిన ’’uncertain glory’’ అనే పుస్తకంలో అమర్త్యసేన్, జీన్‌డ్రిజ్‌లు ఒక ఆసక్తికరమైన కామెంట్‌ చేశారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒక సముద్రం అనుకుంటే, అందులో అక్కడక్కడా కాలి ఫోర్నియా వంటి ద్వీపాలున్నట్టుగా ఇండియా అభివృద్ధి ఉన్న దట. అంకెల్లో చూస్తే వృద్ధిరేటు బాగానే ఉన్నది. కానీ ఈ దేశ ప్రజల జీవన స్థితిగతులూ, వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద ఎటువంటి ప్రభావం చూపగలిగిందన్న కోణంలోంచే వృద్ధి రేటును అర్థం చేసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయ పడ్డారు. 

నిజమైన అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎల్లో మీడియాకు వాటి రింగ్‌ లీడరైన చంద్రబాబుకు సమ్మతమైనవి కావని వారి వ్యవహారౖ శెలే నిరూపిస్తున్నది. ముక్కారు పంటలు పండే 35 వేల ఎకరాల మాగాణి భూముల్లో ఎవరైనా రాజ ధానిని కట్టాలని తలపోస్తారా? మరో పదిహేను వేల ఎకరాల రిజర్వు ఫారెస్ట్‌ భూములను కూడా రాజధాని కోసం వాడు కోవాలని ఆలోచించారు. అంటే దాదాపు ఇరవై వేల హెక్టార్ల గ్రీన్‌ బెల్ట్‌ను కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చే దుష్ట పన్నాగానికి పాల్ప డ్డారు. పాలిచ్చే ఆవు పొదుగును కోసే నీచకార్యం కాక మరేమి టిది? అన్ని వర్గాలు, కులాలు, మతాలు, జాతులకు చెందిన సమస్త ప్రజలు ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా సమ్మిళి తంగా అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని ఆర్థికవేత్త లందరూ చెబుతున్న మాట. చంద్రబాబు ఈ సిద్ధాంతానికి బద్ధవ్యతిరేకని ఆయన మాటల్లోనే బయట పడింది. కష్టజీవులైన మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, దళితులను తూలనాడి, కించపరచడాన్ని తెలుగు ప్రజలందరూ చూశారు. మహిళల పట్ల వివక్షాపూరితంగా మాట్లాడిన వైనాన్ని కూడా సమాజం చూసింది. శ్రామిక ప్రజల పట్ల, మహిళల పట్ల ఆయనకు చులకన భావం ఉన్నది, కనుక సామాజిక సమానత్వాన్ని ఆయన అంగీకరించరు. బాబు చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలను ఎల్లో మీడియా ఏనాడూ ఖండించలేదు కనుక వారి మధ్యన సైద్ధాం తిక సమన్వయం కూడా ఉన్నదని భావించాలి.

బాబు–ఎల్లో మీడియాల సైద్ధాంతిక భావాల నేపథ్యం లోంచి చూసినప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై వారికి ఉన్న తీవ్ర వ్యతిరేకతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో నివసించే కడగొట్టు నిరుపేదకు కూడా సంక్షేమ ఫలం అందేలా, సమానాభివృద్ధి అవకాశం దొరికేలా జగన్‌ ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించుకున్నది. విద్యారంగంలో మహోన్నతమైన విప్లవానికి ఈ ప్రభుత్వం జ్యోతి ప్రజ్వలన చేసింది. అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందజేసే సంకల్పాన్ని చెప్పుకున్నది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొడి గట్టిన దీపంలా మారిన తెలుగు భాషను అన్ని స్కూళ్లలోనూ తప్పనిసరి సబ్జెక్టుగా ప్రకటించి తెలుగు భాషకు కొత్త ఊపిరి పోశారు. అదే సమయంలో ఇంగ్లిష్‌ను బోధనా భాషగా చేసి మన విద్యార్థులను భావి విజేతలుగా మలిచేందుకు చర్యలు తీసుకున్నారు. భాష ఒక్కటే కాదు సిలబస్‌ను సైతం మారు తున్న సమాజ అవసరాలకు అనుగుణంగా, మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దే దోహదకారిగా మార్చుకున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఆ రాష్ట్రంలో చదువు అనేది తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, ఎంత మాత్రం భారం కాదు. ఏ ఒత్తిడీ లేకుండా చదువుకునే అవకాశం దొరికింది. ఇదొక గొప్ప ముందడుగు.

వైద్య రంగంలో కూడా ఆ ప్రభుత్వం సమస్త ప్రజల పక్షాన నిలబడింది. పల్లెటూళ్లలో వైద్యం దొరకదు అనే పరిస్థితి నుంచి ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ వైద్యుడు నెలకు ఒక మారైనా పలకరించబోతున్నాడు అనే దశకు అతి త్వరలో రాష్ట్రం చేరుకోనున్నది. ప్రతి జనావాసంలో ఒక హెల్త్‌ క్లినిక్‌ ఉంటుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లుంటారు. ఒక డాక్టర్‌ అంబులెన్స్‌లో నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తుంటాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్స్‌తో, ఏరియా ఆసుపత్రులతో, బోధనా ఆసుపత్రులతో సంధానించి ఉంటాయి. అచిర కాలంలోనే ఇవన్నీ అమల్లోకి రానున్నాయి.

వ్యవసాయ రంగంలో రైతులు స్వయం సమృద్ధమయ్యే విధంగా, మహిళలు సాధికార శక్తులుగా మారే విధంగా, నడి వయసు దాటిన మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్య్రాన్ని అను భవించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న– మధ్య శ్రేణి పరిశ్రమలను (ఎంఎస్‌ఎమ్‌ఇ) కోవిడ్‌ ఉత్పాతా న్నించి రక్షించి గట్టెక్కించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిల బడింది. ముప్పయ్‌ లక్షలమంది ఆడపడుచులకు సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం ఒక బృహత్‌యజ్ఞం మాదిరిగా ప్రారంభమైంది. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే అక్కడ మౌలిక వసతులు ఏర్పాటై గృహప్రవేశాలు జరిగితే ఒక్కొక్క ఇంటి విలువ అధమపక్షం పది లక్షలవుతుంది. అంబానీ, అదానీల ఆస్తుల లెక్క కంటే ఆసక్తికరమైన లెక్క ఇది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన రాష్ట్రంలోని నిరుపేద మహిళలకిచ్చిన ఆడపడుచు లాంఛనం విలువ మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు కాబోతున్నది.

అప్పులుచేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ఎల్లో మీడియా చేస్తున్న యాగీకి క్షేత్రస్థాయి పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజల ఆస్తుల విలువ పెరుగుతున్నది. ప్రజలకు నాణ్యమైన విద్య–వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. రైతుకు భరోసా దొరుకుతున్నది. మహిళలకు చేయూత లభిస్తున్నది. ఔను అప్పు చేస్తున్నారు. ఔను అప్పు చేస్తున్నానని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఏ రాష్ట్రమూ, కేంద్రమూ కూడా అప్పు చేయకుండా ఉండగలిగిన పరిస్థితి లేదు. కోవిడ్‌ కార ణంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా 8 వేల కోట్లు తగ్గింది. సొంత పన్నుల రాబడి మరో 7 వేల కోట్లు తగ్గింది. కోవిడ్‌ నియంత్రణ పేరుతో 8 వేల కోట్ల అదనపు ఖర్చు తోడయ్యింది. 23 వేల కోట్ల అదనపు భారం ఒక్క సంవత్సరంలో. ఇటువంటి భారాన్ని అన్ని రాష్ట్రాలూ, అన్ని దేశాలూ ఎదుర్కోవలసి వస్తున్నది. ఇదొక విపత్తు. ఈ విపత్తులో ప్రజల పక్షాన నిలబడి వారిని నిల బెట్టాలా లేక ప్రజా సంక్షేమానికి హాలిడే ప్రకటించి ప్రభుత్వా ధినేతలు వారి సొంత పనులు చూసుకోవాలా? ఎల్లో మీడియా స్పష్టం చేయాలి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top