breaking news
Varddhelli murali
-
అభివృద్ధి – దుర్బుద్ధి!
ఆ రెండు పత్రికలూ, ఇంకో రెండు మూడు న్యూస్ చానళ్లకూ కలిపి ఎల్లో మీడియా అని పేరు. మొదట్లో కాంగ్రెస్వాళ్లూ, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు మాత్రమే ఆవిధంగా పిలిచే వాళ్లు. ఇప్పుడు తెలుగుదేశం మినహా మిగిలిన పార్టీలన్నీ అదే మాటను వాడేస్తున్నాయి. తటస్థ వ్యాఖ్యాతలు, విశ్లేషకులూ కూడా మీడియా చర్చల్లో, వ్యాసాల్లో నిస్సంకోచంగా ఆ మాటను ఉపయోగిస్తున్నారు. పదిమంది కూడిన చోట మీడియా ప్రసక్తి వస్తే ఎల్లో మీడియా అనే మాట దొర్లకుండా ఉండటం లేదు.ఆ మీడియా దొర్లాడే బురద గురించీ, ఆ బురద కలిగించే దురద గురించీ సాధారణ ప్రజల్లో అవగాహన పెరిగింది. అటువంటి చైతన్యశీలమైన అవగాహన కలిగించినందుకు సదరు మీడియాకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేము. ఎన్టీ రామారావు ప్రచ్ఛన్న హత్య, అందుకోసం జరిగిన కుట్ర కాలం నుంచే చంద్రబాబు–ఎల్లో మీడియా అవిభాజ్య కవలలుగా పరివర్తన చెందారు. అభివృద్ధి అనేది ఎక్కడో వేరుగా ఉండదనీ ఆ మాటకు అర్థం తన కవల సోదరుడు చంద్రబాబే నని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. కావచ్చునేమోనని కొందరు భావించారు. కాలం ప్రవహిస్తూ జనం చేతికి ఇంటర్నెట్ను అందజేసింది. ఔత్సాహికులు కొందరు అభివృద్ధి అనే మాటల్ని టైప్‌చేసి గూగుల్‌లో చంద్రబాబు కోసం వెతికారు. కనబడలేదు. అన్వేషణ ఒక్క మాట దగ్గరే ఆగదు కదా. ఇంకేదో టైప్ చేశారు. చంద్రబాబు వారసుడు కనిపించాడు. మిగిలిన కథ వెండితెరపై చూడనవసరం లేకుండా అర్థమైపోయింది. అయినా ఎల్లో మీడియా ధోరణిలో మార్పు రాలేదు. తన కంఠంలో ఊపిరి పోయేలోగా కవల సోదరునికి మరొక్కమారు అధికారం కట్టబెట్టాలని తాయెత్తు కట్టుకున్నది. ఇప్పుడు ఎల్లో మీడియా అరివీర భయంకరమైన దీక్షలో ఉన్నది. రోజుకొక కట్టుకథను వెదజల్లుతున్నది. వారానికి ఒక కుట్రను ప్రయోగిస్తున్నది. తన కవల సోదరుడు ఉరఫ్ అభి వృద్ధిబాబు పరిపాలించిన ‘స్వర్ణయుగాన్ని’ గుర్తుకు తెస్తున్నది. చంద్రబాబు మూడువేల కోట్లు గుమ్మరించి గ్రామాలకు తళతళ మెరిసే రోడ్లు వేయించారట. ఆయన అధికారాన్ని కోల్పోయిన వార్త తెలిసిన వెంటనే ఆ రోడ్లను కాకులు ఎత్తుకుని పోయా యట. ఇప్పుడు రోడ్ల పరిస్థితి బాగాలేదట. ఇప్పుడు బాగా లేకపోవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలని ఎల్లో మీడియా వాదిస్తున్నది. నిజానికి బాధ్యత వహించవలసింది ఎవరు? కాంట్రాక్టులు తీసుకుని నాసిరకం పనులు చేసిన టీడీపీ కార్యకర్తలా? కార్యకర్తల పనుల్లో కూడా కమీషన్లకు కక్కుర్తిపడిన అధినాయకత్వమా?... రెండేళ్లకో మారు చెత్తరోడ్లను వేసి కాంట్రాక్టుల పేరుతో కాకుల్ని, గద్దల్ని మేపడాన్ని అభివృద్ధి అంటారా? కారణాలు ఏమైనా సరే, గ్రామీణ రోడ్లు చాలాచోట్ల దెబ్బ తిన్నమాట వాస్తవం. రోడ్ల పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి వర్షాలు ముగిసిన వెంటనే పెద్దఎత్తున వాటి మరమ్మతు కార్య క్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సరిగ్గా ఇక్కడే ఇంకో పిట్టకథ పురుడుపోసుకున్నది. ముఖ్యమంత్రి ఆదేశాలి చ్చిన వారంరోజుల తర్వాత జనసేన నేత పవన్‌కల్యాణ్ స్పందిం చారు. రోడ్ల దుస్థితిపై అక్టోబర్ నుంచి తాను ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. చాలాకాలంగా ఆయన సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. తాజా చిత్రం భీమ్లా నాయక్ దీపావళికో సంక్రాంతికో రిలీజ్ కావలసి ఉన్నది. ఉద్యమం చేస్తే ఉభయతారకంగా ఉంటుంది. గుంతలు పడిన ఒక రోడ్డు మీద మైలుదూరం యాత్ర చేస్తే మీడియా మైలేజీ దొరుకుతుంది. అటు సినిమా ప్రమోషన్ కార్యం నెరవేరుతుంది. ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది కనుక రోడ్ల మరమ్మతులు చేస్తారు. ఫలితంగా ఇటు పొలిటికల్ ప్రమోషన్ కూడా చేసు కోవచ్చు. చంద్రబాబు సలహాల మేరకే జనసేనాపతి రాజకీయ కార్యక్రమాలుంటాయని జనంలో ఒక అభిప్రాయం ఉన్నది. రోడ్ల దుస్థితిపై తన ప్రధాన దాడిని చంద్రబాబు ప్రభుత్వంపై ఎక్కుపెట్టకపోయినట్లయితే ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది. అనేక జీవన రంగాలకు సంబంధించి ఈ రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై వేలెత్తి చూపే అవకాశమే లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, సామాజిక పెన్షన్లు... ఇలా ఏ ఒక్క రంగంపైనైనా సరే నిష్పాక్షిక పరిశీలకులు అధ్య యనం చేయవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి వరుసగా ఏ అయిదేళ్ల కాలంలోనూ సాధించనంత ప్రగతి ఈ రెండున్నరేళ్లలోనే సాధ్యమైంది. అదీ ఆర్థిక మందగమనం, కోవిడ్ మహమ్మారి కమ్ముకున్న కాలంలో. అననుకూల పరి స్థితుల నడుమ సాధించిన అద్భుతమైన ఫీట్. శాంతిభద్రతలు, పోలీసింగ్ విషయంలో పలు కేంద్రస్థాయి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ గెలుచుకున్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర స్థానాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో పలు రంగాలపై కువిమ ర్శలు చేయడానికి ప్రయత్నించి ఎల్లో మీడియా అభాసు పాలైంది. ఇప్పుడు తమకు గిట్టని ప్రభుత్వంపై దాడికి రెండంశాలను ఎల్లో మీడియా ఎంపిక చేసుకున్నది. వాటిలో ఒకటి అభివృద్ధి. రెండోది అప్పులు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొ క్కండై కనిపిస్తాడన్నట్టుగా అభివృద్ధి మీద చాలారకాల అభిప్రా యాలున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు కట్టి, రింగ్ రోడ్లు వేయడమే అభివృద్ధిగా ప్రచారం చేసేవాళ్లు, నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు. కనుక ఈ అంశంపై తమకు తోచినట్టు రాసు కోవచ్చునని ఎల్లోమీడియా భావించింది. ఇక రాష్ట్రం అప్పులు చేసిన మాట నిజం. చేస్తున్న మాట నిజం. అసలు ఎందుకు చేయవలసి వస్తున్నది? కేంద్రం చేయడం లేదా? ఇతర రాష్ట్రాలు చేయడం లేదా? మొదలైన ప్రశ్నలతో వారికి సంబంధం లేదు. రాష్ట్రం అప్పులపాలైందని గగ్గోలుపెట్టడమే ఎల్లో మీడియా తక్షణ ఎజెండా. అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, అప్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచేస్తున్నదని రోజువారీ గగ్గోలు కార్యక్రమాన్ని ఎల్లోమీడియా చేపట్టింది. అసలు అభివృద్ధి అంటే ఏమిటని ఒకసారి ప్రశ్నించుకోవలసిన సందర్భం ఇది. ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారతీ యులే ఎక్కువమంది ఉన్నారు. అంబానీగారి ఆస్తులు రూ. ఆరు లక్షల కోట్లను దాటేశాయి. అదానీ గారు మూడున్నర లక్షల కోట్లను అధిగమించారు. శివదాస్ నాడార్ గారు రెండున్నర లక్షల కోట్లకు చేరువయ్యారు. స్టాక్‌మార్కెట్ రోజూ కొత్త శిఖరా లను అధిరోహిస్తున్నది. ఇప్పుడు ఇండియా అభివృద్ధి చెంది నట్టేనా? అమెరికా, చైనాల తర్వాత మనదే ధనిక దేశమని అంగీకరిద్దామా? పెట్టుబడిదారీ వ్యవస్థలకు బాసటగా నిలబడే ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పుడు ఈ అసమతుల్య అభివృద్ధిని అభి వృద్ధిగా పరిగణించడం లేదు. ’’Beyond economic growth’’ అనే పుస్తకాన్ని ప్రపంచ బ్యాంకు ప్రచురించింది. అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధి అనేది ఒక భాగం మాత్రమే. ఆర్థిక, సామాజిక, పర్యావరణ అనే మూడు అంశాల సమతుల్యతతో కూడిన అభి వృద్ధే నిజమైన అభివృద్ధిగా ఈ పుస్తకంలో స్పష్టం చేశారు. ఆర్థికాభివృద్ధిలో భాగంగా సమాజంలోని అన్నివర్గాల ప్రజలకూ సమాన అవకాశాలు లభించాలి. అందరూ సమానస్థాయిలో పోటీపడగలగాలి. ప్రజలందరి సామాజిక–ఆర్థికాభివృద్ధికోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను నేర్పుగా, ఆ ప్రకృతిని విధ్వంసం చేయకుండా వాడుకోవాలి. కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం పర్యావరణాన్ని ధ్వంసం చేసిన చర్యల దుష్ఫలితాన్ని ఇప్పుడు మనం వాతావరణ మార్పు (climate change)లో చూడగలుగుతున్నాము. భారతదేశం సాధించిన ఆర్థిక వృద్ధి మీద తాము రాసిన ’’uncertain glory’’ అనే పుస్తకంలో అమర్త్యసేన్, జీన్డ్రిజ్లు ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒక సముద్రం అనుకుంటే, అందులో అక్కడక్కడా కాలి ఫోర్నియా వంటి ద్వీపాలున్నట్టుగా ఇండియా అభివృద్ధి ఉన్న దట. అంకెల్లో చూస్తే వృద్ధిరేటు బాగానే ఉన్నది. కానీ ఈ దేశ ప్రజల జీవన స్థితిగతులూ, వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద ఎటువంటి ప్రభావం చూపగలిగిందన్న కోణంలోంచే వృద్ధి రేటును అర్థం చేసుకోవలసి ఉంటుందని వారు అభిప్రాయ పడ్డారు. నిజమైన అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎల్లో మీడియాకు వాటి రింగ్ లీడరైన చంద్రబాబుకు సమ్మతమైనవి కావని వారి వ్యవహారౖ శెలే నిరూపిస్తున్నది. ముక్కారు పంటలు పండే 35 వేల ఎకరాల మాగాణి భూముల్లో ఎవరైనా రాజ ధానిని కట్టాలని తలపోస్తారా? మరో పదిహేను వేల ఎకరాల రిజర్వు ఫారెస్ట్ భూములను కూడా రాజధాని కోసం వాడు కోవాలని ఆలోచించారు. అంటే దాదాపు ఇరవై వేల హెక్టార్ల గ్రీన్ బెల్ట్‌ను కాంక్రీట్ జంగిల్‌గా మార్చే దుష్ట పన్నాగానికి పాల్ప డ్డారు. పాలిచ్చే ఆవు పొదుగును కోసే నీచకార్యం కాక మరేమి టిది? అన్ని వర్గాలు, కులాలు, మతాలు, జాతులకు చెందిన సమస్త ప్రజలు ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా సమ్మిళి తంగా అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని ఆర్థికవేత్త లందరూ చెబుతున్న మాట. చంద్రబాబు ఈ సిద్ధాంతానికి బద్ధవ్యతిరేకని ఆయన మాటల్లోనే బయట పడింది. కష్టజీవులైన మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, దళితులను తూలనాడి, కించపరచడాన్ని తెలుగు ప్రజలందరూ చూశారు. మహిళల పట్ల వివక్షాపూరితంగా మాట్లాడిన వైనాన్ని కూడా సమాజం చూసింది. శ్రామిక ప్రజల పట్ల, మహిళల పట్ల ఆయనకు చులకన భావం ఉన్నది, కనుక సామాజిక సమానత్వాన్ని ఆయన అంగీకరించరు. బాబు చేసిన వివక్షాపూరిత వ్యాఖ్యలను ఎల్లో మీడియా ఏనాడూ ఖండించలేదు కనుక వారి మధ్యన సైద్ధాం తిక సమన్వయం కూడా ఉన్నదని భావించాలి. బాబు–ఎల్లో మీడియాల సైద్ధాంతిక భావాల నేపథ్యం లోంచి చూసినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై వారికి ఉన్న తీవ్ర వ్యతిరేకతను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో నివసించే కడగొట్టు నిరుపేదకు కూడా సంక్షేమ ఫలం అందేలా, సమానాభివృద్ధి అవకాశం దొరికేలా జగన్ ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించుకున్నది. విద్యారంగంలో మహోన్నతమైన విప్లవానికి ఈ ప్రభుత్వం జ్యోతి ప్రజ్వలన చేసింది. అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందజేసే సంకల్పాన్ని చెప్పుకున్నది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొడి గట్టిన దీపంలా మారిన తెలుగు భాషను అన్ని స్కూళ్లలోనూ తప్పనిసరి సబ్జెక్టుగా ప్రకటించి తెలుగు భాషకు కొత్త ఊపిరి పోశారు. అదే సమయంలో ఇంగ్లిష్‌ను బోధనా భాషగా చేసి మన విద్యార్థులను భావి విజేతలుగా మలిచేందుకు చర్యలు తీసుకున్నారు. భాష ఒక్కటే కాదు సిలబస్‌ను సైతం మారు తున్న సమాజ అవసరాలకు అనుగుణంగా, మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దే దోహదకారిగా మార్చుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఆ రాష్ట్రంలో చదువు అనేది తల్లిదండ్రులకు కానీ, పిల్లలకు కానీ, ఎంత మాత్రం భారం కాదు. ఏ ఒత్తిడీ లేకుండా చదువుకునే అవకాశం దొరికింది. ఇదొక గొప్ప ముందడుగు. వైద్య రంగంలో కూడా ఆ ప్రభుత్వం సమస్త ప్రజల పక్షాన నిలబడింది. పల్లెటూళ్లలో వైద్యం దొరకదు అనే పరిస్థితి నుంచి ప్రతి పల్లెలోని ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ వైద్యుడు నెలకు ఒక మారైనా పలకరించబోతున్నాడు అనే దశకు అతి త్వరలో రాష్ట్రం చేరుకోనున్నది. ప్రతి జనావాసంలో ఒక హెల్త్ క్లినిక్ ఉంటుంది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లుంటారు. ఒక డాక్టర్ అంబులెన్స్‌లో నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తుంటాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌తో, ఏరియా ఆసుపత్రులతో, బోధనా ఆసుపత్రులతో సంధానించి ఉంటాయి. అచిర కాలంలోనే ఇవన్నీ అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ రంగంలో రైతులు స్వయం సమృద్ధమయ్యే విధంగా, మహిళలు సాధికార శక్తులుగా మారే విధంగా, నడి వయసు దాటిన మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్య్రాన్ని అను భవించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న– మధ్య శ్రేణి పరిశ్రమలను (ఎంఎస్ఎమ్ఇ) కోవిడ్ ఉత్పాతా న్నించి రక్షించి గట్టెక్కించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిల బడింది. ముప్పయ్ లక్షలమంది ఆడపడుచులకు సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం ఒక బృహత్యజ్ఞం మాదిరిగా ప్రారంభమైంది. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే అక్కడ మౌలిక వసతులు ఏర్పాటై గృహప్రవేశాలు జరిగితే ఒక్కొక్క ఇంటి విలువ అధమపక్షం పది లక్షలవుతుంది. అంబానీ, అదానీల ఆస్తుల లెక్క కంటే ఆసక్తికరమైన లెక్క ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన రాష్ట్రంలోని నిరుపేద మహిళలకిచ్చిన ఆడపడుచు లాంఛనం విలువ మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు కాబోతున్నది. అప్పులుచేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ఎల్లో మీడియా చేస్తున్న యాగీకి క్షేత్రస్థాయి పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజల ఆస్తుల విలువ పెరుగుతున్నది. ప్రజలకు నాణ్యమైన విద్య–వైద్య సౌకర్యాలు అందుతున్నాయి. రైతుకు భరోసా దొరుకుతున్నది. మహిళలకు చేయూత లభిస్తున్నది. ఔను అప్పు చేస్తున్నారు. ఔను అప్పు చేస్తున్నానని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ఏ రాష్ట్రమూ, కేంద్రమూ కూడా అప్పు చేయకుండా ఉండగలిగిన పరిస్థితి లేదు. కోవిడ్ కార ణంగా 2020–21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన పన్నుల వాటా 8 వేల కోట్లు తగ్గింది. సొంత పన్నుల రాబడి మరో 7 వేల కోట్లు తగ్గింది. కోవిడ్ నియంత్రణ పేరుతో 8 వేల కోట్ల అదనపు ఖర్చు తోడయ్యింది. 23 వేల కోట్ల అదనపు భారం ఒక్క సంవత్సరంలో. ఇటువంటి భారాన్ని అన్ని రాష్ట్రాలూ, అన్ని దేశాలూ ఎదుర్కోవలసి వస్తున్నది. ఇదొక విపత్తు. ఈ విపత్తులో ప్రజల పక్షాన నిలబడి వారిని నిల బెట్టాలా లేక ప్రజా సంక్షేమానికి హాలిడే ప్రకటించి ప్రభుత్వా ధినేతలు వారి సొంత పనులు చూసుకోవాలా? ఎల్లో మీడియా స్పష్టం చేయాలి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భవితకు సంకేతం..‘బిహార్’!
బీజేపీ అనుకున్నదే జరిగింది. కాబట్టి మహాదళితుడు సీఎంగా కొనసాగడానికి తీవ్రంగా కృషి చేిసిన పార్టీ ఇమేజ్ శాసనసభ ఎన్నికల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందని అది భావిస్తుండ వచ్చు. కానీ కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌తో అదేమి సాధించిందో తేలాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేపటి బిహార్ ఎన్నికల్లో మోదీ ఆవిష్కరిస్తున్న కార్పొరేట్ కలల ప్రపంచం ఒక వైపు, నితీశ్ ఆచరణ సాధ్యం చేసి చూపిన కామన్ మేన్ కోరుకునే మెరుగైన ప్రపంచం మరోవైపు మోహరించనున్నాయి. ఈ యుద్ధంలో విజేత ఎవరో వేచి చూద్దాం. రసవత్తరంగా సాగిన బిహార్ రాజకీయ నాటకంలో బీజేపీ చివరికి విదూషక పాత్రలో నిలిచిందనడం వాస్తవం కాదు. ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ శాసనసభ బల పరీక్షలో గెలవలేడని బీజేపి నాయకత్వానికి ముందు నుంచే తెలుసు. ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్ వంటి వివాదాస్పద నేతల సహకారంతో జేడీయూ, ఆర్జేడీల నుంచి ఓ పాతిక, ముప్పయి మంది శాసనసభ్యులను కూడగట్టుకుంటే చాలు... తమ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని మాంఝీకి ఆశలను కల్పించినదే బీజేపీ. ఆ ‘వ్యాపార దక్షత’ మాంఝీకి లేదని దానికి ముందే తెలుసు. ఆ విషయం ఆయనకు కూడా చూచాయిగా అర్థం అవుతున్న సమయంలో బలపరీక్షలో మాంఝీకి మద్దతునిస్తామని ప్రకటించింది! మాంఝీ మీద బీజేపీ ఒలకబోసిన ఈ ప్రేమకంతటికీ కారణం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మహా దళిత వర్గాలను బుట్టలో వేయాలన్న కాంక్ష. అందుకోసమే బీజేపీ గత ఎనిమిది మాసాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ నాటకాన్ని నడిపించింది. ఇందులో జీతన్‌రామ్ మాంఝీ స్క్రిప్టు ఏమిటో తెలియని పాత్రధారి. విలువలకు కట్టుబడే నేతగా నితీశ్‌కుమార్‌కు మంచి పేరుంది. బిహార్‌లో లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడటానికి ఆయన బీజేనీతో కలిసి పనిచేసినా, తన లౌకికవాద స్వభావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. గోధ్రా అల్లర్ల ఆరోపణలను ఎదుర్కొన్న నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి నాయకునిగా ఉండి కూడా 2005, 2010 బిహార్ ఎన్నికల్లో మోదీ ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రచారసారథిగా మోదీని నియమించిన వెంటనే నితీశ్ నాయకత్వంలోని జేడీయూ పార్టీ ఆ కూటమి నుంచి వైదొలగింది. తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగి పరాజయం పాలైంది. నైతిక బాధ్యతను స్వీకరిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి నితీశ్ తప్పుకున్నారు. కానీ ఇక్కడే ఆయన కొంత చాణక్యాన్ని ప్రదర్శించాలని చూశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో బిహార్ గణనీయంగానే వృద్ధి చెందింది. అయినా అది ఒక్కటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సరిపోదని, రాజకీయాల్లో సామాజిక వర్గాల పునరేకీకరణ జరగాలని నితీశ్ గ్రహించారు. కాబట్టే మహా దళిత వర్గాల నేత మాంఝీని తన స్థానంలో కూర్చోబెట్టారు. దళితుల్లో బాగా వెనుకబడిన వారిని మహాదళితులని పిలుస్తారు. మాంఝీ బాగా వెనుకబడిన ముశాహర్ అనే దళిత కులానికి చెందిన వ్యక్తి. ముప్ఫయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజానికి మహాదళిత వర్గాల్లో నితీశ్‌కు మంచి పేరే వుంది. మహాదళితులనే ప్రత్యేక విభజన చేసి ఆయన వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పించారు. ‘ముఖ్యమంత్రి ప్యాకేజీ’తో మహా దళితుల ఓట్లన్నీ తన ఖాతాలోకే చేరిపోతాయని నితీశ్ భావించారు. లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, జేడీయూలు కలిసి పాత జనతా పరివార్‌ను పునరుద్ధరించాయి. కాబట్టి వెనుకబడిన వర్గాలన్నీ తమ వెంటే ఉంటాయని నితీశ్ భావన. బిహార్ బీసీల్లో బలమైన వర్గాలు యాదవులు, కుర్మీలు. యాదవ నేతగా లాలూప్రసాద్ జాతీయ స్థాయిలో పేరుగాంచారు. ఇక నితీశ్ తిరుగులేని కుర్మీ నాయకుడు. బాగా వెనుకబడిన వర్గాలు (ఎం.బీ.సీ.లు) తన వెంట నిలిచేలా ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ వ్యతిరేక మైనారిటీలు ఎలలగూ తమ వెంటే వస్తారని భావించారు. బీసీలు, మైనారిటీలు, మహాదళితులతో కూడిన తమ కూటమి అజేయశక్తిగా నిలబడుతుంది. ఇదీ జనతా పరివార్ ఆలోచన. సంఘ్ పరివార్ చూస్తూ కూర్చుంటుందా? లాలూ, నితీశ్‌లు పసిగట్టకుండానే తన తెరచాటు ఆట మొదలు పెట్టింది. బిహార్‌లో అగ్ర కులాలుగా పరిగణించే రాజపుత్రులు (ఠాకూర్లు), భూమిహార్లు, బ్రాహ్మణులు, కాయస్తులు తదితరులు అత్యంత సంపన్నులు, సమాజంలోని అత్యంత పలుకుబడిగల వర్గాలు కూడా. ఇటీవలి కాలంలో ఈ వర్గాలన్నీ బీజేపీకి బాసటగా నిలబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అదే జరిగింది. విద్యావంతులైన పట్టణ బీసీలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. రామ్‌విలాస్ పాస్వాన్తో పొత్తు వల్ల ఒక వర్గం దళితుల మద్దతు కూడా దానికి ఉంది. మహా దళితులు కూడా వీరికి తోడైతే...? జనతా పరివార్ జోరుకు రివర్స్‌గేర్ పడటం ఖాయం. సంఘ్ పరివార్ వేగంగా పావులు కదిపింది. ముఖ్యమంత్రి మాంఝీ కుమారునితో బీజేపి నేతల స్నేహం ప్రారంభమైంది. మాంఝీ ప్రైవేట్ సంభాషణల్లో నితీశ్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడం మొదలైంది. మరికొంత కాలానికే మాంఝీ కుమారుడు అధికారికంగానే బీజేపీలో చేరిపోయారు. మాంఝీ కూడా బహిరంగంగానే నితీశ్‌ను, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించడం మొదలైంది. శాసనసభ ఎన్నికల తర్వాత కూడా మాంఝీనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని అమిత్‌షా నుంచి స్పష్టమైన హామీ లభించిందనీ చెబుతారు. మాంఝీ ఆశల సౌధాలు కూలినా బీజేపీ అనుకున్నది జరిగింది. మహా దళితుడు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా, జనతా పరివార్ వల్లనే ఫలించలేదనేది వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రచారాస్త్రం కానున్నదని బీజేపీ భావిస్తుండవచ్చు. అయితే దేశవ్యాప్తంగా పట్టణ మధ్యతరగతి, విద్యావంతులంతా కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌గా భావించే ఎత్తుగడలతో బిహార్‌లో బీజేపీ ఏమి సాధించిందో లెక్కలు తేలాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. తాజా పరిణామాల నేపథ్యంలో కొంత ముందుకు జరిగినా ఆశ్చర్యం లేదు. దేశ జనాభాలో పాతికేళ్ళలోపు వయసున్నవారి సంఖ్య 50 శాతానికి కాస్త అటూ ఇటూ. కానీ బిహార్ జనాభాలో పాతికేళ్లలోపువారు 58 శాతం. దేశంలోనే నవయవ్వన రాష్ట్రం బిహార్. అందుకే బిహార్ ప్రజాతీర్పు భావి రాజకీయాలకు దోవ చూపే తీర్పు కాబోతోంది. దేశ చరిత్రలో బిహార్‌ది అగ్రశ్రేణి పాత్ర. దేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్య స్థాపన జరిగినది ఈ ప్రాంతంలోనే. సుమారు వెయ్యేళ్ల దేశ చరిత్రను ఈ ప్రాంతమే శాసించింది. స్వాతంత్య్ర పోరాటంలోనూ బిహార్‌ది ప్రముఖ పాత్ర. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ (ప్రస్తుతం జార్ఖండ్‌గా వేరుపడిన ప్రాంతం) పరిశ్రమలు ఏర్పడ్డాయి. కానీ, స్వాతంత్య్రానంతరం బిహార్ వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరింది. బిహార్ రాజకీయాలను స్థూలంగా మూడు దశలుగా విభజించవచ్చు. రెండు అల్పాయుష్క ప్రభుత్వాలను (1967, 1977) మినహాయిస్తే తొలిదశలోని మిగతా కాలమంతా కాంగ్రెస్ పాలనే సాగింది. జమీందారీ వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. భూసంస్కరణల చట్టాన్ని నామమాత్రంగానైనా అక్కడ అమలు చేయలేదు. ఫలితంగా వందలు, వేల ఎకరాల భూములు అగ్రవర్ణ భూస్వాముల చేతుల్లోనే మిగిలిపోయాయి. ఈ భూస్వామ్య వ్యవస్థ దళితులు, గిరిజనులు, ఇతర పేద వర్గాలమీద దారుణమైన అణచివేతకు పాల్పడింది. పేదవర్గాలకు అండగా తొలిదశలో కమ్యూనిస్టులు, మలిదశలో నక్సలైట్లు నిలబడ్డారు. నక్సలైట్లను సాయుధంగా ఎదుర్కోవడం కోసం అగ్రవర్ణ భూస్వాములు సాయుధ కుల సేనలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుల సేనలు, నక్సలైట్లు కలసి గ్రామీణ బిహార్‌లో సృష్టించిన మారణ హోమం దేశ చరిత్రలోనే ఒక చీకటి ఘట్టం. గంగానది, దాని ఉపనదులతో అత్యంత సారవంతమైన భూములున్న బిహార్ నిజానికి దేశ హరిత విప్లవానికి మార్గదర్శి కావాల్సింది. ఫ్యూడల్ వ్యవస్థ కారణంగా వ్యవసాయ రంగంలో కూడా అది సంపదను సృష్టించలేకపోయింది. రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితులైన తొలితరం చదువుకున్న బీసీ నేతలు సోషలిస్టు పార్టీ వెనుక సమీకృతమయ్యారు. నాయీ(క్షురక) కులస్తుడైన కర్పూరీ ఠాకూర్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ రెండు సార్లు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించింది. అయితే ఆ ప్రభుత్వాలు పూర్తి కాలం మనలేకపోయాయి. లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్లూ, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ తదితరులు ఆ కాలంలో విద్యార్థి నేతలుగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. బిహార్‌లో స్థానిక వైశ్యులను బీసీలుగా పరిగణిస్తారు. వలస వచ్చిన అగర్వాల్ వంటి వైశ్యులే అగ్రవర్ణాల కింద లెక్క. ఆ విధంగా స్థానిక వైశ్యుడైన సుశీల్‌కుమార్ మోదీ కూడా బీసీగా చలామణి అయ్యారు. ఈ ముగ్గురూ బీసీ రాజకీయ ఎజెండాతోనే రాజకీయంగా నిలదొక్కుకున్నారు. 1990లో లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడటం బిహార్ రాజకీయాల్లో రెండోదశ. నితీశ్‌కుమార్ అప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 1995లో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం లాలూను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పరిపాలనలో లూలూ కుటుంబ జోక్యం పెరిగింది. దీంతో లాలూ, నితీశ్‌ల మధ్య దూరం పెరిగింది. జనతాదళ్ రెండుగా చీలిపోయింది. లాలూ కుటుంబ నేతృత్వంలో సాగిన పదిహేనేళ్ల రెండోదశ పాలన కూడా అరాచక పాలనగానే మిగిలిపోయింది. నిమ్నవర్గాల వారికి చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయడం, కీలక పదవులను కట్టబెట్టడం మినహా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాల కల్పన లేదు. విద్యా, వైద్య రంగాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరింది. ఈ కాలంలో వంద కిలోమీటర్ల దూరం కారులో వెళ్లాలంటే నాలుగున్నర గంటలు పట్టేదట. రోడ్ల నిర్వహణ పరిస్థితి అది. ఈ దశలో లక్షలాది మంది బిహారీలు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయారు. అలా వలస వెళ్లినవారు ఆ రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంపదల గురించి కథలు కథలుగా స్వరాష్ట్రానికి చేరవేశారు. దీంతో బిహార్ ప్రజల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. దాని ఫలితమే 2005లో నితీశ్ నేతృత్వంలో ఏర్పడిన జేడీయూ-బీజేపీ ప్రభుత్వం. నితీశ్ పాలనా కాలం బిహార్ రాజకీయాల్లో మూడోదశ. ఈ దశలో వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన వారికి (ఎంబీసీలు), దళితులలో మరింత పేదలకు (మహాదళితులు) ప్రత్యేక గుర్తింపును, అవకాశాలు కల్పించి నితీశ్ సామాజిక న్యాయం పాటించారు. అదే సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. నితీశ్ హయాంలో బిహార్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరుగులు తీసింది. శాంతి భద్రతలు మెరుగయ్యాయి. రోడ్లు చక్కబడ్డాయి. విద్య, వైద్య సంస్థల నిర్వహణ మెరుగుపడింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. చాలా ఏళ్ల తర్వాత బిహార్ సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడింది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తదుపరి వేగంగా మారుతున్న కొత్త రాజకీయ సమీకరణల నేపథ్యంలో నేడు బిహార్ మరో కొత్త దశలోకి అడుగుపెట్టనుంది. నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న కార్పొరేట్ కలల ప్రపంచం ఒక వైపు, నితీశ్‌కుమార్ ఆచరణ సాధ్యం చేసి చూపిన కామన్ మేన్ కోరుకునే మెరుగైన ప్రపంచం మరోవైపు మోహరించబోతున్నాయి. చరిత్రలో ఎన్నో మహాసంగ్రామాలను చూసిన బిహార్ ఎన్నికల యుద్ధంలో విజేత ఎవరో వేచి చూద్దాం. muralivardelli@yahoo.co.in - వర్ధెల్లి మురళి -
చిట్కా బాబా... చీప్ లేబర్
ఆంధ్రప్రదేశ్ ‘అద్భుత’ రాజధానిలోని అవకాశాల ఎండమావులను నమ్ముకోలేని విద్యావంతులు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోతూనే ఉన్నారు. అయినా గానీ రేపు ప్రజలంతా విరివిగా కనబోయే సంతానానికి ఉద్యోగాలు సిద్ధం చేసేస్తానని చంద్రబాబు అంటున్నారు. మెకెన్సీ నివేదికను తెగ సాగలాగి, జనాభా పెరిగితే వేతనాలు పడిపోతాయనే సూత్రాన్ని సమయం సందర్భం లేకుండా కలవరిస్తున్నారు. జనాభా పెరిగిపోతే చాలు.. కారు చౌక శ్రమకు ఏపీనే కేంద్రమని మెకెన్సీ మెచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుందని కలల్లో తేలిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారం రోజుల క్రితం ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు. రాజధాని మనీలాలో అరవై లక్షలమంది హాజరైన రికార్డు స్థాయి బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం రోమ్కు తిరుగు ప్రయాణంలో విమానంలోనే మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో జనాభా ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘కృత్రిమ పద్ధతుల ద్వారా సంతాన నిరోధాన్ని చర్చి నిషేధించిన మాట నిజమే. దానర్థం ఇబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనేసి జనాభాను పెంచేయమని మాత్రం కాదు. తల్లిదండ్రులకు పిల్లలపట్ల, వారి అభ్యున్నతిపట్ల బాధ్యత కూడా ఉండాలి’’ అని పోప్ అన్నారు. ఆయన స్వరంలో సంస్కరణ ధ్వనించింది. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల పట్ల ఆపేక్షే ఆ సంస్కరణకు ప్రేరణ. హిందువులందరూ నలుగురైదుగురు పిల్లల్ని కనాలని కొంతకాలంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు సాక్షి మహారాజ్ ప్రబోధిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని ఆ పార్టీ అధికారికంగా అంగీకరించకపోయినా, ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న ఓ వర్గం ఆలోచనకు సాక్షి మహారాజ్ ప్రతిరూపం. హిందూ ఆధిపత్య ఆకాంక్షే ఆ ఆలోచనకు మూలం. పోప్ ఫ్రాన్సిస్ మీడియాతో మాట్లాడిన రోజే, సరిగ్గా అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ర్టంలో సంతానోత్పత్తి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వాళ్లు పిల్లల్ని కనడం మానేశారు. ముసలివాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇలా అయితే అభివృద్ధి సాధించలేం. ప్రజలందరూ బాగా పిల్లల్ని కనాలి, వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించే పూచీ నాదీ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుకు లోకేశ్ ఒక్కడే సంతానం. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని ఆయన ఒకప్పుడు నమ్మారు. హఠాత్తుగా ఆయన వైఖరి ఇప్పుడు ఎందుకు మారింది? నేటి ప్రపంచ పెట్టుబడిదారీ ఎజెండాయే ఈ మార్పునకు కారణం. ఈ మధ్యకాలంలో ఆర్థికంగా చైనా బాగా బలపడుతున్నది. ఎంతగా నంటే ప్రపంచ పెట్టుబడిదారీ దుర్గమైన అమెరికా కూడా భయపడేంతగా. చైనా ఆర్థికవ్యవస్థ బలం పుంజుకోవడం వెనుక ఉన్న ‘రహస్యం’... వస్తూ త్పత్తి రంగం. ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా చైనా అవతరించడం. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వస్తూత్పత్తి రంగం వాటా 44 శాతం. కాగా భారత జీడీపీలో వస్తూత్పత్తి రంగం వాటా 16 శాతానికి పరిమిత మైంది. వస్తూత్పత్తి రంగానికి కేంద్రంగా చైనా అవతరించడం వెనుక అమె రికా తదితర పశ్చిమ దేశాల ప్రమేయం ఉంది. 1980 కంటే పూర్వం భారత్ కంటే చైనా జీడీపీ తక్కువ. కానీ ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత రెండో అతి పెద్ద జీడీపీ గల దేశంగా అవతరించింది. భారత్ పదోస్థానంలో, చైనా జీడీపీలో దాదాపు ఐదో వంతుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘గోల్డ్‌మెన్ సాచిస్’ పెట్టుబడుల బ్యాంకు 2016 నాటికి భారత జీడీపీ వృద్ధి రేటు చైనాను మించిపోతుందని గత నెలలో జోస్యం చెప్పింది. అది 2019 నాటికి మాత్రమే జరుగుతుందని ‘ఫోర్బ్స్’ పత్రిక అంటోంది. త్వరలోనే భారత్ ప్రపంచ జీడీపీలో అగ్రస్థానానికి చేరిపోతోందని కూడా అంటున్నారు. అంటే ఏదో అద్భుతం జరుగబోతోంది. ఆ ‘‘అద్భుతానికి’’ చంద్రబాబు నాయుడు జనాభాను పెంచాలని అందుకున్న కొత్త పాటకు సంబంధం ఉండటం మరిం త అద్భుతం! అది... అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తిగా చైనా మారడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారీ ఎజెండాలో వచ్చిన మార్పు మహిమ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ దేశాలు శరవే గంగా సామాజిక, ఆర్థిక మార్పులకు లోనయ్యాయి. కార్మికవర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. వారి జీతాలు పెరిగాయి. ఫలితంగా ఆ దేశాల వినిమయ వస్తువుల డిమాండు వేగంగా పెరిగింది. ఆ అవసరాలను చౌకగా తీర్చగలిగేలా కారు చౌకకు శ్రామిక సేవలను అందించి, వినిమయ వస్తువుల ఉత్పత్తికి ఉపయోగపడే స్థావరంగా వారికి చైనా కనబడింది. చైనాలోని నియంత్రిత పాలనా వ్యవస్థ (లేదా నియంతృత్వ పాలన) అమలులో ఉంది. ప్రజలు ఏ పని చేయాలి? ఏం చదవాలి? ఏం ఆలోచించాలి? వంటి విషయా లను కూడా ప్రభుత్వమే నిర్దేశించే రెగ్యులేటెడ్ ‘కమ్యూనిస్టు’ పాలన సాగు తోంది. అది వస్తూత్పత్తి రంగం వేగంగా విస్తరించడానికి కలిసొచ్చింది. మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు చైనాకు క్యూ కట్టాయి. ‘మేడ్ ఇన్ చైనా’ చౌక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తాయి. చైనా ప్రపంచ మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా మారింది. ఈ క్రమంలో గడచిన మూడు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ బలపడింది. జీవన ప్రమాణాలు పెరిగి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి జనాభా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ రెండేళ్లక్రితం ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ రంగంపై ఒక నివేదికను ప్రచురించింది. అం దులో అది రెండు సూత్రీకరణలు చేసింది. ఒకటి, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఇక చైనా ఎంత మాత్రమూ పనికిరాదు. అక్కడ ఇప్పుడు చౌకగా శ్రమశక్తి లభించే పరిస్థితులు లేవు. మరో నాలుగైదేళ్లలో పట్టణ జనాభాలో సగం ఎగువ మధ్యతరగతి శ్రేణిలో చేరిపోతారు. చైనా ఇక చౌక వస్తువుల తయారీ దారుగా పనికిరాదు. ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసిందే. అందుకు సరైన ప్రత్యామ్నాయం భారత్ అనేది రెండవ సూత్రీకరణ. అయితే, భారత్‌లో కొన్ని పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యతను సులభతరం చేయాలి. తక్కువ వేతనానికి, ఎక్కువ సమయం పనిచేయడానికి వీలుగా, ఉద్యోగ భద్రతలేని ‘హైర్ అండ్ ఫైర్’ పద్థతికి అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించాలి. మౌలిక వసతుల రంగం బాగా అభివృద్ధి చెందాలి. వేగవంతమైన రవాణాకు పెద్దపెద్ద రహ దారులు, ఎగుమతుల కోసం పెద్ద సంఖ్యలో పోర్టులు నిర్మించాలి. ప్రస్తుతం మన ఓడ రేవుల్లో లోడింగ్కైనా, అన్ లోడింగ్కైనా నాలుగైదు రోజులు పడు తున్నది. హాంకాంగ్‌లో ఆ పని పది పన్నెండు గంటల్లో పూర్తవుతుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దితే ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను మించిన ప్రత్యామ్నాయం లేదన్నది మెకెన్సీ నివేదిక సారాంశం. అమెరికా నేతృత్వంలోని ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, ప్రపంచ బ్యాంకు వగైరా ఏజెన్సీలు దానిని ఆమోదించాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందుగానే అవి రంగంలోకి దిగి తమ ఎజెండాను అమలు చేయగల టీమ్‌ను ఎంపిక చేసుకున్నాయి. మెకెన్సీ నివేదిక చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం కూడా ప్రారంభమైంది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ ఈ దిశలో వేసిన పెద్ద ముందడుగు. కార్మిక చట్టాల సవరణకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అన్నిటినీ మించి అధికారంలోకి వచ్చీరాగానే మోదీ ఇచ్చిన ‘మేకిన్ ఇండియా’ నినాదంలోనే ఆ పరమార్థం దాగి ఉంది. ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు కావాల్సిన అన్ని సేవలనూ, సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, వచ్చేయండి అనే పిలుపు అది. మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపును వస్తూత్పత్తి రంగానికి ఉద్దే శిస్తే, చంద్రబాబు దానిని సంతానోత్పత్తి రంగం దాకా సాగదీశారు. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ముద్దుల శిష్యుడు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన అనంతరం ప్రపంచ బ్యాంకు సాగించిన తొలి దండయాత్రలో ఉత్తమ ఏజెంట్‌గా మన్నన పొందిన వ్యక్తి. ఆ దండయాత్ర మలి దశలో మోదీ నీడన మరుగున పడిపోవడం ఆయనకు మనస్కరించడంలేదు. అందుకే ప్రపంచ బ్యాంకు ఎజెండా అమలులో ‘ఉగ్రవాద’ వైఖరి చేపట్టి మరీ తన ఉని కిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మూడు పంటలు పండే మాగాణి పొలాల నుంచి సైతం రైతులను బేదఖల్ చేసి, తన ప్రత్యేక శైలిని చాటాలనుకుంటున్నారు. మెకెన్సీ నివేదికను శిరసావహించి కోస్తా తీరం పొడుగునా పన్నెండు ఓడ రేవులను ఇప్పటికే ప్రకటించేశారు. ఉపాధి హామీనీ అమలుచేయడం దాదాపుగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం చాపచుట్టేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విధానాల ద్వారా శ్రామికులు అధిక వేతనం కోసం బేరమాడే శక్తిని కోల్పోతారని వీరి అంచనా. దీనికి కొనసాగింపే చంద్రబాబు అధిక సంతానంతోనే అభివృద్ధి అనే పిలుపు. తప్పుల తడక నివేదికల సంస్థ మెకెన్సీని తలదన్నేలా చంద్రబాబు వాస్తవ దూరమైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. ఆయన చెబుతు న్నట్టు రాష్ట్ర జనాభాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఏం లేదు. 60 ఏళ్లు పైబ డిన వారి సంఖ్య జనాభాలో 8 శాతం మాత్రమే. అక్షరాస్యత ఇంకా 67 శాతం దాట లేదు. పేదలకే కాదు మధ్యతరగతికి కూడా కాలేజీ చదువులు అందు బాటులో లేకుండా పోతున్నాయి. ఎదగాల్సిన బాలలకు అర్ధాకలి, పౌష్టికా హార లోపం తప్పడం లేదు. ఇప్పుడున్న శ్రామిక జనాభాలో అందరికీ పనులు లేవు. అభినవ ఆంధ్రప్రదేశ్ ‘అద్భుత’ రాజధానిలో పుట్టుకురానున్న అవకా శాల ఎండమావులను నమ్ముకోలేని విద్యావంతులు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోతూనే ఉన్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా నన్నట్టు రేపు ప్రజలంతా విరివిగా కనబోయే సంతానం పెరిగి పెద్దయ్యేసరికి ఉద్యోగాలు సిద్ధం చేసి ఉంచేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థితిలో జనాభా వృద్ధి రేటు ఇంకా తగ్గాలని ఆర్థిక, సామాజిక వేత్తలు అంతా అంటుం డగా చంద్రబాబునాయుడు మెకెన్సీ నివేదికను తెగ సాగలాగి, జనాభా పెరిగితే శ్రమశక్తి ధర లేదా వేతనాలు పడిపోతాయనే ఆర్థిక సూత్రాన్ని సమ యం సందర్భం లేకుండా కలవరిస్తున్నారు. రాష్ట్ర జనాభా పెరిగిపోతే చాలు.. ప్రపంచంలోనే కారు చౌక శ్రమకు ఏపీనే కేంద్రమని మెకెన్సీ కన్సల్టెన్సీ మెచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుందని కలల్లో తేలిపోతున్నారు. muralivardelli@yahoo.co.in - వర్ధెల్లి మురళి -
ఇది గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం!
మంత్రివర్గంలో బలహీన వర్గాల వాటా 1972లో ఏర్పడ్డ పీవీ ప్రభుత్వంలో ఒక లాంగ్ జంప్ చేసి, 40 శాతానికి పెరిగింది. ఇప్పటికీ అదే బెంచ్‌మార్క్‌గా నిలచిపోయింది. ఒకటి, రెండు శాతం అటూ ఇటుగా అదే నిష్పత్తి నేటికీ కొనసాగుతున్నది. ఈ ప్రతిష్టంభన తొలగి సమాజం లోని అన్ని వర్గాల వారికీ రాజకీయాధికారంలో న్యాయమైన వాటా రావాలంటే 1971 నాటి ఇందిరా ప్రభంజనం లాంటి రాజకీయ పెను ఉప్పెనైనా రావాలి లేదా బలహీన వర్గాల, మహిళల మహోద్యమం ఏదైనా సాగాలి. లేదా రాజకీయ నాయకత్వాలే చిత్తశుద్ధితో సామాజిక న్యాయం, హేతుబద్ధ ప్రజాస్వామ్యాల కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలి. ఈ వారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మంత్రుల సంఖ్య 18కి చేరింది. ఇది గరిష్ట స్థాయి. ఇంతకన్నా పెంచడానికి అవకాశం లేదు. దీంతో సహజంగానే మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం ఉందా, లేదా? అనే అంశంపై విశ్లేషణలు మొదలయ్యాయి. మన దేశంలో గడచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల ముందు టికెట్ల పంపిణీ సందర్భంగానూ, ఆ తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలోనూ ఈ తరహా విశ్లేషణలూ, వాటి ఆధారంగా విమర్శలూ సర్వసాధారణంగా మారాయి. ఆ సంప్రదాయం ప్రకారమే తాజాగా తెలంగాణ మంత్రివర్గ కూర్పుపైనా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం మంది బలహీన వర్గాల ప్రజలని అంచనా. వెనుకబడిన తరగతులు(బీసీలు), దళితులు, గిరిజనులు, మైనారి టీలు ఈ వర్గీకరణ కిందకు వస్తారు. వీరందరికీ కలిపి ఏడు మంత్రి పదవులు దక్కాయి. వ్యవసాయరంగం నుంచి అభివృద్ధి చెందిన అగ్ర కులాల వారికి మిగిలిన పదకొండు పదవులూ దక్కాయి. వీరిలో అత్యధిక జనాభాగా (మొత్తం జనాభాలో ఏడు శాతం) ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు లభించాయి. సుమారు ఒక శాతం కంటే తక్కువ జనాభా ఉన్న పద్మనాయక వెలమలకు ముఖ్యమంత్రి పీఠం సహా నాలుగు పదవులు లభించాయి. దాదాపు అంతే సంఖ్యలో ఉండే కమ్మవారికి ఒక మంత్రి పదవి లభించింది. సుమారు ఆరు శతాబ్దాల తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పద్మనాయక వెలమల ప్రాభవం తిరిగి వెలుగుతోంది. కాకతీయ సామ్రాజ్య పతనానికి, కుతుబ్ షాహీల గోల్కొండ రాజ్య స్థాపనకు మధ్య సంధి కాలంలో వందేళ్లపాటు వెలమ వారు రాచకొండను రాజధానిగా చేసుకొని తెలంగాణను పాలించారు. ఇన్నాళ్లుగా మరుగునపడ్డ రాచకొండ కేసీఆర్ హయాంలో కళాకాంతులు దిద్దుకోబోతుండటం కేవలం కాకతాళీయమే. రాచకొండ వెలమ రాజుల్లో శ్రేష్ఠుడైన సర్వజ్ఞ సింగభూపాలుని హయాంలో తెలుగు సాహిత్యం వైభవాన్ని చవిచూసింది. కొండవీడు రెడ్డి రాజుల ఆస్థానంలోని శ్రీనాథ మహాకవిని రాచకొండకు రప్పించి సత్కరించిన కాలమది. తెలంగాణ సాహితీ మాగాణాల్లో బమ్మెర పోతన మధుర కవితలు విరగబూసిన కాలం కూడా అదే. నాటి సింగ భూపాలుని వలెనే నేటి కేసీఆర్ కూడా కవి, పండిత మిత్రుడు కావడం ఇంకో కాకతాళీయ ఘటన. నలభై శాతం లక్ష్మణరేఖా? ప్రస్తుత మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే, ఎనభై ఐదు శాతం జనాభాగా ఉన్న సామాజిక వర్గాలకు 38 శాతం మంత్రి పదవులే లభించడం అవాంఛనీయ పరిణామం అనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనదో, ఈ ఒక్క సందర్భానికి పరిమితమైనదో కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న బిహార్, యూపీ, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలను మినహాయిస్తే కుడి, ఎడమగా దేశమంతటా ఇదే పరిస్థితి. రాష్ర్టం విడిపోయిన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పరిస్థితి కూడా ఇందుకు భిన్నం గాలేదు. నిజానికి ఇంకా ఘోరంగా ఉంది. ముఖ్యమంత్రిసహా మొత్తం ఇరవై మంది మంత్రుల్లో ఎనిమిది మంది బలహీనవర్గాల వర్గీకరణ కిందికి వస్తారు. అలా చూస్తే మంత్రివర్గంలో వారి వాటా 40 శాతం ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ వెనుకబాటుతనం కారణంగా అక్కడి ఆధి పత్య కులాలు కూడా బీసీ కోటాలోకే వస్తాయి. ముగ్గురు బీసీలు ఆ ప్రాంతం వారే ఉన్నారు. ఆ జిల్లాలను మినహాయిస్తే అసలు సంగతి తెలుస్తుంది. పెపైచ్చు ఒక్క గిరిజనుడికి కానీ, మైనారిటీ వ్యక్తికి కానీ ఏపీ కేబినెట్లో చోటు దొరకలేదు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాలలోని సామాజిక కూర్పులను ఒకసారి పరిశీలిద్దాం. 1956లో రాష్ట్రం అవతరించినప్పుడు ఏర్ప డిన మంత్రివర్గంలో బలహీనవర్గాల నిష్పత్తి పదిహేను శాతంగా ఉండేది. ఒకే ఒక్క బీసీ... అనగాని భగవంతరావు(గుంటూరుజిల్లా)కు మంత్రి పదవి దక్కింది. 1960లో ఏర్పడిన సంజీవయ్య మంత్రివర్గంలో కూడా బలహీన వర్గాల వాటా దాదాపు అంతే శాతం. ఈసారి మంత్రివర్గంలోని ఒకే ఒక్క బీసీగా.. కొండా లక్ష్మణ్ బాపూజీ (తెలంగాణ)కి బెర్త్ దక్కింది. 1967లో మొత్తంగా బలహీన వర్గాల కోటా 25 శాతానికి పెరిగింది. 1972లో మాత్రమే ఈ విషయంలో ఒక లాంగ్‌జంప్ కనబడింది. పీవీ నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గంలో బలహీనవర్గాల వాటా 40 శాతానికి పెరిగింది. ఆ ఘనత పీవీదే అయినా, నాటి ప్రధాని ఇందిరాగాంధీ బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పునాదిగా మలచుకుంటున్న నేపథ్యంలోనే అది సాధ్యమైందని విస్మరించలేం. ఇప్పటికీ అదే బెంచ్‌మార్క్‌గా నిలచిపోయింది. ఒకటి, రెండు శాతం అటూ ఇటుగా అదే నిష్పత్తి నేటికీ కొనసాగుతున్నది. బలహీన వర్గాల వారికి కూడా కొన్ని కీలక శాఖలను కేటాయించడం ఎన్టీ రామారావుతో మొదలైంది. శేష ప్రశ్నలేనా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు, మెజారిటీ రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఇటువంటి వాతావరణమే కొనసాగుతోంది. ఇరవై శాతంలోపు ఉన్న అగ్రకులాల ఆధిపత్యంలోనే రాజకీయాధికారం కేంద్రీకృతమై ఉందని బలహీన వర్గాల నే తలు ఆరోపిస్తున్నారు. సామాజిక వేత్తలూ, రాజకీయ పరిశీలకులూ ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కానీ పరిస్థితిని మరింత నిశితంగా పరిశీలిస్తే, అంతకన్నా తీవ్రస్థాయిలోనే రాజకీయ గుత్తాధిపత్యం కేంద్రీకృతమైన వైనాన్ని మనం గమనించగలం. అగ్రకులాలు, బలహీన కులాలు అనే తేడా లేకుండా మొత్తం సమాజంలో సగంగా ఉన్న మహిళలు రాజకీయ నిర్ణయాధికారానికి దూరంగా ఉన్నారు. చట్టసభల్లోని వారి ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంటోంది. అంటే అగ్రవర్ణాల్లోని సగం మంది ఈ గుత్తాధికారానికి దూరంగా ఉన్నట్టే లెక్క. అలాగే అగ్రవర్ణాలు, కులాలలోని పేదలు కూడా. ఎంత సచ్ఛీలురూ, సంఘసేవకులూ అయినప్పటికీ డబ్బు దండిగా లేకపోతే... అగ్రకులస్తులైనా ప్రధాన రాజకీయ పక్షాల నాయకత్వాలేవీ వారికి ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. కనుక అగ్రవర్ణాలు, కులాల్లోని పేద వర్గాలు కూడా రాజకీయ చక్రాన్ని తిప్పే పరిస్థితుల్లో లేరు. మిగిలిందల్లా నాలుగైదు శాతంగా ఉన్న సంపన్న వర్గాలు మాత్రమే. వీరిలో అతి స్వల్పంగా బలహీన వర్గాల వారు కూడా ఉండవచ్చు. అక్కడక్కడా మహిళలూ, అగ్రకులాల పేదలు కూడా కనిపించవచ్చు. అయినాగానీ మొత్తంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థపైన జనాభాలోని నాలుగైదు శాతం సంపన్న శ్రేణి గుత్తాధిపత్యం వహిస్తున్నమాట తిరుగులేని వాస్తవం. దేశ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారీ గుత్తాధిపత్యం నెలకొన్నట్టే, మన ప్రజాస్వామిక వ్యవస్థపైన కూడా గుత్తాధి పత్యం సాగుతోంది. మనదేశంలోని అత్యంత సంపన్న శ్రేణి పారిశ్రామిక, వ్యాపార రంగాలపై ప్రత్యక్ష గుత్తాధిపత్యం వహిస్తోంది, పరోక్షంగా రాజకీయాలను శాసిస్తోంది. కాగా, ఆ తదుపరి సంపన్న శ్రేణి ప్రత్యక్షంగా దేశాన్ని, రాష్ట్రాలను రాజకీయంగా పాలిస్తోంది, పరోక్షంగా పారిశ్రామిక, వ్యాపార రంగాలను శాసిస్తోంది. ఇలా రెండు విధాలా పెనవేసుకుపోయిన గుత్తాధిపత్య ప్రజాస్వామ్యాన్ని వదిలించుకొని, కొంత హేతుబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకో లేమా? మహిళలకూ, పేదలకూ న్యాయమైన వాటా అందివ్వలేమా? ఎనభై శాతం జనాభావున్న బలహీనవర్గాల నిష్పత్తి నలభయ్యేళ్లుగా నలభై శాతం దగ్గరే నిలిచిపోవడమేమిటి? సమాజంలోని సగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో సమ ప్రాధాన్యం కాదు గదా, ఇస్తామంటూ ఆశ చూపుతున్న 33 శాతం రిజర్వేషన్లు శాశ్వత ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందెందుకు? గుత్తాధిపత్య ప్రజాస్వామ్యం ఉనికికి ప్రమాదమనే భయంతోనే కాదా? దళిత వర్గాల నుంచి ఎదిగిన నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా రిజర్వుడు నియోజకవర్గాలనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఎందుకున్నట్టు?... మన ప్రజాస్వా మ్యవ్యవస్థ తన చుట్టూ తాను తిరుగుతూనే, డబ్బు చుట్టూ తిరగడం ప్రారం భమైన ఈ ఆధునిక, ‘సంస్కరణల యుగం’లో రాజకీయ నాయకత్వానికి దూరదృష్టి, చిత్తశుద్ధి లేకపోతే ఈ ప్రశ్నలు ఎప్పటికీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మార్పు ఎన్నడు? స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో, నూటికి ఎనభై మంది ప్రజలు వ్యవ సాయరంగంపై ఆధారపడివున్న నేపథ్యంలో మన దేశంలో ఎన్నికల క్రతువు మొదలైంది. ఈ నేపథ్యం సహజంగానే వ్యవసాయాధిపత్య కులాలకు కలసి వచ్చింది. గ్రామాలపై తమకు ఉన్న పట్టు కారణంగా భూస్వామ్య, ధనిక రైతు వర్గాలవారు పెద్ద సంఖ్యలో చట్టసభలకు ఎన్నికై, అనతికాలంలోనే రాజకీయ ఆధిపత్యం కూడా సాధించగలిగారు. రాజకీయాధికారం దన్నుతో వీరిలో కొందరు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక కార్యక్రమాల అమలులో కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, క్రమంగా మరింత బలపడ్డారు. భూసంస్కరణల చట్టం తర్వాత పెద్ద ఎత్తున ఆ వర్గాలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి ప్రవేశిం చాయి. అభివృద్ధి రంగంలో ప్రభుత్వాల పెట్టుబడులు పెరిగే కొద్దీ కాంట్రాక్టర్ల రూపంలో అదే నిష్పత్తిలో బలపడుతూ వీరు ఒక సరికొత్త ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గంగా రూపాంతరం చెందారు. గత పాతికేళ్లుగా అమలవుతున్న ఆర్థిక సంస్క రణలు కూడా వీరికి బాగా కలసి వచ్చాయి. వీరి అండ లేనిదే రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాగించలేని పరిస్థితి నేడు ఏర్పడింది. రాజకీయ నాయక త్వానికి ఇష్టం ఉన్నా లేకున్నా టికెట్ల కేటాయింపులోనూ, మంత్రివర్గ కూర్పులోనూ వీరికి పెద్ద పీట వేయక తప్పని స్థితి ఏర్పడింది. ఈ కారణంగానే గత నలభయ్యేళ్లుగా మంత్రివర్గాల కూర్పులో బలహీన వర్గాల నిష్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా నలభై శాతం దగ్గరే ఆగిపోయింది. ఈ ప్రతిష్టంభన తొలగి సమాజంలోని అన్ని వర్గాల వారికీ రాజకీయాధికారంలో న్యాయమైన వాటా రావాలంటే 1971 నాటి ఇందిరా ప్రభంజనం లాంటి రాజకీయ పెను ఉప్పెనైనా రావాలి లేదా బలహీన వర్గాల, మహిళల మహోద్యమం ఏదైనా సాగాలి. ఈ రెండు ‘దైవాధీనాలే’ కనుక రాజకీయ నాయకత్వాలే కొంత చిత్తశుద్ధితో సామాజిక న్యాయం కోసం, హేతుబద్ధమైన ప్రజాస్వామ్యం కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయవలసి ఉంటుంది. మహిళలకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలుజరుగుతున్న స్థానిక సంస్థలను బలోపేతం చేయ డం ఇందులో ప్రధానమైనది. వీటిని ఆర్థికంగా పరిపుష్టం చేయడం ద్వారా, అధికారాలను బదలాయించడం ద్వారా అన్ని వర్గాల నుంచి క్రమక్రమంగా నాయకత్వ శ్రేణులు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల్సింది, ఫలితాలనివ్వాల్సింది స్థానిక స్థాయిలోనే. అందుకే వాటి రూప కల్పనలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులను పూర్తిగా రద్దు చేసి, స్థానిక సంస్థల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేలా చూడాలి. చిన్న స్థాయి కాంట్రాక్టు పనులన్నిటినీ స్థానిక ప్రజా సంఘాలకు రిజర్వు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలను ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుకునే అవకాశం ఉంటుంది. అయినా అధిగమించ గలిగే రాజకీయాధికార నేతే రాజనీతిజ్ఞుడు అనిపించుకుటాడు. లేకపోతే అంతా దైవాధీనమనుకొని, ‘సంభవామి యుగే యుగే’ అన్నట్టుగా ఆ ‘యుగపురుషుని’ కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. muralivardelli@yahoo.co.in - వర్ధెల్లి మురళి