
భవితకు సంకేతం..‘బిహార్’!
బీజేపీ అనుకున్నదే జరిగింది. కాబట్టి మహాదళితుడు సీఎంగా కొనసాగడానికి తీవ్రంగా కృషి చేిసిన పార్టీ ఇమేజ్ శాసనసభ ఎన్నికల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందని అది భావిస్తుండ వచ్చు.
బీజేపీ అనుకున్నదే జరిగింది. కాబట్టి మహాదళితుడు సీఎంగా కొనసాగడానికి తీవ్రంగా కృషి చేిసిన పార్టీ ఇమేజ్ శాసనసభ ఎన్నికల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందని అది భావిస్తుండ వచ్చు. కానీ కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌తో అదేమి సాధించిందో తేలాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేపటి బిహార్ ఎన్నికల్లో మోదీ ఆవిష్కరిస్తున్న కార్పొరేట్ కలల ప్రపంచం ఒక వైపు, నితీశ్ ఆచరణ సాధ్యం చేసి చూపిన కామన్ మేన్ కోరుకునే మెరుగైన ప్రపంచం మరోవైపు మోహరించనున్నాయి. ఈ యుద్ధంలో విజేత ఎవరో వేచి చూద్దాం.
రసవత్తరంగా సాగిన బిహార్ రాజకీయ నాటకంలో బీజేపీ చివరికి విదూషక పాత్రలో నిలిచిందనడం వాస్తవం కాదు. ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మాంఝీ శాసనసభ బల పరీక్షలో గెలవలేడని బీజేపి నాయకత్వానికి ముందు నుంచే తెలుసు. ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్ వంటి వివాదాస్పద నేతల సహకారంతో జేడీయూ, ఆర్జేడీల నుంచి ఓ పాతిక, ముప్పయి మంది శాసనసభ్యులను కూడగట్టుకుంటే చాలు... తమ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చని మాంఝీకి ఆశలను కల్పించినదే బీజేపీ.
ఆ ‘వ్యాపార దక్షత’ మాంఝీకి లేదని దానికి ముందే తెలుసు. ఆ విషయం ఆయనకు కూడా చూచాయిగా అర్థం అవుతున్న సమయంలో బలపరీక్షలో మాంఝీకి మద్దతునిస్తామని ప్రకటించింది! మాంఝీ మీద బీజేపీ ఒలకబోసిన ఈ ప్రేమకంతటికీ కారణం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మహా దళిత వర్గాలను బుట్టలో వేయాలన్న కాంక్ష. అందుకోసమే బీజేపీ గత ఎనిమిది మాసాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ నాటకాన్ని నడిపించింది. ఇందులో జీతన్‌రామ్ మాంఝీ స్క్రిప్టు ఏమిటో తెలియని పాత్రధారి.
విలువలకు కట్టుబడే నేతగా నితీశ్‌కుమార్‌కు మంచి పేరుంది. బిహార్‌లో లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడటానికి ఆయన బీజేనీతో కలిసి పనిచేసినా, తన లౌకికవాద స్వభావాన్ని కాపాడుకుంటూ వచ్చారు. గోధ్రా అల్లర్ల ఆరోపణలను ఎదుర్కొన్న నరేంద్ర మోదీని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి నాయకునిగా ఉండి కూడా 2005, 2010 బిహార్ ఎన్నికల్లో మోదీ ప్రచారాన్ని అడ్డుకున్నారు.
గత పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రచారసారథిగా మోదీని నియమించిన వెంటనే నితీశ్ నాయకత్వంలోని జేడీయూ పార్టీ ఆ కూటమి నుంచి వైదొలగింది. తదుపరి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగి పరాజయం పాలైంది. నైతిక బాధ్యతను స్వీకరిస్తూ ముఖ్యమంత్రి పదవి నుంచి నితీశ్ తప్పుకున్నారు. కానీ ఇక్కడే ఆయన కొంత చాణక్యాన్ని ప్రదర్శించాలని చూశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో బిహార్ గణనీయంగానే వృద్ధి చెందింది. అయినా అది ఒక్కటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సరిపోదని, రాజకీయాల్లో సామాజిక వర్గాల పునరేకీకరణ జరగాలని నితీశ్ గ్రహించారు.
కాబట్టే మహా దళిత వర్గాల నేత మాంఝీని తన స్థానంలో కూర్చోబెట్టారు. దళితుల్లో బాగా వెనుకబడిన వారిని మహాదళితులని పిలుస్తారు. మాంఝీ బాగా వెనుకబడిన ముశాహర్ అనే దళిత కులానికి చెందిన వ్యక్తి. ముప్ఫయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. నిజానికి మహాదళిత వర్గాల్లో నితీశ్‌కు మంచి పేరే వుంది. మహాదళితులనే ప్రత్యేక విభజన చేసి ఆయన వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పించారు. ‘ముఖ్యమంత్రి ప్యాకేజీ’తో మహా దళితుల ఓట్లన్నీ తన ఖాతాలోకే చేరిపోతాయని నితీశ్ భావించారు. లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, జేడీయూలు కలిసి పాత జనతా పరివార్‌ను పునరుద్ధరించాయి.
కాబట్టి వెనుకబడిన వర్గాలన్నీ తమ వెంటే ఉంటాయని నితీశ్ భావన. బిహార్ బీసీల్లో బలమైన వర్గాలు యాదవులు, కుర్మీలు. యాదవ నేతగా లాలూప్రసాద్ జాతీయ స్థాయిలో పేరుగాంచారు. ఇక నితీశ్ తిరుగులేని కుర్మీ నాయకుడు. బాగా వెనుకబడిన వర్గాలు (ఎం.బీ.సీ.లు) తన వెంట నిలిచేలా ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ వ్యతిరేక మైనారిటీలు ఎలలగూ తమ వెంటే వస్తారని భావించారు. బీసీలు, మైనారిటీలు, మహాదళితులతో కూడిన తమ కూటమి అజేయశక్తిగా నిలబడుతుంది.
ఇదీ జనతా పరివార్ ఆలోచన. సంఘ్ పరివార్ చూస్తూ కూర్చుంటుందా? లాలూ, నితీశ్‌లు పసిగట్టకుండానే తన తెరచాటు ఆట మొదలు పెట్టింది. బిహార్‌లో అగ్ర కులాలుగా పరిగణించే రాజపుత్రులు (ఠాకూర్‌లు), భూమిహార్‌లు, బ్రాహ్మణులు, కాయస్తులు తదితరులు అత్యంత సంపన్నులు, సమాజంలోని అత్యంత పలుకుబడిగల వర్గాలు కూడా. ఇటీవలి కాలంలో ఈ వర్గాలన్నీ బీజేపీకి బాసటగా నిలబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అదే జరిగింది. విద్యావంతులైన పట్టణ బీసీలు కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. రామ్‌విలాస్ పాస్వాన్‌తో పొత్తు వల్ల ఒక వర్గం దళితుల మద్దతు కూడా దానికి ఉంది.
మహా దళితులు కూడా వీరికి తోడైతే...? జనతా పరివార్ జోరుకు రివర్స్‌గేర్ పడటం ఖాయం. సంఘ్ పరివార్ వేగంగా పావులు కదిపింది. ముఖ్యమంత్రి మాంఝీ కుమారునితో బీజేపి నేతల స్నేహం ప్రారంభమైంది. మాంఝీ ప్రైవేట్ సంభాషణల్లో నితీశ్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడం మొదలైంది. మరికొంత కాలానికే మాంఝీ కుమారుడు అధికారికంగానే బీజేపీలో చేరిపోయారు. మాంఝీ కూడా బహిరంగంగానే నితీశ్‌ను, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించడం మొదలైంది. శాసనసభ ఎన్నికల తర్వాత కూడా మాంఝీనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని అమిత్‌షా నుంచి స్పష్టమైన హామీ లభించిందనీ చెబుతారు.
మాంఝీ ఆశల సౌధాలు కూలినా బీజేపీ అనుకున్నది జరిగింది. మహా దళితుడు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా, జనతా పరివార్ వల్లనే ఫలించలేదనేది వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రచారాస్త్రం కానున్నదని బీజేపీ భావిస్తుండవచ్చు. అయితే దేశవ్యాప్తంగా పట్టణ మధ్యతరగతి, విద్యావంతులంతా కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌గా భావించే ఎత్తుగడలతో బిహార్‌లో బీజేపీ ఏమి సాధించిందో లెక్కలు తేలాల్సి ఉంది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. తాజా పరిణామాల నేపథ్యంలో కొంత ముందుకు జరిగినా ఆశ్చర్యం లేదు. దేశ జనాభాలో పాతికేళ్ళలోపు వయసున్నవారి సంఖ్య 50 శాతానికి కాస్త అటూ ఇటూ. కానీ బిహార్ జనాభాలో పాతికేళ్లలోపువారు 58 శాతం. దేశంలోనే నవయవ్వన రాష్ట్రం బిహార్. అందుకే బిహార్ ప్రజాతీర్పు భావి రాజకీయాలకు దోవ చూపే తీర్పు కాబోతోంది. దేశ చరిత్రలో బిహార్‌ది అగ్రశ్రేణి పాత్ర. దేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్య స్థాపన జరిగినది ఈ ప్రాంతంలోనే. సుమారు వెయ్యేళ్ల దేశ చరిత్రను ఈ ప్రాంతమే శాసించింది.
స్వాతంత్య్ర పోరాటంలోనూ బిహార్‌ది ప్రముఖ పాత్ర. స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ (ప్రస్తుతం జార్ఖండ్‌గా వేరుపడిన ప్రాంతం) పరిశ్రమలు ఏర్పడ్డాయి. కానీ, స్వాతంత్య్రానంతరం బిహార్ వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరింది. బిహార్ రాజకీయాలను స్థూలంగా మూడు దశలుగా విభజించవచ్చు. రెండు అల్పాయుష్క ప్రభుత్వాలను (1967, 1977) మినహాయిస్తే తొలిదశలోని మిగతా కాలమంతా కాంగ్రెస్ పాలనే సాగింది. జమీందారీ వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. భూసంస్కరణల చట్టాన్ని నామమాత్రంగానైనా అక్కడ అమలు చేయలేదు. ఫలితంగా వందలు, వేల ఎకరాల భూములు అగ్రవర్ణ భూస్వాముల చేతుల్లోనే మిగిలిపోయాయి.
ఈ భూస్వామ్య వ్యవస్థ దళితులు, గిరిజనులు, ఇతర పేద వర్గాలమీద దారుణమైన అణచివేతకు పాల్పడింది. పేదవర్గాలకు అండగా తొలిదశలో కమ్యూనిస్టులు, మలిదశలో నక్సలైట్లు నిలబడ్డారు. నక్సలైట్లను సాయుధంగా ఎదుర్కోవడం కోసం అగ్రవర్ణ భూస్వాములు సాయుధ కుల సేనలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కుల సేనలు, నక్సలైట్లు కలసి గ్రామీణ బిహార్‌లో సృష్టించిన మారణ హోమం దేశ చరిత్రలోనే ఒక చీకటి ఘట్టం.
గంగానది, దాని ఉపనదులతో అత్యంత సారవంతమైన భూములున్న బిహార్ నిజానికి దేశ హరిత విప్లవానికి మార్గదర్శి కావాల్సింది. ఫ్యూడల్ వ్యవస్థ కారణంగా వ్యవసాయ రంగంలో కూడా అది సంపదను సృష్టించలేకపోయింది. రామ్‌మనోహర్ లోహియా సిద్ధాంతాలతో ప్రభావితులైన తొలితరం చదువుకున్న బీసీ నేతలు సోషలిస్టు పార్టీ వెనుక సమీకృతమయ్యారు. నాయీ(క్షురక) కులస్తుడైన కర్పూరీ ఠాకూర్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ రెండు సార్లు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించింది.
అయితే ఆ ప్రభుత్వాలు పూర్తి కాలం మనలేకపోయాయి. లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్‌లూ, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ తదితరులు ఆ కాలంలో విద్యార్థి నేతలుగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. బిహార్‌లో స్థానిక వైశ్యులను బీసీలుగా పరిగణిస్తారు. వలస వచ్చిన అగర్వాల్ వంటి వైశ్యులే అగ్రవర్ణాల కింద లెక్క. ఆ విధంగా స్థానిక వైశ్యుడైన సుశీల్‌కుమార్ మోదీ కూడా బీసీగా చలామణి అయ్యారు. ఈ ముగ్గురూ బీసీ రాజకీయ ఎజెండాతోనే రాజకీయంగా నిలదొక్కుకున్నారు. 1990లో లాలూప్రసాద్ యాదవ్ నాయకత్వంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడటం బిహార్ రాజకీయాల్లో రెండోదశ. నితీశ్‌కుమార్ అప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. 1995లో రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం లాలూను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పరిపాలనలో లూలూ కుటుంబ జోక్యం పెరిగింది. దీంతో లాలూ, నితీశ్‌ల మధ్య దూరం పెరిగింది. జనతాదళ్ రెండుగా చీలిపోయింది.
లాలూ కుటుంబ నేతృత్వంలో సాగిన పదిహేనేళ్ల రెండోదశ పాలన కూడా అరాచక పాలనగానే మిగిలిపోయింది. నిమ్నవర్గాల వారికి చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయడం, కీలక పదవులను కట్టబెట్టడం మినహా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాల కల్పన లేదు. విద్యా, వైద్య రంగాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరింది. ఈ కాలంలో వంద కిలోమీటర్ల దూరం కారులో వెళ్లాలంటే నాలుగున్నర గంటలు పట్టేదట. రోడ్ల నిర్వహణ పరిస్థితి అది. ఈ దశలో లక్షలాది మంది బిహారీలు పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయారు.
అలా వలస వెళ్లినవారు ఆ రాష్ట్రాల్లోని అభివృద్ధి, సంపదల గురించి కథలు కథలుగా స్వరాష్ట్రానికి చేరవేశారు. దీంతో బిహార్ ప్రజల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. దాని ఫలితమే 2005లో నితీశ్ నేతృత్వంలో ఏర్పడిన జేడీయూ-బీజేపీ ప్రభుత్వం. నితీశ్ పాలనా కాలం బిహార్ రాజకీయాల్లో మూడోదశ. ఈ దశలో వెనుకబడిన వర్గాల్లో మరింత వెనుకబడిన వారికి (ఎంబీసీలు), దళితులలో మరింత పేదలకు (మహాదళితులు) ప్రత్యేక గుర్తింపును, అవకాశాలు కల్పించి నితీశ్ సామాజిక న్యాయం పాటించారు.
అదే సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. నితీశ్ హయాంలో బిహార్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరుగులు తీసింది. శాంతి భద్రతలు మెరుగయ్యాయి. రోడ్లు చక్కబడ్డాయి. విద్య, వైద్య సంస్థల నిర్వహణ మెరుగుపడింది. వలసలు తగ్గుముఖం పట్టాయి. చాలా ఏళ్ల తర్వాత బిహార్ సమాజంలో సామరస్య వాతావరణం ఏర్పడింది. నితీశ్ బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తదుపరి వేగంగా మారుతున్న కొత్త రాజకీయ సమీకరణల నేపథ్యంలో నేడు బిహార్ మరో కొత్త దశలోకి అడుగుపెట్టనుంది. నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తున్న కార్పొరేట్ కలల ప్రపంచం ఒక వైపు, నితీశ్‌కుమార్ ఆచరణ సాధ్యం చేసి చూపిన కామన్ మేన్ కోరుకునే మెరుగైన ప్రపంచం మరోవైపు మోహరించబోతున్నాయి. చరిత్రలో ఎన్నో మహాసంగ్రామాలను చూసిన బిహార్ ఎన్నికల యుద్ధంలో విజేత ఎవరో వేచి చూద్దాం.
muralivardelli@yahoo.co.in
- వర్ధెల్లి మురళి