
చిట్కా బాబా... చీప్ లేబర్
ఆంధ్రప్రదేశ్ ‘అద్భుత’ రాజధానిలోని అవకాశాల ఎండమావులను నమ్ముకోలేని విద్యావంతులు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోతూనే ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ‘అద్భుత’ రాజధానిలోని అవకాశాల ఎండమావులను నమ్ముకోలేని విద్యావంతులు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోతూనే ఉన్నారు. అయినా గానీ రేపు ప్రజలంతా విరివిగా కనబోయే సంతానానికి ఉద్యోగాలు సిద్ధం చేసేస్తానని చంద్రబాబు అంటున్నారు. మెకెన్సీ నివేదికను తెగ సాగలాగి, జనాభా పెరిగితే వేతనాలు పడిపోతాయనే సూత్రాన్ని సమయం సందర్భం లేకుండా కలవరిస్తున్నారు. జనాభా పెరిగిపోతే చాలు.. కారు చౌక శ్రమకు ఏపీనే కేంద్రమని మెకెన్సీ మెచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుందని కలల్లో తేలిపోతున్నారు.
పోప్ ఫ్రాన్సిస్ వారం రోజుల క్రితం ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు. రాజధాని మనీలాలో అరవై లక్షలమంది హాజరైన రికార్డు స్థాయి బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం రోమ్‌కు తిరుగు ప్రయాణంలో విమానంలోనే మీడియాతో మాట్లాడారు. ఆ మాటల్లో జనాభా ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘కృత్రిమ పద్ధతుల ద్వారా సంతాన నిరోధాన్ని చర్చి నిషేధించిన మాట నిజమే. దానర్థం ఇబ్బడిముబ్బడిగా పిల్లల్ని కనేసి జనాభాను పెంచేయమని మాత్రం కాదు. తల్లిదండ్రులకు పిల్లలపట్ల, వారి అభ్యున్నతిపట్ల బాధ్యత కూడా ఉండాలి’’ అని పోప్ అన్నారు. ఆయన స్వరంలో సంస్కరణ ధ్వనించింది.
ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల పట్ల ఆపేక్షే ఆ సంస్కరణకు ప్రేరణ. హిందువులందరూ నలుగురైదుగురు పిల్లల్ని కనాలని కొంతకాలంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులు సాక్షి మహారాజ్ ప్రబోధిస్తున్నారు. ఈ అభిప్రాయాన్ని ఆ పార్టీ అధికారికంగా అంగీకరించకపోయినా, ఆ పార్టీకి వెన్ను దన్నుగా ఉన్న ఓ వర్గం ఆలోచనకు సాక్షి మహారాజ్ ప్రతిరూపం.
హిందూ ఆధిపత్య ఆకాంక్షే ఆ ఆలోచనకు మూలం. పోప్ ఫ్రాన్సిస్ మీడియాతో మాట్లాడిన రోజే, సరిగ్గా అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ర్టంలో సంతానోత్పత్తి తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న వాళ్లు పిల్లల్ని కనడం మానేశారు. ముసలివాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇలా అయితే అభివృద్ధి సాధించలేం. ప్రజలందరూ బాగా పిల్లల్ని కనాలి, వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించే పూచీ నాదీ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుకు లోకేశ్ ఒక్కడే సంతానం. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అని ఆయన ఒకప్పుడు నమ్మారు. హఠాత్తుగా ఆయన వైఖరి ఇప్పుడు ఎందుకు మారింది?
నేటి ప్రపంచ పెట్టుబడిదారీ ఎజెండాయే ఈ మార్పునకు కారణం. ఈ మధ్యకాలంలో ఆర్థికంగా చైనా బాగా బలపడుతున్నది. ఎంతగా నంటే ప్రపంచ పెట్టుబడిదారీ దుర్గమైన అమెరికా కూడా భయపడేంతగా. చైనా ఆర్థికవ్యవస్థ బలం పుంజుకోవడం వెనుక ఉన్న ‘రహస్యం’... వస్తూ త్పత్తి రంగం. ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా చైనా అవతరించడం. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వస్తూత్పత్తి రంగం వాటా 44 శాతం. కాగా భారత జీడీపీలో వస్తూత్పత్తి రంగం వాటా 16 శాతానికి పరిమిత మైంది. వస్తూత్పత్తి రంగానికి కేంద్రంగా చైనా అవతరించడం వెనుక అమె రికా తదితర పశ్చిమ దేశాల ప్రమేయం ఉంది.
1980 కంటే పూర్వం భారత్ కంటే చైనా జీడీపీ తక్కువ. కానీ ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత రెండో అతి పెద్ద జీడీపీ గల దేశంగా అవతరించింది. భారత్ పదోస్థానంలో, చైనా జీడీపీలో దాదాపు ఐదో వంతుగా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘గోల్డ్‌మెన్ సాచిస్’ పెట్టుబడుల బ్యాంకు 2016 నాటికి భారత జీడీపీ వృద్ధి రేటు చైనాను మించిపోతుందని గత నెలలో జోస్యం చెప్పింది. అది 2019 నాటికి మాత్రమే జరుగుతుందని ‘ఫోర్బ్స్’ పత్రిక అంటోంది. త్వరలోనే భారత్ ప్రపంచ జీడీపీలో అగ్రస్థానానికి చేరిపోతోందని కూడా అంటున్నారు. అంటే ఏదో అద్భుతం జరుగబోతోంది. ఆ ‘‘అద్భుతానికి’’ చంద్రబాబు నాయుడు జనాభాను పెంచాలని అందుకున్న కొత్త పాటకు సంబంధం ఉండటం మరిం త అద్భుతం! అది... అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తిగా చైనా మారడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారీ ఎజెండాలో వచ్చిన మార్పు మహిమ.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, యూరప్ దేశాలు శరవే గంగా సామాజిక, ఆర్థిక మార్పులకు లోనయ్యాయి. కార్మికవర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. వారి జీతాలు పెరిగాయి. ఫలితంగా ఆ దేశాల వినిమయ వస్తువుల డిమాండు వేగంగా పెరిగింది. ఆ అవసరాలను చౌకగా తీర్చగలిగేలా కారు చౌకకు శ్రామిక సేవలను అందించి, వినిమయ వస్తువుల ఉత్పత్తికి ఉపయోగపడే స్థావరంగా వారికి చైనా కనబడింది. చైనాలోని నియంత్రిత పాలనా వ్యవస్థ (లేదా నియంతృత్వ పాలన) అమలులో ఉంది. ప్రజలు ఏ పని చేయాలి? ఏం చదవాలి? ఏం ఆలోచించాలి? వంటి విషయా లను కూడా ప్రభుత్వమే నిర్దేశించే రెగ్యులేటెడ్ ‘కమ్యూనిస్టు’ పాలన సాగు తోంది. అది వస్తూత్పత్తి రంగం వేగంగా విస్తరించడానికి కలిసొచ్చింది. మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు చైనాకు క్యూ కట్టాయి. ‘మేడ్ ఇన్ చైనా’ చౌక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తాయి. చైనా ప్రపంచ మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా మారింది. ఈ క్రమంలో గడచిన మూడు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థిక వ్యవస్థ బలపడింది. జీవన ప్రమాణాలు పెరిగి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి జనాభా బాగా పెరిగింది.
ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ రెండేళ్లక్రితం ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ రంగంపై ఒక నివేదికను ప్రచురించింది. అం దులో అది రెండు సూత్రీకరణలు చేసింది. ఒకటి, మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఇక చైనా ఎంత మాత్రమూ పనికిరాదు. అక్కడ ఇప్పుడు చౌకగా శ్రమశక్తి లభించే పరిస్థితులు లేవు. మరో నాలుగైదేళ్లలో పట్టణ జనాభాలో సగం ఎగువ మధ్యతరగతి శ్రేణిలో చేరిపోతారు. చైనా ఇక చౌక వస్తువుల తయారీ దారుగా పనికిరాదు. ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవలసిందే. అందుకు సరైన ప్రత్యామ్నాయం భారత్ అనేది రెండవ సూత్రీకరణ.
అయితే, భారత్‌లో కొన్ని పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యతను సులభతరం చేయాలి. తక్కువ వేతనానికి, ఎక్కువ సమయం పనిచేయడానికి వీలుగా, ఉద్యోగ భద్రతలేని ‘హైర్ అండ్ ఫైర్’ పద్థతికి అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించాలి. మౌలిక వసతుల రంగం బాగా అభివృద్ధి చెందాలి. వేగవంతమైన రవాణాకు పెద్దపెద్ద రహ దారులు, ఎగుమతుల కోసం పెద్ద సంఖ్యలో పోర్టులు నిర్మించాలి. ప్రస్తుతం మన ఓడ రేవుల్లో లోడింగ్‌కైనా, అన్ లోడింగ్‌కైనా నాలుగైదు రోజులు పడు తున్నది. హాంకాంగ్‌లో ఆ పని పది పన్నెండు గంటల్లో పూర్తవుతుంది. ఈ పరిస్థితులను చక్కదిద్దితే ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను మించిన ప్రత్యామ్నాయం లేదన్నది మెకెన్సీ నివేదిక సారాంశం. అమెరికా నేతృత్వంలోని ప్రపంచ పెట్టుబడిదారీ విధానం, ప్రపంచ బ్యాంకు వగైరా ఏజెన్సీలు దానిని ఆమోదించాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందుగానే అవి రంగంలోకి దిగి తమ ఎజెండాను అమలు చేయగల టీమ్‌ను ఎంపిక చేసుకున్నాయి.
మెకెన్సీ నివేదిక చూపిన బాటలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం కూడా ప్రారంభమైంది. భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్ ఈ దిశలో వేసిన పెద్ద ముందడుగు. కార్మిక చట్టాల సవరణకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అన్నిటినీ మించి అధికారంలోకి వచ్చీరాగానే మోదీ ఇచ్చిన ‘మేకిన్ ఇండియా’ నినాదంలోనే ఆ పరమార్థం దాగి ఉంది. ప్రపంచ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు కావాల్సిన అన్ని సేవలనూ, సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, వచ్చేయండి అనే పిలుపు అది. మోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపును వస్తూత్పత్తి రంగానికి ఉద్దే శిస్తే, చంద్రబాబు దానిని సంతానోత్పత్తి రంగం దాకా సాగదీశారు. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాక ముందే చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ముద్దుల శిష్యుడు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన అనంతరం ప్రపంచ బ్యాంకు సాగించిన తొలి దండయాత్రలో ఉత్తమ ఏజెంట్‌గా మన్నన పొందిన వ్యక్తి.
ఆ దండయాత్ర మలి దశలో మోదీ నీడన మరుగున పడిపోవడం ఆయనకు మనస్కరించడంలేదు. అందుకే ప్రపంచ బ్యాంకు ఎజెండా అమలులో ‘ఉగ్రవాద’ వైఖరి చేపట్టి మరీ తన ఉని కిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. మూడు పంటలు పండే మాగాణి పొలాల నుంచి సైతం రైతులను బేదఖల్ చేసి, తన ప్రత్యేక శైలిని చాటాలనుకుంటున్నారు. మెకెన్సీ నివేదికను శిరసావహించి కోస్తా తీరం పొడుగునా పన్నెండు ఓడ రేవులను ఇప్పటికే ప్రకటించేశారు. ఉపాధి హామీనీ అమలుచేయడం దాదాపుగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం చాపచుట్టేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ విధానాల ద్వారా శ్రామికులు అధిక వేతనం కోసం బేరమాడే శక్తిని కోల్పోతారని వీరి అంచనా. దీనికి కొనసాగింపే చంద్రబాబు అధిక సంతానంతోనే అభివృద్ధి అనే పిలుపు.
తప్పుల తడక నివేదికల సంస్థ మెకెన్సీని తలదన్నేలా చంద్రబాబు వాస్తవ దూరమైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. ఆయన చెబుతు న్నట్టు రాష్ట్ర జనాభాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఏం లేదు. 60 ఏళ్లు పైబ డిన వారి సంఖ్య జనాభాలో 8 శాతం మాత్రమే. అక్షరాస్యత ఇంకా 67 శాతం దాట లేదు. పేదలకే కాదు మధ్యతరగతికి కూడా కాలేజీ చదువులు అందు బాటులో లేకుండా పోతున్నాయి. ఎదగాల్సిన బాలలకు అర్ధాకలి, పౌష్టికా హార లోపం తప్పడం లేదు. ఇప్పుడున్న శ్రామిక జనాభాలో అందరికీ పనులు లేవు.
అభినవ ఆంధ్రప్రదేశ్ ‘అద్భుత’ రాజధానిలో పుట్టుకురానున్న అవకా శాల ఎండమావులను నమ్ముకోలేని విద్యావంతులు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోతూనే ఉన్నారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా నన్నట్టు రేపు ప్రజలంతా విరివిగా కనబోయే సంతానం పెరిగి పెద్దయ్యేసరికి ఉద్యోగాలు సిద్ధం చేసి ఉంచేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఈ స్థితిలో జనాభా వృద్ధి రేటు ఇంకా తగ్గాలని ఆర్థిక, సామాజిక వేత్తలు అంతా అంటుం డగా చంద్రబాబునాయుడు మెకెన్సీ నివేదికను తెగ సాగలాగి, జనాభా పెరిగితే శ్రమశక్తి ధర లేదా వేతనాలు పడిపోతాయనే ఆర్థిక సూత్రాన్ని సమ యం సందర్భం లేకుండా కలవరిస్తున్నారు. రాష్ట్ర జనాభా పెరిగిపోతే చాలు.. ప్రపంచంలోనే కారు చౌక శ్రమకు ఏపీనే కేంద్రమని మెకెన్సీ కన్సల్టెన్సీ మెచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుందని కలల్లో తేలిపోతున్నారు.
muralivardelli@yahoo.co.in
- వర్ధెల్లి మురళి