
‘వాన కురిసినప్పుడే గదెయ్ నువు జడేసేది’ అంటుంది నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కథల్లో ఒక పాత్ర మరో పాత్రతో. వాన కురిసినప్పుడు జడ వేయడం ఏమిటి? అనంటే అసలు ఆ పాత్రకు జడేసుకునే టైమే ఉండదన్నమాట. నూనె రాసుకోవడం ఇంకా పెద్దమాట. తైల సంస్కారం లేక కేశ పోషణ పట్టించుకోక చిక్కిరి బిక్కిరి జుట్టుతో బతకడమే పెద్దపనిగా ఉన్న ఆ పాత్ర మీద దయతో వాన కురిస్తే, జుట్టును పూర్తిగా తడిపితే, అప్పుడామె ఇదే అదననుకొని ఆ తడి మీద దువ్వెనతో జడను సవరించుకుంటుంది. బహుశా అప్పుడామె అద్దంలో చూసుకోవచ్చు. ఆ పెదాలకు నవ్వుంటుందని గుర్తు చేసుకోవచ్చు.
చిన్నారి పిల్ల దుర్గ తనకు తానే గొప్ప బంగారు బొమ్మే! ఆ పిల్ల ఒంటి మీద ఏముందని? పట్టు వస్త్రాలా? బంగారు ఆభరణాలా? బొట్టు బిళ్లలా? జడ కుప్పెలా? ముతక వస్త్రాన్ని చుట్టుకుని బుజ్జి తమ్ముణ్ణి వెంటేసుకుని తుంగ పొదల మైదానాల్లో వనకన్యలా తిరుగుతూ ఉంటుంది. కాస్త అలంకరించుకుందామని అనుకుందేమో... పక్కింటిలో పూసలదండ దొంగిలిస్తుంది. ఆ చిన్నాచితక దండకు పెద్ద రాద్ధాంతం. చివరకు దుర్గ ఆ దండ వేసుకోనే వేసుకోదు. వానలో తడిసి జబ్బు చేసి చనిపోతుంది. ఆమెను దాచి పెట్టిన నేల మీద అందమైన గడ్డిపూలు పూసే ఉంటాయి– ‘పథేర్ పాంచాలి’ నవలలో!
యానాదుల ఆడపిల్లలు మన ఆడపిల్లలకు సమానమా? యానాదులు అనేవారు మన లెక్కన మనుషులేనా? నువ్వేమనుకుంటే వాళ్లకేంటోయ్! వాళ్లకూ ఉంటాయి కలలూ కనుకొలకలూ. మూడేళ్ల చిట్టి కుమార్తెను చూసుకుని ఆ యానాది తల్లికి ఎంత మురిపెమో. చింకి పాతల్లో ఉంటేనేం... బంగారు భరిణె. వైడూర్యాల రాశి. ఒకరోజు తంగేడుపూలు తెచ్చి కూతురి చెవులకు జూకాలుగా చేస్తుంది. మరోరోజు పచ్చగన్నేరుపూల మాల వేస్తుంది. ఓయమ్మా... ఎంత బాగుందో నా బంగారు కూతురు.
వీటికే ఇంత బాగుంటే బంగారు నగ వేస్తే ఇంకెంత బాగుంటుందో! పక్కనే షావుకారు ఇల్లు. అక్కడే మెడలో కంటెతో ఆడుకుంటున్న షావుకారు కూతురు. ఆ పిల్ల మెడలోని కంటె తీసి తన కూతురి మెడలో వేసి ఒక నిమిషం చూసుకుంటుంది. పాపం... యానాది తల్లి. కూతురితో సహా జైల్లో పడుతుంది. దొంగతనం చేసినందుకని జనం అనుకున్నారు. కూతురికి ముస్తాబు చేసినందుకు అని యానాది అనుకుంది. చింతాదీక్షితులు– ‘అభిప్రాయభేదం’ కథలో.
ఉన్నవి పన్నెండు రూపాయలు. చీరేమో ఇరవై రెండు రూపాయలకు తక్కువ రావడం లేదు. ‘కొంచెం... కొంచెమైనా తగ్గదంటారా’.... ‘ఇదేం శుక్రవారం సంత కాదు బేరాలాడ్డానికి’.... ఆ అవమానానికి తండ్రి లోలోపల నెత్తురు కక్కాడు. కూతురు భూమిని చీల్చుకు కూరుకుపోవాలనుకుంది. ఏమడిగిందని... జరీ అంచు తెల్లచీర.
ఆరో ఏట నుంచి ఆశ పడుతుంటే పదహారో ఏటకు తండ్రి ఎల్లాగో పన్నెండు రూపాయలు సంపాదించి షాపుకు తీసుకెళితే మెడకు బిగ వేసుకునే రేటు. ‘ఇంతుంటుందని తెలియదమ్మా’... ‘పర్లేదు పోదాం పద నాన్నా’.... ఇప్పుడు కాకపోతే మరోసారి... ఇరవై రెండు రూపాయలు సంపాదించి వెళ్లి కొనుక్కోవాలి... పిచ్చిదానా... అప్పటికా చీర అరవై ఆరు రూపాయలు ఉంటుందే! రావిశాస్త్రి కథ కదూ ఇది.
ఎవరి ముస్తాబులు వారికి ఉంటాయి. అందుకు పాకులాడటమూ ఉంటుంది. చక్కదనం ప్రతిజీవి ప్రాథమిక లక్షణం. చక్కదిద్దుకోవాలనుకోవడం స్వాభావికం. అయితే మనిషికి తప్ప ఇతర జాతుల అంతర్ కొలతల్లో అందమూ, అంద వికారమూ ఉండదు. చిలుకల అందం చిలుకలది. కోయిలల అందం కోయిలలది. అలాగే సిరిగల వారి అందం సిరిగల వారిదైతే సాదాసీదా గడపల్లోని ముగ్గుల, మందారాల అందం వాటిదీనూ! ఏ సింగారమూ లేకపోయినా పెరట్లో కాసిన్ని చేమంతులు పూయకపోవు. ముడిచి మెరవగలరు తళుక్కున.
వారేనా? ఎర్ర ఇటుకలు తల మీద ఉన్నప్పుడు, నల్ల నీటికడవ నడుమున మోస్తున్నప్పుడు, కాలే ఇనుముపై సమ్మెట పోటు వేసే సమయాన గాజులు గలగలలాడుతున్నప్పుడు, నారు గుచ్చుతున్నప్పుడు, పిల్లలు కోరిన చెట్టుకాయను పకపకా నవ్వుతూ దోటీతో రాలుస్తున్నప్పుడు, బాబును స్కూల్లో దింపి ఆఫీసుకు వెళ్లే తొందరలో పౌడర్ రాసుకోనప్పుడు, గట్టిగా అరుస్తున్నప్పుడు, మెత్తగా మాట్లాడుతున్నప్పుడు, ఒక రాత్రి స్నానమాడి ముస్తాబైనపుడు, పురుడుకని పుట్టింటికి చేరినప్పుడు... ఉంటాయి అందమైన సమయాలు ప్రతి ఒక్కరికీ! అందం లేనిదెవ్వరికి?
‘నిను చూసి కోరునేమో ప్రతి కన్నూ... ప్రియా... వారికి నా దృష్టి ఎక్కడ?’ అన్నాడొక కవి. చూపు వేరు. దృష్టి వేరు. సౌందర్య దృష్టిని కనుగొనేవారు ప్రతి సందర్భంలో, ప్రతి సాధారణతలోనూ కనుగొంటారు. గరిక పచ్చ మైదానాలదే రంగైతే... తుపానులు రేగే ఎడారుల బంగారు వర్ణాన్ని ఏమనాలి? ఉన్నది ఉంటుంది. ఉన్నది ఏదైనా అది బాగుంటుంది.
ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వేడుకల కళ వేడుకలది. ఇదే సమయంలో పోషక ఆహారం, తగిన విశ్రాంతి, ఆర్థిక స్వాతంత్య్రం, మాటకు విలువ, సంపదలో అధికారంలో సమ భాగస్వామ్యం కలిగిన ఆత్మగౌరవ జీవన సౌందర్యం ప్రతి మహిళకూ హక్కుగా ఉండాలని కోరుకోవడం సముచితమే! అది దృష్టి.