మారే సీజన్ చర్మ సమస్యలనూ తీసుకువస్తుంది. చర్మంపై తేమ కోల్పోయి త్వరగా పొడిబారుతుంది. లోషన్లు, క్రీములు, ఆయిల్స్‌తో మనమే చర్మానికి ఒక రక్షణ పొరను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ చర్మ తత్వం గలవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే ఆందోళన లేకుండా అందరూ రోజూ పాటించాల్సిన విధానాలనుతెలుసుకొని ఆచరణలో పెడదాం.
మిగతా కాలాల మాదిరి కాకుండా చర్మాన్ని చల్లగా దెబ్బతీయడంలో ఈ సీజన్ ముందుంటుంది. పొడి చర్మం గలవారికైతే ఈ సీజన్‌లో సమస్య పెరిగి, నిస్తేజంగా కనిపిస్తుంది. చలిని తట్టుకోవడానికి స్వెటర్లు్ల ఎలాగయితే ధరిస్తామో చర్మాన్ని కాపాడుకోవడానికి అలాగే రక్షణ చర్యలు తీసుకోవాలి.
సబ్బుల వాడకం వద్దు
చలికాలం మిగతా రోజుల మాదిరి కాకుండా స్నానం చేయడం దగ్గర నుంచి కొన్ని తప్పనిసరి మార్పులు చేసుకోవాలి. ఓట్‌మీల్, గ్లిజరిన్, ఆలొవెర్, వేపనూనె, .. ఉండే సబ్బులు వాడాలి. దీంట్లో కూడా సబ్బుల కంటే మైల్డ్ క్లెన్సింగ్ లోషన్స్ వాడటం మేలు. వీటిలోనూ సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ లోషన్లు.. అవి కూడా ఎక్కువ నురగరానివి ఎంచుకోవాలి. ఇంకా డ్రైనెస్ ఎక్కువ ఉందంటే షవర్ ఆయిల్స్ వాడుకోవచ్చు. ఉదయం – సాయంత్రం ఒకసారి మాత్రమే ఈ లోషన్లు ఉపయోగించి స్నానం చేయవచ్చు. ఎక్కువ సమయం నీటిలో ఉండకుండా స్నానం చేసే టైమ్ త్వరగా ముగించుకోవాలి. స్నానానికి వాడే నీళ్లు మరీ వేడిగా, మరీ చల్లగా ఉండకూడదు.
క్రీములు తప్పనిసరి
స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. క్రీమ్‌లా ఉండే అయిట్‌మెంట్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. అది కూడా పూర్తి శరీరానికి క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఏ చర్మతత్త్వం ఉన్నవాళ్లు అయినా అందరూ ఈ పద్ధతినే అనుసరించాల్సి ఉంటుంది. ముఖం చాలా జిడ్డుగా ఉంది అనుకుంటే వాటర్ బేస్డ్ లోషన్లు రోజుకు 3–4 సార్లు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అలొవెరా బేస్డ్ లోషన్లు ఈ సీజన్‌కి సరి΄ోవు. లిక్విడ్ పారాఫిన్, మినరల్ ఆయిల్స్, ఓట్‌మిల్.. మల్టిపుల్ కాం΄ోజిషన్స్ ఉండే లోషన్లు ఉపయోగించవచ్చు. దుస్తులు కూడా డైరెక్ట్‌గా ఉలెన్‌వి కాకుండా ముందు కాటన్‌వి వేసుకొని, వాటిపైన వింటర్ వేర్ ధరించాలి. చలికాలం సూర్యకాంతి తక్కువే అనుకోవడానికి లేదు. ఈ కాలం కూడా సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడాలి. రెటినల్స్.. వంటి కొన్ని సీరమ్స్ వారానికి 2–3 సార్లు ఉపయోగించవచ్చు.
సోరియాసిస్, ఎగ్జిమా ఉన్నవాళ్లు మిగతావారికన్నా జాగ్రత్తగా ఉండాలి. ప్యాచ్‌లుగా ఉన్నవాటిమీద వైద్యులు సూచించిన క్రీములు రాసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ సమస్య ఉంటే వైద్యుల సలహా మేరకు మెడిసిన్స్ వాడటం మంచిది. మాయిశ్చరైజర్, వేసుకునే దుస్తులు, స్నానం చేసే విధానం .. వీటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది.
అదనపు శ్రద్ధ – చేతులు – పెదవులు
చేతులు, పెదవులు, పాదాలు, కాలి మడమలు.. బాగా పొడిబారి బాధిస్తాయి. అందుకే, సున్నితమైన లిప్ బామ్ (ఉదా: బీస్‌వ్యాక్స్, షియా బటర్ కలిగిన) ఉపయోగించాలి.
చేతులకు హ్యాండ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత కాటన్ గ్లోవ్స్ ధరించడం మేలు.
రాత్రివేళ పాదాలను గోరువెచ్చని నీటిలో ఉంచి, శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్ రాసుకొని, సాక్సులు ధరించాలి.
బద్ధకించకుండా, నిర్లక్ష్యం చేయకుండా పైజాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలం బాధించే చర్మ సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, చర్మం యవ్వనకాంతిని కోల్పోకుండా ఉంటుంది.
రక్షణ పొర మనమే తయారుచేసుకోవాలి..
చలికాలం చర్మం పొడిబారకుండా‘జొజోబా ఆయిల్, గ్లిసరిన్, హయాలురోనిక్ యాసిడ్, లానోలిన్, పెట్రోలాటమ్, షియా బటర్.. వంటివి ఉపయోగించవచ్చు.
ఇంట్లో హ్యుమిడిఫయర్ (గదుల్లో తేమ తగ్గకుండా ఉపయోగించే పరికరం) అమర్చుకోవడం ఒక కీలక మార్పు.
శీతాకాలంలో చర్మం ఇప్పటికే తేమ కోల్పోతుంది కాబట్టి స్క్రబ్స్ లేదా అధిక ఫిజికల్ ఎక్స్‌ఫోలియేషన్ చేయడం ప్రమాదకరం. తప్పనిసరి అయితే నిపుణులు ‘సాఫ్ట్ కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్‌లు’ను వారంలో 1–2 సార్లు ఉపయోగించమని సూచిస్తున్నారు.
చాలామందికి సమ్మర్‌లో మాత్రమే సన్‌స్క్రీన్ అవసరమని అనిపిస్తుంది. చల్లని రోజుల్లో కూడా హానికర కిరణాలు చర్మానికి తాకవచ్చు. అందుకని ఎస్‌పిఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ని ఉపయోగించాలి.
చలికి నీళ్లను తక్కువ మోతాదులో తాగుతారు. కానీ, వివిధ రకాల ద్రవపదార్థాలు ఈ కాలంలోనూ తీసుకోవాలి. సెల్ రిపేర్ ఛాన్సులు పెరుగుతాయి. ఆకుకూరలు, వాల్‌నట్స్, బాదాములు ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల చర్మకాంతిలో ఇబ్బందులు తలెత్తవు.
ఆల్కహాల్, పొగ తాగడం, వేపుడు పదార్థాలను తీసుకోకూడదు. ఇవి చర్మంలోని సహజ నూనెలను తీసేస్తాయి.
పొడి చర్మం గలవారు సీరమ్ + క్రీమ్ + ఆయిల్స్‌ను అవసరానికి తగినట్టు వాడచ్చు.
డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్


