కశ్మీర్‌ మళ్లీ మొదటికి?!

Sakshi Editorial On Jammu And Kashmir attacks

అడపా దడపా జరిగే ఘటనలు మినహా దాదాపు ప్రశాంతంగా ఉన్నట్టు కనబడిన కశ్మీర్‌పై ఉగ్ర వాదులు పంజా విసిరారు. ఒక ఎన్‌కౌంటర్‌ సందర్భంగా అనంతనాగ్‌ జిల్లాలో బుధవారం సైనికాధికారులు కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్‌ ఆషిష్, డీఎస్‌పీ హుమాయిన్‌ ముజామిల్‌ భట్‌ ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు నేలకొరగడం... అదే ప్రాంతంలో శుక్రవారం మరో ఆర్మీ జవాన్‌ మిలిటెంట్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. 

దట్టంగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాలను ఎంచుకుని భద్రతా బలగాలపై దాడికి తెగబడటం ఇటీవలి కాలంలో మిలిటెంట్లు అనుసరిస్తున్న వ్యూహం. గత నెలలో ముగ్గురు ఆర్మీ జవాన్లను హతమార్చిన ప్రాంతం కుల్గామ్‌ కూడా దట్టమైన అటవీ ప్రాంతమే. కొండలు, కోనలు ఉండే అటవీప్రాంతంపై సమగ్ర అవగాహన ఉంటే తప్ప సైన్యం మిలిటెంట్లను తిప్పికొట్టడం సాధ్యం కాదు. తమకు బాగా పట్టున్న ఇలాంటి ప్రాంతాల్లో వారానికి సరిపడా ఆహారం, మందుగుండు సిద్ధం చేసుకుని ఒక పద్ధతి ప్రకారం మిలిటెంట్లు సైన్యాన్ని తామున్నచోటకు రప్పిస్తున్నారు. కొండలపై మాటుగాసి తమవైపు వస్తున్న బలగాలపై కాల్పులు జరపటం మిలిటెంట్లకు సులభమవుతోంది. ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల భద్రతా బలగాలకు బాసటగా వచ్చే హెలికాప్టర్లపై సునాయాసంగా దాడులు చేయగలుగుతున్నారు. 

పైగా మిలిటెంట్ల ఫోన్‌ సంభాషణలను వినటం, వారి ఆనుపానులు ఎక్కడ వున్నాయో కచ్చితంగా అంచనా వేయటంలాంటి అంశాల్లో సైన్యం విఫలమవుతోంది. మైదాన ప్రాంతాల్లో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. అక్కడ భద్రతా బలగాలకు సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మిలిటెంట్ల ఆటలు సాగడం లేదు. ఉగ్రవాద దాడులు పెరగటం వెనక ఎప్పటిలాగే పాకిస్తాన్‌ హస్తం ఉండటం బాహాటంగా కన బడుతోంది. 

వాస్తవానికి పాక్‌ ఆర్థికంగా దివాలా తీసి, ఇప్పట్లో కోలుకునే అవకాశం లేని స్థాయికి చేరుకుంది. రాజకీయంగా సరేసరి. ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దెదించిన నాటినుంచీ సైన్యంపై సాధారణ ప్రజానీకంలో ప్రతికూలత పెరిగింది. మరోపక్క ఉగ్రవాదులకు నిధులు అందజేయటానికి తోడ్పడే సంస్థలనూ, దేశాలనూ నిరోధించేందుకు అంతర్జాతీయంగా ఏర్పాటైన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పాకిస్తాన్‌పై నిఘా ఉంచింది. అయినా సరే అది తన వెనకటి గుణాన్ని వదులుకోవటానికి సిద్ధపడటం లేదని కశ్మీర్‌ తాజా పరిణామాలు చెబుతున్నాయి. 

ఇప్పుడు జరిగిన దాడులకు బాధ్యు లుగా చెప్పుకున్న ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌) పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధంగా పుట్టుకొచ్చిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సంస్థ ఆంక్షలను అధిగమించటానికి పాకిస్తాన్‌ ఈ కొత్త ఉగ్ర సంస్థను సృష్టించిందని సులభంగానే గ్రహించవచ్చు. సరిహద్దులకు ఆవలినుంచే టీఆర్‌ఎఫ్‌కు ఆయుధాలు, డ్రగ్స్‌ అందుతున్న సంగతి కూడా నిర్ధారణ అవుతోంది. 

370వ అధికరణను రద్దుచేసి, జమ్మూ–కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టి నాలుగేళ్లు కావస్తోంది. అటు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి మెరుగు పడిందని, ఆర్థికంగా కోలుకోవటంతోపాటు భద్రతరీత్యా సురక్షితంగా ఉన్నదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. గతంతో పోలిస్తే కశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. నగరాలు, పట్టణాల్లో మిలిటెంట్ల ఆటలు సాగటం లేదు. కానీ అంతమాత్రానికే సంతృప్తి పడితే ప్రమాదకర పర్యవసానా లుంటాయని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. 

ఇటీవలి ఎన్‌కౌంటర్లను పరిశీలిస్తే బలగాలకు మార్గదర్శకాలిచ్చి వారిని నడిపించాల్సిన ప్రధాన అధికారులే బలవుతున్న సంగతి అర్థమవుతుంది. దాడులకు సీనియర్‌ అధికారులు నేతృత్వం వహించాలన్నది ఒకరకంగా మంచి నిర్ణయమే. ఇందువల్ల దాడుల్లో చురుగ్గా పాల్గొనేందుకు కింది స్థాయి జవాన్లు సంసిద్ధులవుతారు. అయితే దానికి తగినట్టుగా మిలిటెంట్లు మాటువేసిన ప్రాంతాన్ని నిర్ది ష్టంగా, నిర్దుష్టంగా నిర్ధారించుకోవటానికి అవసరమైన పరికరాలు వారికి అందుబాటులో ఉంచటం అతి ముఖ్యం. 

తగిన వ్యూహాన్ని రూపొందించటంలో, బలగాల్లో ఆత్మవిశ్వాసం నింపి, వారి నమ్మ కాన్ని గెల్చుకోవటంలో సీనియర్‌ల పాత్ర కీలకమైనది. అటువంటి అధికారులను కోల్పో వటం వల్ల భద్రతా బలగాలకు కలిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇవన్నీ శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించినవి. వీటికి సమాంతరంగా కశ్మీర్‌లో మళ్లీ రాజకీయ ప్రక్రియ ప్రారంభించటానికి అవసరమైన చర్యలు తీసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడ గొట్టాక అంతా మెరుగైందని బీజేపీ నేతలు చెబుతున్నా ఉగ్రవాదుల ఆగడాలు క్రమేపీ పెరుగుతున్న సంగతి కాదనలేనిది. 

పండిట్లపైనా, వలస వచ్చినవారిపైనా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయని గతంలో కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించిన బృందంలోని సభ్యురాలు రాధాకుమార్‌ ఇటీవలే గుర్తుచేశారు. కశ్మీర్‌లో నిరుద్యోగిత దేశ సగటుకన్నా మూడు రెట్లు ఎక్కువున్నదని ఆమె అంటు న్నారు. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం 2015 నుంచి మిలిటెన్సీకి దూరంగా ఉంది. అక్కడ గత ఏడెనిమిదేళ్లుగా చెప్పుకోదగిన ఘటనలు లేవు. అటువంటిచోట ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులు చేయగలిగారంటే ఆలోచించాలి. కశ్మీర్‌లో నిరుడు దాదాపు వందమంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరారని, వీరిలో చాలామంది టీఆర్‌ఎఫ్‌వైపు మొగ్గారని గణాంకాలు చెబు తున్నాయి. కనుక ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించటం, యువతలో నిరుద్యోగితను అరికట్టడం వంటి చర్యలు అవసరం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top