శాంతి అనిత్యం, యుద్ధమె నిత్యం | Sakshi
Sakshi News home page

శాంతి అనిత్యం, యుద్ధమె నిత్యం

Published Mon, Oct 16 2023 12:45 AM

Sakshi Editorial On Israel and Palestine war

బతుకు–చావు, యుద్ధమూ–శాంతి, ప్రేమ–విద్వేషం, కారుణ్యం–కర్కశత్వం... ఇవి పరస్పర వ్యతిరిక్తాలూ, ఒకదానికొకటి ఎంతో దూరాలూ అనుకుంటాం. కానీ, వాస్తవంలో ఎంత దగ్గరగా ఉంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బతుకును అంటిపెట్టుకునే చావు ఉంటుందని తెలిసినా; అది హత్యో, ఆత్మహత్యో, యుద్ధం పేరిట సామూహిక హత్యో కాక, సహజ మరణమైతే, ఆ దారి వేరు.

బతుక్కీ, చావుకీ మధ్య ఉంటుందనుకునే దూరాన్ని చెరిపివేస్తూ హఠాత్తుగా యుద్ధాలు బద్దలవుతాయి. ఇజ్రాయెల్‌–పాలస్తీనాల మధ్య పదిరోజుల క్రితం మొదలైన యుద్ధం ఇప్పటికే వేలసంఖ్యలో బతుకు దీపాలను ఆర్పివేసింది. బతుకునిచ్చే అమ్మతనాన్ని భక్తితో స్మరించుకుంటూ తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో అమ్మవారిని మన దగ్గర కొలుచుకోనున్న రోజుల్లోనే, అక్కడ ఆ మూల సమరనాదాలు, తల్లుల గర్భశోకాలు మిన్నంటడం వైచిత్రి. 

అమ్మ ఎక్కడైనా అమ్మే! అమ్మకు, అమ్మతనానికి ప్రాంత, మత, భాషాభేదాలు లేవు. చారిత్రకంగా చూసినా ఒకప్పుడు ప్రపంచమంతటా మొదటగా కొలుపులందుకున్నది అమ్మే; అయ్య కొలుపు ఆ తర్వాతే వచ్చింది. అమ్మ అంటే అన్నమూ, అభయమూ కూడా! అమ్మవారిని ధనలక్ష్మిగాను, ధాన్యలక్ష్మిగానూ కూడా భావించుకుంటాం.

అమ్మ చేతుల్లో వరికంకులను, చెరుకుగడలను అలంకరిస్తాం. అమ్మకు రకరకాల అన్నాలు ఇష్టమని చెప్పి నివేదించి ఆ అన్న ప్రసాదాలను మనమే ఆరగిస్తాం. మన దగ్గరే కాదు, ఒకప్పుడు అమ్మ ఆరాధన ఉన్న ప్రతిచోటా అమ్మను అన్నానికి ప్రతీకగానే కొలిచారు. అమ్మను బతుకమ్మ అనడంలోనే, పది కాలాలపాటు సుఖశాంతులతో బతికించే అమ్మ ఆశీస్సు ఉంది. 

అమ్మను కొలుస్తూనే అమ్మ మనసుకు దూరమై యుద్ధానికి దగ్గరవడమే మనిషి జీవితంలోని పెను విషాదం. తను దగ్గరవడమే కాదు; అన్నసాధనాలు ధరించిన అమ్మ చేతుల్లో కూడా ఆయుధాలు ఉంచి; అన్నపూర్ణను ఆయుధపూర్ణగా మలచిన చరిత్ర మనిషిది. మానవ చారిత్రక ప్రస్థానంలో ఇది ఎప్పుడు మొదలైందో కానీ, ఇప్పటికీ తనకు యుద్ధమే కావాలో శాంతే కావాలో తేల్చుకోలేని సందిగ్ధంలోనే మనిషి ఉన్నాడు.

యుద్ధానికీ, శాంతికీ మధ్య మనిషి చక్రభ్రమణం నిరంతరాయంగా సాగుతూనే ఉంది. యుద్ధమే ప్రధానమై శాంతి ఎంత అప్రధానమైందంటే,రెండు యుద్ధాల మధ్య తాత్కాలిక విరామాన్నే శాంతిగా నిర్వచించుకునే పరిస్థితికి వచ్చాం.

శాంతికాలంలో యుద్ధాన్ని జపించడం, యుద్ధకాలంలో శాంతిని స్మరించడం మనిషికి పరిపాటిగా మారింది. యుద్ధం కడుపున శాంతిశిశువును, శాంతి కడుపున యుద్ధశిశువును కోరుకోవడమూ అంతే నిత్యసత్యమైంది.

యుద్ధమొచ్చి శాంతిని చెదరగొడుతున్నట్టు భ్రమిస్తాం కానీ; వాస్తవానికి శాంతే మధ్య మధ్య వీచే మలయమారుతమై ప్రచండమైన యుద్ధపు వేడిగాడ్పులకు అవరోధ మవుతోందన్న ఎరుక మనకు లేదు. యుద్ధమే ఇక్కడ శాశ్వతంగా తిష్ఠవేసిన చుట్టమై; శాంతి ఎప్పుడైనా తొంగిచూసే అతిథి మాత్రమైంది.  

యుద్ధమనే ఎడారిలో శాంతీ, సుఖసంతోషాల ఒయాసిస్‌లను లియో టాల్‌స్టాయ్‌ నవల ‘యుద్ధమూ–శాంతీ’ అద్భుతంగా కళ్ళకు కట్టిస్తుంది. అమెరికా అంతర్యుద్ధం దరిమిలా ఎంత విధ్వంసం జరిగిందో, ఎందరి బతుకులు తలకిందులయ్యాయో మార్గరెట్‌ మిచెల్‌ నవల ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ అనితరసాధ్యంగా చిత్రిస్తుంది.

ఇంకా వెనక్కి, మహాభారతానికి వెడితే, యుద్ధాన్ని యజ్ఞంగా పేర్కొని పవిత్రీకరించడమే కాదు; రోగమొచ్చి చావడం కన్నా యుద్ధంలో చావడం పరమపుణ్యప్రదమని కీర్తించడం కనిపిస్తుంది. చివరికది అపార జననష్టంతో పాటు, యోధజాతి మొత్తం ఎలా తుడిచిపెట్టుకుపోయిందో ఒక మహావిలయ సదృశంగా చిత్రిస్తుంది. అందులోని స్త్రీపర్వం మొత్తం భర్తలను, కొడుకులను, తండ్రులను, సోదరులను కోల్పోయి గుండెలు బాదుకునే స్త్రీ నిర్భరశోకాన్ని కరుణ రసార్ద్రంగా వినిపిస్తుంది.

ఆ దుఃఖం గాంధారినోట శాపంగా మారి యాదవకుల విచ్ఛిత్తి రూపంలో మరో విధ్వంసం వైపు నడిపిస్తుంది. యుద్ధాన్ని ఆకాశానికెత్తిన మహాభారతమే, దాని విపరీత పర్యవసానాలను ఎత్తిచూపి సామాన్యులూ, మాన్యులైన మునులూ కూడా తీవ్రంగా గర్హించిన సంగతినీ నమోదు చేయడం విశేషం. యుద్ధపశ్చాత్తాపం జీవితాంతమూ ధర్మరాజును ఎంతగా వెన్నాడుతూ వచ్చిందంటే, అశ్వమేధయాగాన్ని తలపెట్టి అర్జునుని అశ్వం వెంట పంపిస్తూ, రాజులను ఓడించు కానీ ప్రాణనష్టం మాత్రం కలిగించవద్దని హెచ్చరించవలసి వచ్చింది. 

ప్రాంతాలు, మతాలు, సంస్కృతులు, భాషల మధ్య ఎక్కడా కనిపించనంత సాదృశ్యం యుద్ధాలలో కనిపిస్తుంది. యుద్ధరూపంలోని ఊచకోత ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. గ్రీకు మహాకవి హోమర్‌ చెప్పిన ఇలియడ్‌ అచ్చం మహాభారతానికి ప్రతిబింబంలా ఉంటుంది. అది చిత్రించిన ట్రాయ్‌ యుద్ధం చివరిలో కూడా అయినవారిని కోల్పోయిన  తల్లులు, భార్యల దుఃఖారావాలూ, ఆర్తనాదాలూ గుండెల్ని పిండివేస్తాయి.

ఇన్ని అనుభవాలున్నా; ఇన్నిన్ని శోకసముద్రాలు కట్టలు తెంచుకున్న ఉదాహరణలు కళ్ళముందున్నా మనిషిలో యుద్ధోన్మాదం ఉపశమించలేదు; సమర మోహం తీరలేదు; రుధిరదాహం చల్లారలేదు. శాంతియుతంగా జీవించడం మనిషి ఇప్పటికీ నేర్చు కోలేదు. యుద్ధంలో చివరికి అటూ ఇటూ విజితులే తప్ప విజేతలెవరూ ఉండరనీ; మిగిలేవి శవాలూ, జీవచ్ఛవాలు మాత్రమేనన్న నిష్ఠురసత్యాన్ని మనిషి ఇప్పటికీ జీర్ణించుకోలేదు. బతుకు నిచ్చే, బతకనిచ్చే అమ్మతత్వానికి దూరంగా చావు దిశగా ఈ చీకటి ప్రస్థానం ఎంతకాలం?! 

Advertisement
 
Advertisement