
కుట్రలు తప్ప తెలియనివాడికీ, వంచనతప్ప మరేదీ చేతగానివాడికీ మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించటం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో నిరుడు గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలనూ, గూండాలనూ ప్రోత్సహించి హత్యలకూ, దౌర్జన్యాలకూ తెగబడటంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. రెడ్ బుక్‌లో సరికొత్త అంకం లిక్కర్ స్కాం!
ఆ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను జైలుపాలు చేసిన ప్రభుత్వం, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చే సింది. విద్యార్థి రాజకీయాల నాటినుంచీ తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవటానికే ఆయన కుమారుడు మిథున్‌రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం.
2014–19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకూ, సన్నిహితులకూ నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవటానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేనిచోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ‘ఆత్రగాడికి బుద్ధి మట్టు’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ఎదుటివారిపై బురద చల్లి ఏదోరకంగా వారికి అవినీతి మకిలి అంటి ద్దామని తండ్రీ కొడుకులు పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన మద్యం విధానంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి అనుమతినిచ్చిన వైనం లేదు. సరిగదా... అంతకుముందు టీడీపీ ఏలుబడిలో చెలరేగిన మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి, మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మద్యం విక్రయ వేళల్ని కుదించారు. బాబు హయాంలో తామర తంపరగా పెరిగిపోయి, ఊరూవాడా జనం మూల్గులు పీల్చిన బెల్ట్ షాపుల జాడే లేకుండా చేశారు.
పర్మిట్ రూమ్‌ల దందా అడ్డుకున్నారు. ఆ విధానం కారణంగా తమ అక్రమ సంపాదన నిలిచిపోగా లబోదిబోమని అప్పట్లో గగ్గోలు పెట్టింది తెలుగు దేశీయులే. మద్యపాన ప్రియుల్ని తగ్గించటానికి ఇన్ని చేసిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందట! అందులో భారీమొత్తం డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్‌కి తరలిపోయిందట!! ఇంగితజ్ఞానం వున్నవారెవరికైనా ఇందులోని కపట నాటకం అర్థమవుతుంది.
బురద చల్లటానికి వీళ్లకంటూ ఒక పద్ధతుంటుంది. ముందు ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు వండివార్చుతారు. ఏదో జరిగిపోయిందంటూ ఆ మీడియా పెడబొబ్బలు పెడుతుంది. వాటిని ఆధారం చేసుకుని కేసులు రూపొందుతాయి. వాటిపై దర్యాప్తుకంటూ సీఐడీ ఆధ్వర్యాన సిట్ ఏర్పాటవుతుంది. ఏం చేయడానికీ పాలుబోని సిట్... ఎల్లోమీడియా తప్పుడు కథనాలనే రీసైక్లింగ్ చేసి చార్జిషీట్లుగా రూపొందిస్తుంది. అవి న్యాయస్థానం మెట్లెక్కకుండానే ఎల్లోమీడియాకు చేరతాయి.
తమకు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఆ మీడియా పతాక శీర్షికలతో పండగ చేసుకుంటుంది. ఇంతకూ జనంలో ఇసుమంతైనా విశ్వసనీయత లేని ఈ మీడియాకు ‘విశ్వసనీయంగా’ చెప్పేవారెవరు? ఇంకెవరు... తండ్రీకొడుకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వీర విధేయ అధికారులూ! తమ కథనాలే చార్జిషీట్లుగా అవతారమెత్తాయని, అవే న్యాయస్థానాల పరిశీలనకు పోతున్నాయని తెలియనట్టు, కొత్తగా ఆ రోజే బయట పడినట్టు ఎల్లోమీడియా వికృత విన్యాసాలకు తెగబడుతుంది. 13 వేల ఫోన్‌కాల్స్‌ట, వందలాది వాట్సాప్ చాటింగ్‌లట. దుబాయ్‌లో జల్సాలట. జనం నవ్విపోతారన్న వెరపే లేదు. వారిపట్ల జవాబుదారీతనం అసలే లేదు.
జనానికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాదికాలం మాయమాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కారు ప్రజల దృష్టి మళ్లించటానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం దీని ఆంతర్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అంతేవాసులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణ కాదు.
సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విప్పిచెప్పిన లోగుట్టు. గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా సంతకాలు చేసిన బాబు నిర్వాకం కారణంగా ఖజానాకు 2015–19 మధ్య రూ. 5,200 కోట్ల మేర గండి పడిందని ఆ సంస్థ బయటపెట్టింది. ఇదిగాక ఎంఆర్‌పీ కన్నా 20 శాతం అధిక ధరలకు విక్రయించి మరో రూ. 20,000 కోట్లు కొల్లగొట్టారని బయటపడటంతో 2023లో కేసు నమోదైన కారణంగా బాబు, ఆయన అనుచరగణం బెయిల్ కూడా తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకొచ్చాక ఈ దోపిడీ మరింత విశృంఖలంగా పెరిగింది.
తమ మద్యం కుంభకోణాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా కేసులుపెట్టి నడిబజారులో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే తాజా కేసు. జగన్ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫిర్యాదుచేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలూ జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా వున్నదని సీసీఐ తేల్చిచెప్పింది. ఒకసారి ఛీకొట్టించుకున్నా బుద్ధిరాని పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెర లేపింది. ఈ ప్రహసనాన్ని జనం నిస్సందేహంగా తిప్పికొడతారు.