ఇవేం కష్టాలు దేవుడా! | - | Sakshi
Sakshi News home page

ఇవేం కష్టాలు దేవుడా!

Nov 16 2026 12:14 AM | Updated on Nov 16 2026 12:14 AM

ఫ రత్నగిరిపై భక్తులకు ఇబ్బందులు

ఫ క్యూలైన్లలో అందని తాగునీరు

ఫ కంపార్ట్‌మెంట్లలో తిరగని ఫ్యాన్లు

ఫ టిక్కెట్‌ కౌంటర్ల వద్ద కానరాని

సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌

అన్నవరం: ఫ్యాన్లు తిరగక ఉక్కబోత.. తాగునీరు అందక తీరని వెత.. ఇలా ఒకటేమిటి అనేక సమస్యలు రత్నగిరికి వచ్చే భక్తులను వేధించాయి. ‘ఇవేం కష్టాలు దేవుడా’ అంటూ వారు నిట్టూర్పు వదలడం కనిపించింది. అన్నవరంలోని వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి కార్తిక మాసంలో రోజూ వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తారని తెలిసినా, ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. మూడు నెలల ముందు నుంచి కసరత్తు ప్రారంభించినా అవస్థలు షరామామూలే అన్నట్లు తయారైంది. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు రత్నగిరికి వచ్చారు. వారంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనానికి పడమటి రాజగోపురం లోపల ఉన్న క్యూ నుంచి కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను పంపిస్తున్నారు. అక్కడ భక్తులకు తాగునీరు ఏర్పాట్లు లేవు. లిఫ్ట్‌ వద్ద, తూర్పురాజగోపురం ప్రారంభంలో మాత్రమే నీరు అందిస్తున్నారు. గతంలో క్యూ లైన్‌ పొడవునా మొబైల్‌ క్యాన్లలో భక్తుల వద్దకు వెళ్లి మంచినీరు అందించేవారు. ఇప్పుడు అలా చేయకపోవడంతో ఇబ్బంది ఎదురైంది. అదే విధంగా రథపాత్‌ వద్ద కంపార్ట్‌మెంట్లలో మంచినీటి సరఫరా లేదు. అక్కడ క్యూలో భక్తులు కూర్చునేందుకు అక్కడక్కడ స్టీలు బెంచీలు ఉన్నాయి, ఆ బెంచీలపై వాటర్‌ క్యాన్‌లు ఉంచి సేవాదళ్‌ సభ్యులు మంచినీటి సరఫరా చేసే వీలున్నా అధికారులు ఆ ఏర్పాట్లు చేయలేదు. ఇదిలాఉంటే కంపార్ట్‌మెంట్లలో చాలాచోట్ల ఫ్యాన్లు తిరగడం లేదు. భక్తులకు గాలాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. రోశయ్య మండపంలో ప్రసాదం కౌంటర్లలో ప్రసాదాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ప్రసాదం కౌంటర్లను పశ్చిమ రాజగోపురం వద్ద కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఆ విషయం తెలియజేస్తే రద్దీ తగ్గుతుంది.

సిగ్నల్స్‌ లేక ఇబ్బంది : సేవా టిక్కెట్లు కోసం డిజిటల్‌ పేమెంట్లు చేసేందుకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేక ఇబ్బంది ఎదురవుతోంది. గతంలో ఇదే విషయమై ‘సాక్షి’ దినపత్రికలో పలు కథనాలు రాగా, ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్‌ నగదుకు కూడా అనుమతి ఇచ్చినా అధికారులు మాత్రం అవగాహన కల్పించడం లేదు. ఈ మేరకు ఎక్కడ బోర్డులు కూడా లేవు. దేవస్థానంలో ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలు ఉన్నా, వాటిలో సరపడా నగదు లేక ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానంలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. పద్మావతి సంస్థ నిర్వహిస్తున్న శానిటేషన్‌ మొక్కుబడిగా సాగుతోంది.

దండోప‘దండాలుగా’..

కార్తిక సోమవారం సత్యదేవుని దర్శించేందుకు ఆదివారం రాత్రి నుంచే రత్నగిరికి తండోప తండాలుగా భక్తులు తరలివచ్చారు. రాత్రికే సుమారు 15 వేల మంది చేరుకున్నారు. వీరంతా రామాలయం వద్ద ఉన్న విశ్రాంతి మండపం, పశ్చిమ రాజగోపురం వద్ద లారెన్స్‌ విశ్రాంతి షెడ్డులో, దేవస్థానంలోని మూడు డార్మెట్రీలలో సేద తీరారు. దీంతో తెల్లవారు జామున ఒంటి గంట నుంచి సత్యదేవుని వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనాలు ప్రారంభిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement