అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో కార్తిక పౌర్ణిమ సందర్భంగా ఈ నెల 24న నిర్వహించనున్న గిరి ప్రదక్షిణకు జాతీయ రహదారి నుంచి పుష్కర కాల్వ రోడ్డు వరకు ఉన్న సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారి ఇరుకుగా ఉండడంపై ‘సాక్షి’లో ఈ నెల ఆరో తేదీన ప్రచురితమైన ‘దారి చూపు స్వామి’ కథనానికి గత సోమవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పందించి సంబంధిత అధికారులతో కలసి పరిశీలించిన విషయం తెలిసిందే. వారి సూచనల మేరకు సర్వీస్ రోడ్డు వెడల్పు చేసి, కొబ్బరి తోట వైపు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈఈ రామకృష్ణ తెలిపారు.
అన్నవరం డోనార్ స్కీమ్‌కు రూ.5 లక్షల విరాళం
అన్నవరం: తెలంగాణలోని ఖమ్మం పట్టణం, సాయినగర్‌కు చెందిన దాత ఎల్‌వీఎన్‌ఎస్ భూషణరావు, రమాదేవి దంపతులు స్థానిక సత్యదేవుని ఆలయంలో డోనార్ కాటేజీ స్కీమ్‌కు ఆదివారం రూ.ఐదు లక్షల విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని దేవస్థానంలో నిర్మాణంలో ఉన్న సీతారామసత్రంలో ఒక గదికి అయ్యే నిర్మాణ వ్యయంగా భావించి, తమకు డోనార్ కాటేజీ స్కీం కింద లభించే అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. వీరికి సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, డోనార్ కాటేజీ స్కీం బాండ్‌ను సీనియర్ అసిస్టెంట్ ఎం.గణపతిరావు అందచేశారు. అలాగే ఓ భక్తుడు స్వామివారి నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం సమర్పించారు.
లారీ ఢీకొని యువకుడి మృతి
చింతూరు: స్థానిక అటవీ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ పురం మండలం చింతరేగుపల్లికి చెందిన ముత్యాల రాజ్‌కుమార్ (22) మృతిచెందాడు. కుటుంబ సభ్యులతో పొల్లూరులోని దారాలమ్మ గుడికి వెళ్లేందుకు స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో ఒడిశా నుంచి వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. అనంతరం లారీ టైరు రాజ్‌కుమార్ తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్ ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.
ఒక్కగానొక్క కొడుకు దూరమై..
రాజ్‌కుమార్ తల్లిదండ్రులకు అతడితో పాటు సోదరి ఉంది. ఆమెకు వివాహం కాగా రాజ్‌కుమార్ తండ్రి దుర్గారావు ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. రాజ్‌కుమార్ కౌలుకు పొలం తీసుకుని కొద్దిపాటి వ్యవసాయం చేయడంతో పాటు తల్లితో కలిసి కూలి పనులకు వెళ్తుంటాడు. ఇటీవలే తండ్రి దుర్గారావు ఆటో నడుపుతూ ప్రమాదానికి గురవడంతో ప్రస్తుతం ఆయన ఇంట్లోనే వుంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ భారాన్ని అతనే మోస్తున్నాడు. ఈ క్రమంలో దారాలమ్మ దర్శనం కోసం స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై పొల్లూరు వెళుతూ చింతూరులో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


