ఫ యువకుడి మృతిపై తల్లి ఫిర్యాదు
ఫ రెండు రోజుల వ్యవధిలో
వివాహిత ఆత్మహత్య
ఫ ఖననం చేసిన యువకుడి మృతదేహానికి
నేడు పోస్టుమార్టం
ఫ ద్వారకాతిరుమల మండలం
ఎం.నాగులపల్లిలో ఘటనలు
ద్వారకాతిరుమల: ఓ యువకుడి అనుమానాస్పద మృతి.. అదే రోజు ఓ వివాహిత పుట్టింటికి వెళ్లి రెండు రోజుల తర్వాత ఆత్మహత్యకు పాల్పడటం.. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడి మృతిపై అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖననం చేసిన యువకుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. స్థానికుల కధనం ప్రకారం. మండలం ఎం.నాగులపల్లికి చెందిన చవటపల్లి రవితేజ (24) అవివాహితుడు. సొంత ట్రక్కు ఆటో నడుపుతూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న సాయంత్రం భీమవరానికి కిరాయికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరుసటి రోజు ఏడో తేది తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కుటుంబ సభ్యులకు కనిపించాడు. అతడి మృతికి గల కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అదేరోజు మృతదేహాన్ని ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. నాలుగు నెలల క్రితం ఎం.నాగులపల్లికి చెందిన ఓ యువకుడిని వివాహం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలానికి చెందిన మహిళ రవితేజ మృతిచెందిన రోజు సాయంత్రం తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఈ నెల 9న ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంత్యక్రియలు కూడా పుట్టింటి వద్దే నిర్వహించారు. ఒకే గ్రామానికి చెందిన వారిరువురు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో చర్చనీయాంశంగా మారింది. రవితేజ మృతి ఆత్మహత్య కాదని, హత్య అయ్యుంటుందని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అతని తల్లి ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ రవితేజ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఖననం చేసిన రవితేజ మృతదేహాన్ని సోమవారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. రవితేజకు తల్లిదండ్రులు రమణ, నాగరాజుతో పాటు అన్నయ్య, అక్క ఉన్నారు.


