అంగన్‌వాడీ కేంద్రానికి గడియ.. | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రానికి గడియ..

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

ఫ బయటకు వెళ్లిన అంగన్‌వాడీ సిబ్బంది

ఫ భయాందోళన చెందిన చిన్నారులు

సీతానగరం: పసి పిల్లలకు రక్షణగా నిలవాల్సిన అంగన్‌వాడీ కేంద్రం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. సీతానగరం అంగన్‌వాడీ సెంటర్‌– 4లో చిన్నారుల ప్రాణాలను గాలికి వదిలేసి, సిబ్బంది ప్రవర్తించిన తీరు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన సీతానగరం దేవాంగుల వీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం జరిగింది. అంగన్‌వాడీ టీచర్‌, ఆయా ఇద్దరూ కలసి కేంద్రంలోని చిన్నారులను సమీపంలో జరుగుతున్న ఒక అన్నదాన కార్యక్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ పిల్లలకు భోజనాలు పెట్టించిన అనంతరం తిరిగి కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే, అక్కడితో తమ పని అయిపోయిందన్నట్టుగా, పసి పిల్లలను కేంద్రం లోపల ఉంచి బయట ఇనుప గేటుకు గడియ పెట్టి సిబ్బంది ఇద్దరూ అక్కడి నుంచి భోజనాలు చేయడానికి తిరిగి అన్నదాన కార్యక్రమానికి వెళ్లిపోయారు.

బోనులో బంధించినట్టు..

బోనులో బంధించిన పక్షుల్లా పసిపిల్లలు ఇనుప చువ్వల మధ్య నుంచి ఆవేదనతో బయటకు చూస్తున్న చూపులు ప్రతి ఒక్కరి గుండెలనూ పిండేశాయి. అన్నదాన వద్ద భోజనం చేశామని, టీచరు గారు తీసుకువెళ్లారని, వారే లోపల ఉంచారని పిల్లలు చెప్పడం గమనార్హం. లోపల ఉన్న సమయంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ పసి పిల్లల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితి వస్తే లోపల ఉన్న పిల్లలు బయటకు ఎలా రాగలుగుతారనే కనీస స్పృహ కూడా లేకుండా ప్రవర్తించిన అంగన్‌వాడీ టీచర్‌, ఆయాల వైఖరిని తప్పుపడుతున్నారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ పిల్లలను బయట భోజనాలకు తీసుకువెళ్లరాదని, పిల్లలను లోపల ఉంచి గడియ పెట్టిన వీడియో ఆధారంగా చేసుకుని, పీడీ దృష్టిలో ఉంచి అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజ్‌ నోటీసు ఇచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement