ఫ అన్నదానం, ప్రసాదం తయారీ
సామగ్రికి కొత్త టెండర్లు
ఫ 25 నుంచి 30 శాతం రేట్లు
అధికంగా దాఖలు
ఫ ఖరారుపై 30న ట్రస్ట్‌బోర్డు
సమావేశంలో చర్చ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీరవెంకట సత్యనారాయణ స్వామివారికీ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల భారం తప్పేట్టు లేదు. దీనికి ప్రధాన కారణం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేవస్థానానికి వివిధ నిత్యావసర వస్తువుల సరఫరాకు పిలిచిన టెండర్లలో గతంలో కన్నా రేట్లు సుమారు 25 శాతం నుంచి 30 శాతం అధికంగా టెండర్లు దాఖలైనట్టు సమాచారం. ఏటా ఈ కొనుగోళ్లకు దేవస్థానం సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఈ సారి పెరిగిన ధరలతో మరో రూ.ఐదు కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. పంచదార, యాలకులు, గోధుమల ధరలతో సత్యదేవుని ప్రసాదం తయారీ వ్యయం పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా అన్నదాన పథకానికి ఆరు నెలలుగా సరఫరా అయిన బియ్యం వల్ల అన్నం చల్లారితే బాగోడం లేదనే విమర్శ వచ్చింది. దాంతో ఈ సారి సన్న బియ్యం కొనుగోలుకు టెండర్ పిలిచారు. గతంలో ఆర్జెల్ బియ్యం కిలో రూ.42 కాగా, ప్రస్తుతం సన్న బియ్యం సరఫరాకు కిలో కూ.54 నుంచి రూ.56 మధ్య సరఫరాదారుడు ధర కోట్ చేసినట్టు సమాచారం. అదే విధంగా వంట నూనె, వ్రతాలలో ఉపయోగించే దీపారాధన నూనెల ధరలు కూడా టెండర్లలో పెరిగినట్టు సమాచారం. ఈ ధరలతో సత్యదేవుని నిత్యాన్నదాన ప్రసాదంలో భోజనం తయారీ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి ఆరు నెలలకొకసారి దేవస్థానంలో ఉపయోగించే నిత్యావసర వస్తువులు అంటే బియ్యం, పప్పులు, నూనె, కందిపప్పు, స్వామివారి గోధుమ నూక ప్రసా దం తయారీలో ఉపయోగించే పంచదార, నెయ్యి, గోధుమలు టెండర్ కం వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈ సారి ఆక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2027 మార్చి 31 వరకు వీటిని సరఫరా చేయడానికి పిలిచిన టెండర్ గడువు సెప్టెంబర్ మూడో తేదీతో ముగిసింది. ఆ తరువాత ఆయా టెండర్లు ఓపెన్ చేసి తక్కువ ధర కోట్ చేసిన వారి వివరాలతో నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను ఈ నెల 30న జరగనున్న దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో పరిశీలించి ఖరారు చేయనున్నారు.
ఏటా రూ.25 కోట్లతో కొనుగోలు
అన్నవరం దేవస్థానంలో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఏటా సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిలో సింహభాగం సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులు, గ్యాస్‌కు రూ. 15 కోట్లు అవుతుంది. నిత్యాన్నదాన పథకంలో, స్వామివారి నివేదన శాలలో బియ్యం, కందిపప్పు, పామాయిల్, కూరగాయల కొనుగోళ్లకు సుమారు రూ.మూడు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అదే విధంగా స్వామివారి వ్రతాల విభాగంలో ఉపయోగించే దీపాల నూనె, అగరవత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ, గావంచాలు, జాకెట్ ముక్క ల కొనుగోలుకు మరో రూ.ఐదు కోట్లు అవుతోంది. దేవస్థానంలో ఇతర అవసరాల కోసం మరో రూ.రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు. ధరలు పెరగడంతో దేవస్థానానికి మరో రూ.ఐదు కోట్లు అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ట్రస్ట్‌బోర్డు నిర్ణయం మేరకు ఖరారు
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేవస్థానానికి అవసరమైన నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి టెండర్లు పిలిచాం. మార్కెట్‌లో కూడా ప్రస్తుతం వీటి ధరలు పెరగిన విషయం తెలిసిందే. దాంతో సహజంగానే గతంలో కన్నా ఎక్కువగానే రేట్లు టెండరుదారులు కోట్ చేశారు. ఈ టెండర్లను 30వ తేదీ జరుగునున్న ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి సభ్యుల నిర్ణయం మేరకు ఖరారు చేస్తాం. –నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


