తుని: జిల్లా స్థాయి జూడో పోటీల్లో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తుని కేజీబీవీ ప్రిన్సిపాల్ అమృతవాణి సోమవారం తెలిపారు. అండర్–14 కేటగిరీ 32 కిలోల విభాగంలో ఎస్.హేమ దుర్గారాణి, 36 కిలోల విభాగంలో ఎం.సారిక, వి.హేమలత, 40 కిలోల విభాగంలో ఎల్.లోష్మిత ప్రతిభ చూపారు. అండర్–17 కేటగిరీ 36 కిలోల విభాగంలో ఎస్.జ్యోతి లావణ్య, జి.దీపిక, అండర్–19 కేటగిరీ కిలోల విభాగంలో యు.దేవయానిలు ప్రథమ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని చెప్పారు. జూడోలో రాణిస్తున్న విద్యార్థినులను, కోచ్‌లను అమృతవాణి అభినందించారు.
ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బంగారురాజు
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కాట్వా) రాష్ట్ర అధ్యక్షుడిగా కొంతమూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు గోపిశెట్టి బంగారురాజు నియమితులయ్యారు. ఒంగోలులో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో 14 జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోతంశెట్టి రమేష్ (అన్నమయ్య జిల్లా), రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా మజ్జి ఈశ్వరరావు (విశాఖ జిల్లా)లను సంఘ వ్యవస్థాపకుడు కొల్లా నారాయణరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరు ఫణీంద్ర కుమార్ ప్రకటించారన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఇంటి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చోడిశెట్టి బాలాజీ వరప్రసాద్, రాష్ట్ర అదనపు కార్యదర్శిగా మండపాక భాస్కరరావులు నియమితులయ్యారన్నారు.
పురుగు మందు
తాగి కూలీ మృతి
తాళ్లపూడి: పురుగు మందు తాగిన ఓ కూలీ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గజ్జరంలో జరిగింది. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. గజ్జరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి రమేష్ (48) రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం రమేష్ పనికి వెళ్లకుండా ఇంటికి వచ్చి మద్యం కోసం డబ్బు అడగగా, భార్య వరలక్ష్మి తన దగ్గర డబ్బు లేదని చెప్పింది. దీంతో ఆమెను దూషించి బయటకు వెళ్లిన అతను, కొంతసేపటికి తిరిగి వచ్చి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ తర్వాత నిద్రలేచి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో భార్య ఆరా తీయగా, తనను మందలించినందుకు మనస్థాపంతో బయటకు వెళ్లి మద్యంలో పురుగు మందు కలుపుకొని తాగినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ కె.ముదయ్య తెలిపారు.
పశువుల్లంకలో చోరీ
ఐ.పోలవరం: పశువుల్లంక గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మేకలు, పాడి పశువులను విక్రయించగా వచ్చిన రూ.3.90 లక్షలను రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇంట్లో పెట్టినట్లు గంగుల ఏడుకొండలు తెలిపారు. ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువా తాళం తీసి ఆ నగదును ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును ఎస్‌ఐ రవీంద్రబాబు దర్యాప్తు చేస్తున్నారు.


