ఫ ఒకరి కోసం గాలిస్తే మరొకరి
మృతదేహం లభ్యం
ఫ కాలికి గొలుసు కట్టి ఉండడంతో
అనుమానాలు
ఫ ఆ దిశగా పోలీసుల దర్యాప్తు
చింతూరు: ఒకటి అనుకుంటే మరొకటి కాలికి తగిలింది.. గల్లంతైన ఓ యువకుడి ఆచూకీ కోసం వాగులో గాలిస్తుండగా, అక్కడ మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది. ఆ మృతదేహం కాలికి లావుపాటి గొలుసు ఉండడం మిస్టరీగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం తులసిపాక సమీపంలోని ఘాట్ రోడ్‌లో గల వ్యూ పాయింట్ వద్ద ఆదివారం ఓ యువకుడు గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ యువకుడి ఆచూకీ కోసం సోమవారం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం వాగులో గాలిస్తున్న సమయంలో వ్యూ పాయింట్‌కు అర కిలోమీటరు దూరంలో నీటిలో ఓ గుర్తు తెలియని మృతదేహం వారి కంట పడింది. ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ గోపాలకృష్ణ, ఎస్సైలు నాసిర్ హుస్సేన్, సంతోష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కాగా ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్న ఆ మృతదేహం ఎడమ కాలికి లావుపాటి గొలుసు కట్టి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ మృతదేహాన్ని మతిస్థిమితం లేని వ్యక్తిదిగా అనుమానిస్తున్నామని, నాలుగైదు రోజుల క్రితం మృతి చెందినట్లుగా ఉందని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. సదరు వ్యక్తి నీటి ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో వాగులో పడి మృతిచెంది ఉండవచ్చని, వాగులోని చెట్టుకు చొక్కా తగిలి మృతదేహం అక్కడ నిలిచిపోయిందని ఆయన వివరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
లభ్యంకాని యువకుడి ఆచూకీ
ఆదివారం వ్యూ పాయింట్ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బుంగా బాలవందనం (18) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విహారయాత్రకు 20 మంది బస్సులో వ్యూ పాయింట్ వద్దకు రాగా వారిలో శ్యాం అనే బాలుడు నీటిలో కొట్టుకు పోతుండగా, అతనిని కాపాడేందుకు బాలవందనం నీటిలో దూకాడు. మేనత్త కొడుకై న శ్యామ్‌ను సురక్షితంగా కాపాడి తాను మాత్రం గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం నుంచి అతను గల్లంతైన ప్రాంతంతో పాటు తులసిపాక సమీపంలోని వంతెన వరకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు పోలీసులు ఎంత గాలించినా సాయంత్రం వరకు ఆచూకీ లభ్యం కాలేదని మోతుగూడెం ఎస్సై నాసిర్‌హుస్సేన్ తెలిపారు.


