మాటల్లేవ్‌.. మాట్లాడాల్లేవ్‌..! | - | Sakshi
Sakshi News home page

మాటల్లేవ్‌.. మాట్లాడాల్లేవ్‌..!

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

వారి ఆకలి కేకలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు.. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కనీసం స్పందించడం లేదు.. ఏళ్లకాలంగా పదోన్నతులు లేక, వచ్చే జీతం సరిపోక, ఇలా ఒకటేమిటి అనేక సమస్యలతో సతమతమవుతూ నిరవధిక సమ్మెకు దిగినా ప్రభుత్వం కనీసం నోరుమెదపడం లేదు.. తమను వెట్టిచాకిరీ చేయించుకుని ఇలా వదిలేశారంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)లు మండిపడుతున్నారు.

కపిలేశ్వరపురం: ఎండైనా.. వానైనా కాలినడకన సర్వేలు, పన్నుల వసూలు, అధికారుల పర్యటనల్లో, ప్రమాదాల సమయాల్లో విశేష సేవలందిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ)ను చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. కేవలం రూ.10,500 వేతనంగా పొందుతున్న వీఆర్‌ఏలు కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారింది. చేసేది లేక ఏపీ వీఆర్‌ఏ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సుమారు రెండు వారాలుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ నెల 23న పి.గన్నవరం వైనతేయ నదీ పాయలోనూ, కొత్తపటలోనూ, కోరంగిలోనూ జలదీక్షలు చేశారు.

గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇంతే

వీఆర్‌ఏలకు అర్హత ఆధారంగా వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించాలంటూ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వద్ద వీఆర్‌ఏలు పలుమార్లు డిమాండ్‌ చేశారు. అందుకోసం అనేకసార్లు విజ్ఞప్తులు, ఉద్యమాలు సైతం చేసినా పరిష్కారం దక్కలేదు. 2015 ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. అదే ఏడాది నవంబర్‌ 2 నుంచి 78 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసినా, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

వీఆర్‌ఏల డిమాండ్లు ఇవీ...

వేతన స్కేల్‌ అమలు చేయాలి, నామినీలుగా పని చేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలి.

వీఆర్‌ఏల వీఆర్వో, వాచ్‌మెన్‌, అటెండర్‌ పదోన్నతుల శాతాన్ని 30 శాతం నుంచి 70 శాతానికి పెంచాలి.

కారుణ్య నియామకాలను అమలు చేయాలి.

రీసర్వే, ఎన్నికల విధులు, వాచ్‌మెన్‌, పన్ను వసూలు తదితర అదనపు పనుల నుంచి మినహాయించాలి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో పదోన్నతులు

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీఆర్‌ఏల సమస్యలను విన్నారు. 2015లో విజయవాడలో వీఆర్‌ఏల నిరసన దీక్షా శిబిరం వద్దకు నేరుగా వెళ్లి మద్దతు పలికి తమ ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2019లో అధికారం చేపట్టిన 8 నెలల్లోనే వీఆర్‌ఏల సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. 2020 జనవరి 27న అర్హతగల వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పిస్తూ జీఓ విడుదల చేశారు. జనవరి 1 నాటికి వీఆర్‌ఏగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఇంటర్‌ విద్యార్హతగా ఉన్న వీఆర్‌ఏలకు గ్రేడ్‌–2 వీఆర్వోలుగా పదోన్నతి కల్పించడం ఆ జీఓ సారాంశం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆనాడు 2,670 మంది వీఆర్‌ఏలు ఉండగా, ఇందులో సుమారు 700 మంది వీఆర్వోలయ్యారు. రెండేళ్ల పాటు ప్రొబిషన్‌తో నెలకు రూ.15 వేల వేతనం తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్‌ వీఆర్వోలకు చెల్లించే వేతనాలు పొందారు. 2023 సెప్టెంబర్‌లో ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఏపీజీఈఎఫ్‌) విజ్ఞప్తి మేరకు రూ.300గా ఉన్న డీఏ రూ.500కు పెంచి వీఆర్‌ఏలకు అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేశారు. ప్రస్తుత కూటమి నాయకులు కనీసం వీఆర్‌ఏల డిమాండ్లను పట్టించుకోవడంలేదు.

16 నుంచి వీఆర్‌ఏల నిరవధిక సమ్మె

పట్టించుకోని చంద్రబాబు సర్కారు

గత టీడీపీ ప్రభుత్వంలోనూ అదే వైఖరి

వీఆర్వోలుగా పదోన్నతి కల్పించిన

ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement