ధవళేశ్వరం: స్థానిక కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 9.80 అడుగులకు నీటిమట్టం చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతానికి సంబంధించి భద్రాచలం వద్ద 43.10 అడుగులకు నీటిమట్టం చేరింది.
వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన
రాయవరం: న్యాయమైన డిమాండ్ల సాధనకు గ్రామ రెవెన్యూ సహాయకులు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 12వ రోజుకు చేరుకుంది. రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు ఖండవిల్లి రవిబాబు, రాయవరం మండల వీఆర్‌ఏ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రమళ్ల దుర్గారావు, వేమగిరి విక్కీల ఆధ్వర్యంలో రాయవరంలో వీఆర్‌ఏలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రవిబాబు, దుర్గారావు, విక్కీలు మాట్లాడుతూ 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చిన తర్వాతే తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. కేవలం రూ.10,500తో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తామన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, పదోన్నతులు కల్పించాలని, నామినీగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా ప్రమోట్ చేయాలనే డిమాండ్లతో నినాదాలు చేశారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహానికి వారంతా వినతిపత్రం అందజేశారు.
కేదార్‌నాఽథ్‌లో చిక్కుకున్న
రాయవరం వాసులు
రాయవరం: గ్రామానికి చెందిన పీవీ కృష్ణారెడ్డి, రిమ్మలపూడి సుబ్బారావుచౌదరి కేదార్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా, మార్గం మధ్యలో చిక్కుకున్నారు. కేదార్‌నాథ్ యాత్ర మార్గం మధ్యలో కొండచరియలు విరిగి పడడంతో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. రాయవరం గ్రామానికి చెందిన పీవీ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని ఫోన్‌లో స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ నెల 19న హైదరాబాద్ నుంచి ఓ ప్రైవేట్ ట్రావెలర్స్‌లో 45 మంది బృందంతో కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లినట్లు వివరించారు. 26న కేదార్‌నాఽథ్‌లో దర్శనం ముగించుకుని డోలిలో తిరుగు ప్రయాణం చేస్తుండగా, ఆదివారం సాయంత్రానికి గౌరీకుంద్ అనే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉందన్నారు. రెండు కిలోమీటర్ల దూరంలో గమ్యస్థానం చేరుకోవాల్సిన సమయంలో కొండచరియలు విరిగి పడడంతో మార్గం మూసుకుని పోయినట్లు తెలిపారు.
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా భాద్రపద మాసంలో పెద్దగా భక్తులు రారు. దీనికితోడు ఆర్నాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో భక్తులు నామమాత్రంగా వచ్చారు. శనివారం నుంచి వర్షాలు తగ్గడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సత్యదేవుడిని దర్శిస్తున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు రత్నగిరికి తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయం, క్యూ లైన్లు, వ్రత మండపాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. 1500 వ్రతాలు జరిగాయని, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు. సత్యదేవుని అన్నప్రసాదం ఐదువేల మంది స్వీకరించారని అధికారులు చెప్పారు.


