దేవరపల్లి: 2025–26 పంట కాలంలో రాష్ట్రంలో రైతులు అనధికారిక, అదనంగా పండించిన ఫ్ల క్యూర్డ్ వర్జీనియా (ఎఫ్‌సీవీ) పొగాకు విక్రయాలకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. నమోదిత రైతులు ఉత్పత్తి చేసిన అధికారిక, నమోదిత రైతులు ఉత్పత్తి చేసిన అదనపు పొగాకును పొగాకు బోర్డు అధీకృత వేలం కేంద్రాల ద్వారా విక్రయించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పొగాకు బోర్డు చట్టం, 1975లోని సంబంధిత నిబంధనలను సడలిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో సాధారణ అనుమతికి మించి ఉత్పత్తి చేసిన నమోదిత రైతులు, అలాగే నమోదు కాని రైతులు ఉత్పత్తి చేసిన అనధికారిక ఎఫ్‌సీవీ పొగాకును బోర్డు అనుమతించిన వేలం వేదికలపై విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా అదనపు ఉత్పత్తి కారణంగా మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు తమ పంటను చట్టబద్ధమైన వేలం ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు మార్గం సుగమమైంది. అదేవిధంగా పొగాకు బోర్డులో నమోదైన వ్యాపారులు, డీలర్లు ఈ పొగాకును కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రక్రియకు కేంద్ర అనుమతి కల్పించింది. రాష్ట్రంలో 53,263 మంది నమోదిత రైతులు, మరికొంత మంది అనధికారిక రైతులకు మేలు చేకూరుతుంది.


