అనపర్తి: రంగంపేట మండలం దొంతమూరు క్వారీ వ్యవహారంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి డబ్బులు ఇచ్చానని ప్రమాణానికి సిద్ధం కావాలని క్వారీ కాంట్రాక్టర్ సవాల్ విసిరి ఏడేళ్లు కావొస్తుందని, దానిపై ఇప్పటి వరకు మౌనం వహించడం అంగీకారమా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం అనపర్తి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. క్వారీ యజమాని అప్పట్లో బహిరంగంగా చేసిన సవాల్‌కు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం ఏంటని అన్నారు. ఇటీవల దొంతమూరులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తాను క్వారీకి అనుమతులు ఇప్పించడం వల్ల మట్టి తరలింపుతో రహదారులు ధ్వంసమయ్యాయని ఎమ్మెల్యే ఆరోపించడాన్ని సూర్యనారాయణరెడ్డి ఖండించారు. తనపై ఆరోపణలు చేసే ముందు గతంలో క్వారీ యజమాని చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్వారీకి ఎన్‌ఓసీ ఇప్పించే విషయంలో అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనుచరుల ద్వారా రూ.18 లక్షలు తీసుకున్నారని క్వారీ యజమాని గతంలో మీడియా వద్ద చెప్పిన మాటలు రికార్డు అయ్యి ఉన్నాయన్నారు. ఆ ఆరోపణలు అబద్ధమైతే బిక్కవోలు వినాయకుని ఆలయం వద్ద ప్రమాణానికి రావాలని, ఇచ్చినట్టు తాను ప్రమాణం చేస్తానని క్వారీ యజమాని అప్పట్లోనే ఆయనకు సవాల్ విసిరారని గుర్తుచేశారు. ఈ వ్యవహారం జరిగి దాదాపు ఏడేళ్లు గడిచినా సవాల్‌ను స్వీకరించకపోవడం, ఆరోపణలపై వివరణ ఇవ్వకపోవడం చూస్తుంటేనే అసలు విషయం అర్థమవుతుందన్నారు. క్వారీ యజమాని మాట్లాడిన పాత వీడియోను ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోను విడుదల చేస్తున్నామని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఫ సవాల్‌కు ఎమ్మెల్యే సమాధానం ఏదీ?
ఫ మాజీ ఎమ్మెల్యే డాక్టర్
సూర్యనారాయణరెడ్డి ప్రశ్న


