మహా ప్రసాదం స్వామీ.. | - | Sakshi
Sakshi News home page

మహా ప్రసాదం స్వామీ..

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

బియ్యం మార్పుతో మారనున్న రుచి

సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో అన్నం వండే బియ్యం అంత నాణ్యంగా లేకపోవడంతో వేడిగా ఉన్నప్పుడు అన్నం బాగానే ఉన్నా, వేడి తగ్గితే తినలేని పరిస్థితి. ఈ బియ్యం విక్రయాల్లో మంచి పేరు పొందిన ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసి టెండర్‌దారుడు ఆ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. మొదట ఆ సంస్థ బియ్యం బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అన్నం చల్లారితే భక్తులు తినలేకపోతున్నారు.

దీనికి ప్రధాన కారణం ఆర్జెల్‌ బియ్యం సన్నబియ్యంగా మార్చి సరఫరా చేస్తున్నట్లు తేటతెల్లం అయ్యింది. సెప్టెంబర్‌ నెలాఖరుతో ఆ బియ్యం కాంట్రాక్ట్‌ ముగుస్తుండడంతో అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి బీపీటీ బియ్యం (సన్న బియ్యం) సరఫరాకు టెండర్‌ పిలిచారు. రేటు ఎక్కువైనా భక్తులకు నాణ్యమైన బియ్యంతో చేసిన అన్నంతో భోజనం పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై రుచికరంగా సత్యదేవుని అన్నప్రసాదం

ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం అమలు

ఆహార పదార్థాల తయారీలోనూ మార్పులు

అన్నవరం: ఇక నుంచి సత్యదేవుని అన్నప్రసాదం మరింత రుచికరం కానుంది. దీనికి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన పథకంలో మార్పులకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్నం తయారీకి ఉపయోగిస్తున్న బియ్యాన్ని మార్చడంతో పాటు కుక్‌ల నియామకానికి కూడా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ చర్యలన్నీ వారం, పది రోజుల్లోనే పూర్తి చేసి అన్నదానంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఒకప్పుడు స్వామివారి అన్నదానంలో భోజనం అంటే చాలా బాగుండేది. వివిధ కారణాలతో ఆ భోజనంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గత నెల 22న ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నప్రసాదంపై భక్తుల అసంతృప్తి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు అన్నదాన పథకంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.

చేయి తిరిగిన పనివారి కోసం..

అన్నదాన విభాగంలో ఒకప్పుడు చేయి తిరిగిన (కుక్స్‌) వంట చేసేవారు. వారు పదవీ విరమణ చేశాక రెగ్యులర్‌ కుక్స్‌ లేరు. తాత్కాలిక పద్ధతిపై పనిచేసే వారే ఉండడం, వారికంత అనుభవం లేకపోవడం కూడా ఆహార పదార్థాల నాణ్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. దీంతో అనుభవం కలిగిన కుక్స్‌ నియామకం కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. నెలకు రూ.30 వేల వరకు చెల్లించేందుకు నిర్ణయించారు. ఏడాది తరువాత ఆ మొత్తం ఇంకా పెంచనున్నారు. ప్రస్తుతం వాడపల్లి దేవస్థానం నుంచి తాత్కాలికంగా వంట వారిని తీసుకువచ్చి వంటలు చేయిస్తున్నారు. ఆ కుక్స్‌ పనితీరు బాగుంటే కొన్నాళ్లు ఇక్కడ ఉంచి ఇక్కడ పనిచేసే కుక్స్‌కు తర్ఫీదు ఇవ్వనున్నారు.

పెరగనున్న భోజన వ్యయం

ప్రస్తుతం ఒక భోజనం తయారీకి రూ.39 ఖర్చవుతుందని అంచనా. ఇందులో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం, పులిహోర, అన్నం, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వడ్డిస్తారు. అయితే అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి అన్నంతో పాటు పప్పులు, వంట నూనె, తదితర దినుసుల సరఫరాకు కొత్త టెండర్లు అమలులోకి రానున్నాయి. గతంలో కంటే సుమారు 15 శాతం నుంచి 20 శాతం ధరలు పెరగనున్నట్లు సమాచారం. దానివల్ల ఒక భోజనానికి అయ్యే వ్యయం రూ.45కి పెరిగే అవకాశం ఉందని అంచనా.

మరింత రుచిగా ఉండేలా చర్యలు

సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో మార్పులకు చర్యలు తీసుకుంటున్నాం. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం సరఫరా కానుంది. అనుభవం కలిగిన వంట వారిని నియమించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చాం. ప్రస్తుతానికి వాడపల్లి నుంచి ఒక కుక్‌ వచ్చి వంటలు చేసేలా ఏర్పాటు చేశాం. అన్నదానం ఉదయం పది గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నాం. సాంబారులో కొబ్బరి కోరు వేయడానికి, కొబ్బరి పచ్చడి వేసేందుకు ప్రయత్నిస్తాం.

–నల్లం సూర్య చక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

ఉదయం పది గంటల నుంచే..

గతంలో ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు అన్నదానం ప్రారంభించేవారు. అయితే చాలా మంది భక్తులు ఉదయం పది గంటలకే సత్యదేవుని వ్రతం, దర్శనం పూర్తి చేసుకుని అన్నదానంలో భోజనం చేయాలన్న తలంపుతో అక్కడే వేచి ఉంటున్నారు. ఈ విషయం గమనించి ఉదయం పది గంటల నుంచే అన్నదానం ప్రారంభించాలని ఈఓ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement