తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేట గజ్జరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మరపట్ల రాజు ఆదివారం రాత్రి తాళ్లపూడి అపోలో మెడికల్స్‌లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కాగా, రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అతని తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతానికి
వ్యక్తి మృతి
నిడదవోలు రూరల్: వెల్డింగ్ పనులు చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన కోమలి ప్రసన్నకుమార్ (36) కొంతకాలంగా మద్దూరు వంతెన సమీపంలో వెల్డింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. సోమవారం సాయంత్రం వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురవ్వడంతో నిడదవోలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అతని భార్య చంద్రిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.


