రాజానగరం: ‘ఓపెన్ ఏఐ’ వ్యవస్థలను విజయవంతంగా హ్యాక్ చేసిన ముగ్గురు భారతీయ నిపుణుల్లో ఒకరైన మోహన్ శ్రీరామకృష్ణ పెదపాటి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం, కొండగుంటూరుకు చెందిన యువకుడే కావడం విశేషం. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ ‘హ్యాక్‌ట్రాన్ ఏఐ’లో పని చేస్తున్న హర్ష్ జైశ్వాల్, రాహుల్ మియానీ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి ‘కృత్రిమ మేథ’ ఇటీవల నిర్వహించిన ‘బంక్ – బౌంటీ’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ వ్యవస్థలను హ్యాక్ చేసి, లోపాలను కనుగొన్నందుకు ఈ ముగ్గురూ 6,500 డాలర్లు (రూ.5.5 లక్షలు) బహుమతిగా అందుకున్నారు. ఇదిలా ఉండగా కొండగుంటూరుకు చెందిన మోహన్ శ్రీరామకృష్ణ పెదపాటి రైతు కుటుంబం నుంచి వచ్చారు. అతని తండ్రి పెదపాటి వెంకటరెడ్డి, తల్లి అమ్మాజీ. చెల్లెలు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేస్తుంది. ఈ యువకుడు మండలంలోని సంపత్‌నగరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకుని, నూజివీడు ట్రిబుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. హ్యాక్‌ట్రాన్ ఏఐకి సహ వ్యవస్థాకుడిగా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ) పని చేస్తున్నారు. వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సోర్స్‌కోడ్ రివ్యూ, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు. రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూరిటీ ఆడిటింగ్ సంస్థ ఎలెక్ట్రోవోల్డ్ సెక్యూరిటీ వ్యవస్థాపకులు.


